చివరికి గెలిచింది సమర్థుడే!

వైశాలీ రాజ్యాన్ని కీర్తిసేనుడు పాలించేవాడు. ఒకసారి ఆ రాజ్యంలో ముఖ్యమైన పదవికి ఖాళీ ఏర్పడింది. మంత్రి ఇచ్చిన సలహా ప్రకారం.. ‘కొన్ని రోజుల్లో పెట్టబోయే పరీక్షలో నెగ్గిన వారికి ఆ పదవిని ఇస్తాను’ అని దండోరా వేయించాడు మహారాజు

Updated : 31 Jan 2024 05:11 IST

వైశాలీ రాజ్యాన్ని కీర్తిసేనుడు పాలించేవాడు. ఒకసారి ఆ రాజ్యంలో ముఖ్యమైన పదవికి ఖాళీ ఏర్పడింది. మంత్రి ఇచ్చిన సలహా ప్రకారం.. ‘కొన్ని రోజుల్లో పెట్టబోయే పరీక్షలో నెగ్గిన వారికి ఆ పదవిని ఇస్తాను’ అని దండోరా వేయించాడు మహారాజు. ఆ ప్రకటన విని రాజ్యంలోని చాలామంది యువకులు పోటీలో పాల్గొనడానికి వచ్చారు. వాళ్లందరికి మొదటి పరీక్ష నిర్వహించి, అందులో నుంచి కొంతమందిని ప్రాథమికంగా ఎంపిక చేశాడు మంత్రి. వారికి మరుసటి రోజు ఇంకో పరీక్ష ఉంటుందని చెప్పి పంపించారు. తెల్లవారగానే.. ముందురోజు ఎంపికైన వాళ్లందరూ రెండో పోటీకి వచ్చారు. ఈ పోటీని దూరంగా ఉన్న రాజభవనంలో ఏర్పాటు చేశారు. ‘మహారాజు వచ్చిన తర్వాత పోటీ నిర్వహిస్తాము. అప్పటి వరకు మీకు కేటాయించిన ఆసనాల్లో కూర్చోండి’ అని చెప్పి, అక్కడ ఒక రాజ ప్రతినిధిని పెట్టి వెళ్లిపోయాడు మంత్రి. అయిదు గంటలు ఎదురుచూసినా రాజు రాలేదు, మంత్రి జాడ లేదు. అప్పుడు కొందరు యువకులు ఆ ప్రతినిధి దగ్గరకు వెళ్లి.. ‘అయ్యా! ఏమైంది? రాజుగారు రాలేదేమిటి? మేము ఇంకా ఎంతసేపు ఎదురుచూడాలి? కాస్త బయట తిరిగి వస్తాం’ అని వెళ్లిపోయారు. ఆ తర్వాత ఇంకొంత మంది కూడా వెళ్లారు. కాసేపటికి మరికొంత మంది.. ‘రాజు వచ్చిన తర్వాత మాకు మీ భటుని ద్వారా కబురు పంపండి. వెంటనే వచ్చేస్తాం’ అన్నారు.

అలా ఇంకొన్ని గంటలు గడిచాయి. సూర్యాస్తమయం అయినా మహారాజు మాత్రం రాలేదు. చివరికి ఆ భవనంలో ఒకే ఒక్క వ్యక్తి మిగిలాడు. అతని పేరు సమర్థుడు. తను చాలా పేదవాడు, తెలివైనవాడు. అతన్ని గమనించిన రాజప్రతినిధి.. ‘అందరూ సరదాగా బయటకు వెళ్లారు.
నువ్వు వెళ్లవా?’ అని అడిగాడు. ‘నేను ఇక్కడికి పోటీలో పాల్గొనడానికి వచ్చాను. రాజు, మంత్రికి ఎన్నో పనులు ఉంటాయి. వారు ఏ సమయంలోనైనా రావచ్చు. ఏ క్షణమైనా మీరు పోటీలు నిర్వహించవచ్చు. అందుకే మీరు వెళ్లమని  చెప్పేంత వరకు నేను ఇక్కడే ఉంటాను’ అని జవాబిచ్చాడు సమర్థుడు. అలాగేనంటూ.. బయటికి వెళ్లిన ఆ వ్యక్తి కాసేపటికి లోపలికి వచ్చి.. ‘పోటీలు రేపు నిర్వహిస్తామని రాజుగారు ఇప్పుడే కబురు పంపారు. మీరు ఇంటికి వెళ్లి, రేపు రండి’ అని చెప్పాడు. దాంతో సమర్థుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బయట ఉన్న వాళ్లందరూ కూడా విషయం తెలుసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు.
మరుసటి రోజు ఉదయాన్నే అందరూ పోటీకి వచ్చారు. ఒక పెద్ద మైదానంలో యువకులందరినీ దూరందూరంగా నిలబెట్టారు. వాళ్లకు ఎదురుగా మంత్రి నిల్చొని.. ‘చూడండి యువకుల్లారా! ఇక్కడ అందరికీ సరిపోయేన్ని బంతులు ఉన్నాయి. నేను రమ్మని చెప్పగానే మీరందరూ వచ్చి, తలా ఒక బంతిని తీసుకోవాలి’ అని వివరించాడు. దానికి
సరేనంటూ తలూపారు వాళ్లంతా. మంత్రి వాళ్లను రమ్మని సైగ చేయగానే.. ‘ఒకరిని మించి మరొకరు పరుగు పందెంలా పరిగెత్తడం ప్రారంభించారు. సమర్థుడు మాత్రం నడుచుకుంటూ వెళ్లాడు. అప్పుడు కొందరు యువకులు సమర్థునితో.. ‘నువ్వు ఇలా నెమ్మదిగా వెళితే ఎలా గెలుస్తావు? వేగంగా పరిగెత్తి  బంతిని తీసుకో’ అని సలహా ఇచ్చారు. అయినా వారి మాటలు పట్టించుకోకుండా.. అతను నడుచుకుంటూనే వెళ్లి, అందరి కంటే చివరగా బంతిని తీసుకున్నాడు. ఈలోపు ముందుగానే పరుగున వెళ్లి బంతి తీసుకున్న యువకుడు మంత్రి వద్దకు చేరుకున్నాడు. ‘నేనే విజేత.. నేనే విజేత’ అని గట్టిగా అరవసాగాడు. కానీ.. మంత్రి సమర్థుణ్ని విజేతగా ప్రకటించాడు. అప్పుడు వేగంగా పరిగెత్తి మొదటి స్థానం పొందిన యువకుడు.. ‘అందరికన్నా ముందు వచ్చి బంతిని పట్టుకున్నది నేను. కానీ మీరు చివరిగా వచ్చిన ఈ సమర్థుణ్ని విజేతగా ప్రకటించడం చాలా అన్యాయం’ అని అన్నాడు. అప్పుడు మంత్రి ‘ఈ పదవిలో ఉండేవారికి చాలా ఓపిక ఉండాలి. ఎలాంటి ఆలోచన లేకుండా పరిగెత్తుకొని ముందుకు వెళ్లిపోకూడదు. నేను అందరికీ సరిపడా బంతులు ఉన్నాయని ముందుగానే చెప్పాను. అలాంటప్పుడు పరిగెత్తడం ఎందుకు.
ఏ సమస్యకైనా పరిష్కారాన్ని, నిదానంగా ఓర్పుతో ఆలోచించాలి. అప్పుడే సరైన సమాధానం దొరుకుతుంది. రెండో పరీక్షలో కూడా చాలా ఓర్పుతో ఎక్కడికీ కదలకుండా కూర్చొని
ఎదురుచూసింది ఈ సమర్థుడే కదా! మీ ఓపికను పరీక్షించడమే మాకు ప్రధానం. అందుకే నిన్న ఆ పరీక్ష పెట్టాము. సమయస్ఫూర్తితో ఆలోచించిన సమర్థుడే
ఈ పోటీల్లో విజయం సాధించాడు. అందువల్ల అతన్నే ఈ పదవికి ఎంపిక చేస్తున్నాము’ అని చెప్పాడు.
- సంగనభట్ల చిన్న రామకిష్టయ్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని