చెట్లకు చెవులుంటాయి.. మృగరాజా!

చిత్రవనానికి ప్రచండుడు అనే సింహం రాజుగా, చుక్కాని అనే కుందేలు మంత్రిగా ఉండేవి. మృగరాజు కాస్త అమాయకమైనది.

Updated : 28 Jan 2024 04:39 IST

చిత్రవనానికి ప్రచండుడు అనే సింహం రాజుగా, చుక్కాని అనే కుందేలు మంత్రిగా ఉండేవి. మృగరాజు కాస్త అమాయకమైనది. ఒకరోజు అది కుందేలును పిలిచి.. ‘నాకు కొంచెం అనారోగ్యంగా ఉంది. ఒక మూడు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నాను. నేను అప్రమత్తంగా లేనని పక్క అడవి జీవులకు తెలిస్తే, మన అడవి మీద దండెత్తడానికి ప్రయత్నిస్తాయి. అలా జరిగితే మన జంతువులన్నింటికీ ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి నా అనారోగ్య రహస్యాన్ని ఎవరితోనూ చెప్పకు’ అంది. ఆ మాటలు విన్న చుక్కాని గట్టిగా నవ్వింది.

దాంతో ‘నా మాటలకు అసలు నీకు నవ్వెందుకు వస్తోంది’ అని కాస్త కోపంగా అడిగింది సింహం. ‘ఎప్పుడైనా రహస్యాన్ని నెమ్మదిగా చెప్పాలి, కానీ మీరు గట్టిగా చెప్పారు. అందుకే నవ్వొచ్చింది’ అని బదులిచ్చింది కుందేలు. ‘ఇక్కడ నువ్వు, నేను తప్ప మరెవరూ లేరు కదా! అందుకే గట్టిగా చెప్పాను. అయినా ఎవరికి తెలుస్తుంది’ అని సమర్థించుకుంది సింహం.

‘మన చుట్టూ చాలా చెట్లున్నాయి. వాటికి చెవులుంటాయి.. అవి వింటాయి’ అంది కుందేలు. ‘నాకు ఆరోగ్యం బాగోలేదని తెలిసి.. నీకేమైనా పిచ్చి పట్టిందా. చెట్లకు చెవులుండటం ఏంటి? నేను మాట్లాడిన మాటలు గాలిలో కలిసిపోతాయి. కానీ వాటిని ఇతర జంతువుల వరకు తీసుకెళ్లలేవు కదా!’ అని అడిగింది మృగరాజు.

‘సరే.. మృగరాజా! మీ రహస్యం నాకు మాత్రమే తెలుసు. కాబట్టి.. నేను మీ దగ్గరే ఉంటాను. మరే జీవికైనా మీరు చెప్పిన విషయం తెలిసిందో లేదో చూద్దాం!’ అంటూ అక్కడే కూర్చుండిపోయింది కుందేలు. ఆ మాటలు విన్న సింహం ‘అలాగే చూద్దాం’ అంటూ దాని పక్కనే కూర్చుంది.

కొంత సమయం గడిచిన తర్వాత.. ‘మృగరాజా! మీరు నీరసంగా ఉన్నారని తెలిసింది. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది?’ అంటూ ఏనుగు అక్కడికి వస్తూనే అడిగింది. దాని మాటలకు ఆశ్చర్యపోయిన సింహం.. ‘ఇప్పుడు కొంచెం పర్వాలేదు’ అని బదులిచ్చి, ఇంతకీ నా అనారోగ్యం గురించి నీకెలా తెలిసింది’ అని అడిగింది.

‘నేను ముందే చెప్పానుగా..!’ అంటూ సింహం వైపు చూస్తూ నవ్వింది చుక్కాని. దాంతో కోపంగా చూసింది మృగరాజు. ‘నేను మీ వద్దనే ఉన్నాను కదా. ఏనుగుతో నేనేం చెప్పలేదు’ అంది కుందేలు. ‘నువ్వు చెప్పలేదని నాకూ తెలుసు. కానీ దానికి ఎలా తెలిసిందా అని ఆలోచిస్తున్నా’ అంది ప్రచండుడు.

‘మీరు అనారోగ్యంగా ఉన్న విషయం నాకు జింక చెబితే తెలుసు’ అని చెప్పింది ఏనుగు. అదే సమయంలో అక్కడికి వచ్చిన జింక.. ‘మృగరాజా! మీ ఆరోగ్యం ఎలా ఉంది’ అని అడిగింది. ‘నేను బాగానే ఉన్నాను. కానీ నా విషయం నీకెలా తెలిసింది’ అని ప్రశ్నించింది మృగరాజు. ‘నాకు నక్క మామ చెప్పింది’ అందది. ఆ తర్వాత ఒకదాని వెనక మరొకటి అడవిలోని జంతువులన్నీ మృగరాజును చూడటానికి వస్తూనే ఉన్నాయి.

అన్ని జీవులూ వచ్చాక.. ‘ఇంతకీ మీకు ఈ విషయం మొదటగా చెప్పింది ఎవరు?’ అని చిరాగ్గా అడిగింది సింహం. మీ గుహ దగ్గర చెట్టు మీద ఉండే కాకి చెప్పింది అని బదులులిచ్చింది నక్క.

అప్పుడే అక్కడికి వచ్చిన కాకి, మృగరాజుతో.. ‘మీరు కుందేలుతో మీ అనారోగ్యం విషయం చెబుతున్నప్పుడు, నేను చెట్టు మీదే ఉన్నాను. ఆత్రంగా వెళ్లి కనబడిన అన్ని జీవులకు చెప్పుకుంటూ వచ్చాను’ అంది.

దాంతో.. ‘ఇప్పుడు తెలిసిందా మృగరాజా! చెట్లకు చెవులుంటాయని నేనెందుకు అన్నానో. రహస్యాన్ని చెప్పాలనుకున్నప్పుడు చుట్టుపక్కల గమనించిన తర్వాత చెప్పాలి. లేదంటే.. మనకే ప్రమాదం. ఇది మీ ఆరోగ్యం గురించి కాబట్టి సరిపోయింది. మరే విషయమైనా అయి ఉంటే.. అది శత్రువులకు తెలిసి ఉంటే.. మన ఉనికికే ప్రమాదం’ అని అంది కుందేలు. ‘అవును నువ్వు చెప్పింది నిజమే..’ అంటూ అక్కడి నుంచి లేచిన మృగరాజు.. ‘ఇప్పుడు నాకు బాగా ఆకలిగా ఉంది. ఆహారం కోసం నేనేం తింటానో మీకు తెలుసుగా!’ అని గట్టిగా గర్జించింది.

దాంతో.. ‘అమ్మో..!’ అంటూ కుందేలుతో సహా జీవులన్నీ అక్కడి నుంచి పరుగులు పెట్టాయి. ‘హమ్మయ్య! ఇక విశ్రాంతి, తీసుకోవచ్చు’ అని నవ్వుకుంటూ గుహలోకి నడిచింది సింహం.

కె.వి.లక్ష్మణరావు

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు