మిత్ర ధర్మం..!

కోదండ అడవిలో రకరకాల జంతువులు, పక్షులు ఉండేవి. అందులో ఒక చిన్న కొలను కూడా ఉండేది. ఆ అడవిలో ఉండే జీవులకు దాహం వేసినప్పుడల్లా ఇక్కడికే వచ్చి నీళ్లు తాగేవి. కొలనులో చాలా చేపలు ఉండేవి. అందులో స్వర్ణముఖి కూడా ఒకటి.

Published : 27 Jan 2024 00:36 IST

కోదండ అడవిలో రకరకాల జంతువులు, పక్షులు ఉండేవి. అందులో ఒక చిన్న కొలను కూడా ఉండేది. ఆ అడవిలో ఉండే జీవులకు దాహం వేసినప్పుడల్లా ఇక్కడికే వచ్చి నీళ్లు తాగేవి. కొలనులో చాలా చేపలు ఉండేవి. అందులో స్వర్ణముఖి కూడా ఒకటి. దానికి అక్కడికి వచ్చిన పక్షులు, జంతువులతో మాట్లాడాలని, స్నేహం చేయాలని ఉండేది. కానీ.. అవేవీ దానితో మాట్లాడక పోయేసరికి చాలా బాధపడేది. బయటికి వచ్చి వాటిని చూస్తూ.. నిరాశగా మళ్లీ లోపలికి వెళ్లిపోయేది. ఆ కొలను పక్కనే పెద్ద నేరేడు చెట్టు కూడా ఉండేది.

ఒకసారి ఎప్పటిలాగే అటూ ఇటూ ఈదుతూ.. బయటికి చూసిందా స్వర్ణముఖి. ఎవరో వెనక నుంచి తరుముతున్నట్లుగా ఒడ్డువైపు పరిగెత్తుకొచ్చింది ఒక కోతి. పరిగెత్తి పరిగెత్తి.. అలసిపోయిన దానికి కొలనును చూడగానే ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించింది. మెల్లగా వెళ్లి.. కొలనులోని నీళ్లు తాగి, ఒడ్డు మీద కూర్చుందా కోతి. దాన్ని చూసిన స్వర్ణముఖి.. ‘ఏమైంది నీకు? ఎందుకలా పరిగెత్తుకొచ్చావు?’ అని అడిగింది. ‘సింహం నన్ను వెంటాడింది. ఎలాగోలా దాని నుంచి తప్పించుకొని ఇలా వచ్చాను’ అని జరిగిందంతా వివరించింది కోతి. ‘అయ్యో! అవునా.. ఇప్పుడు ఎలాంటి ప్రమాదం లేదు కదా. ఆకలితో ఉన్నట్లున్నావు.. ఈ చెట్టుకు నేరేడు పండ్లు ఉన్నాయి. ముందు అవి తెంపుకొని తిను మిత్రమా..!’ అని ఆప్యాయంగా అంది స్వర్ణముఖి. అవునా.. అంటూ చెట్టెక్కి కడుపునిండా పండ్లు తిన్నది కోతి. ‘ఆకలిగా ఉన్న నాకు పండ్లు చూపించి ఆకలి తీర్చావు.. నీ సాయం ఎప్పటికీ మర్చిపోను’ అంది. ‘ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. ఈ అడవే మన అవసరాలన్నీ తీరుస్తుంది. కానీ.. నాదొక చిన్న కోరిక. ఈ కొలనులో చాలా కాలం నుంచి ఉంటున్నాను. కారణం తెలియదు కానీ.. ఇక్కడికి వచ్చే ఏ పక్షీ, ఏ జంతువు నాతో స్నేహం చేయడం లేదు. నువ్వు అయినా.. నాతో స్నేహం చేస్తావా? ఇక్కడ ఎంచక్కా.. తాగడానికి నీరు, తినడానికి పండ్లు ఉన్నాయి. హాయిగా కబుర్లు చెప్పుకుంటూ గడుపుదాం’ అని చిన్నగా అడిగింది స్వర్ణముఖి. ‘హో..! కచ్చితంగా’ అంటూ సంతోషంగా జవాబిచ్చింది కోతి.

ఆరోజు నుంచి స్వర్ణముఖి, కోతి రెండూ మంచి స్నేహితులయ్యాయి. కోతి చెట్టెక్కి నేరేడు కొమ్మను గట్టిగా ఊపగానే నేరేడు పండ్లన్నీ కింద రాలాయి. నీటిలో ఉన్న స్వర్ణముఖి చెంగున ఎగిరి నోటితో పండును అందుకొని.. ‘చూశావా! ఎలా అందుకున్నానో’ అంటూ కోతి వైపు చూసి నవ్వింది. దానికి ‘భలే.. భలే..!’ అంటూ కోతి ఆనందంగా చప్పట్లు కొట్టింది. ఒకరోజు జాలరి భుజానికి సంచి, చేతిలో వల పట్టుకొని కొలను వద్దకు వచ్చాడు. అది చూసి భయపడిన స్వర్ణముఖి.. ‘ఈ రోజుతో నాకు నూకలు చెల్లాయి. సాయంత్రానికి అతనికి పులుసుగా మారాల్సిందేనా?’ అని బాధగా అంటూ చెట్టుపైన కూర్చున్న కోతి వైపు చూసింది. అది గమనించిన కోతి.. ఎలాగైనా స్వర్ణముఖిని కాపాడుకోవాలని నిర్ణయించుకుంది. కానీ అందుకోసం ఏం చేయాలో తెలియలేదు దానికి. ఆ జాలరి తన దగ్గర ఉన్న సంచిని అక్కడ పెట్టి, వలను కొలనులోకి వేశాడు. అది చూసి భయపడిన స్వర్ణముఖి అవతలి ఒడ్డుకు వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత వలను తీసి చూశాడా వ్యక్తి. కానీ ఒక్క చేప కూడా అందులో పడలేదు. మరోవైపు వెళ్లి.. మళ్లీ వల వేశాడు. ఈసారి అందులో స్వర్ణముఖితో సహా.. చాలా చేపలు పడ్డాయి. పాపం అవన్నీ గిలగిలా కొట్టుకోసాగాయి. అది చూసిన కోతి ఆగ్రహంతో జాలరి మీదికి దూకేసింది. దాంతో అతడు భయపడి.. వలను అక్కడే వదిలేసి పరుగందుకున్నాడు. అప్పుడు వలలో చిక్కుకున్న చేపలన్నీ బయటకు వచ్చేశాయి. ఎప్పటిలా కొలనులో ఈదుతున్న స్వర్ణముఖి.. ‘మిత్రమా! నీ ప్రాణాలకు తెగించి నన్ను కాపాడావు. ఏమిచ్చినా.. నీ ఋణం తీర్చుకోలేను’ అని అంది. ఆపదలో ఉన్నప్పుడు కాపాడటమే మిత్ర ధర్మం కదా!’ అని బదులిచ్చింది కోతి. ఇక అప్పటి నుంచి ఆ జాలరి అటువైపు రాకపోవడంతో.. రెండూ ఆనందంగా జీవించసాగాయి.

ముక్కామల జానకీరామ్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని