బావిలో కప్ప.. గట్టున తొండ!

రామాపురంలో ఓ బావి ఉంది. ఇంటింటికీ కుళాయిలు వచ్చాక ఆ బావి వాడకం తగ్గింది. అయితే అక్కడ చేద మాత్రం ఒకటి ఉండిపోయింది. ఎప్పుడో ఒకసారి ఏ బాటసారో, పొలం నుంచి వచ్చే రైతో దానితో నీళ్లు తోడుకునేవారు. ఆ బావిలో ఉన్న కప్పకు అప్పుడే కాస్త సందడి. ఎవరూ రాని రోజుల్లో తోచనప్పుడల్లా బెకబెకలు మొదలుపెట్టేది. అది వినగానే ఓ తొండ బావి గట్టు మీదకు వచ్చి కప్పను పలకరించేది. ఇలా వాటి మధ్య స్నేహం పెరిగింది.

Published : 01 Feb 2024 04:48 IST

రామాపురంలో ఓ బావి ఉంది. ఇంటింటికీ కుళాయిలు వచ్చాక ఆ బావి వాడకం తగ్గింది. అయితే అక్కడ చేద మాత్రం ఒకటి ఉండిపోయింది. ఎప్పుడో ఒకసారి ఏ బాటసారో, పొలం నుంచి వచ్చే రైతో దానితో నీళ్లు తోడుకునేవారు. ఆ బావిలో ఉన్న కప్పకు అప్పుడే కాస్త సందడి. ఎవరూ రాని రోజుల్లో తోచనప్పుడల్లా బెకబెకలు మొదలుపెట్టేది. అది వినగానే ఓ తొండ బావి గట్టు మీదకు వచ్చి కప్పను పలకరించేది. ఇలా వాటి మధ్య స్నేహం పెరిగింది.

అయితే కొన్నాళ్లకు తొండ బుద్ధిలో మార్పు వచ్చింది. ‘విశాల ప్రపంచం నాది అయితే, ఎవరూ కనబడని ఆ బావే కప్ప ప్రపంచం. నేనెక్కడ, ఆ కప్ప ఎక్కడ?’ అని విర్రవీగింది. ‘‘ఏయ్‌ కప్పా! నేను రోజూ వచ్చి నీతో ఊసులాడుతున్నా కాబట్టి నీకు ఎన్నో సంగతులు తెలుస్తున్నాయి.. లేకపోతే బావిలోని నీళ్లు, చిన్నా చితకా పురుగులు తప్ప నీకు కనిపించేదేముంది, వినిపించేదేముంది? నువ్వు అజ్ఞానివి. అందుకే మనుషులు.. ‘బావిలో కప్పల్లే...’ అని సామెత వాడుతుంటారు తెలుసా?’ అంది వెటకారంగా.

ఆ మాటలకు కప్ప బాధపడుతూ.. ‘అంత ఎగతాళి ఎందుకు? నా బావిలోనూ ఎన్నో విశేషాలున్నాయి. సూర్య, చంద్రులు నాకు బావి నీళ్లలోనే దగ్గరగా దర్శనమిస్తారు’ అనడంతో తొండ మూతి విరిచింది. ‘కప్ప గప్పాలు ఎవరికి తెలియవు? బెకబెకమనడం తప్ప నీకేం తెలుసు’ అంటూ హేళన చేసి వెళ్లిపోయింది. కప్పకు ఆ అవమానం మరింత బాధ కలిగించింది.

ఆ రోజు నుంచి తొండ బావి గట్టు మీదకు రావడం, కప్పతో మాట్లాడడం మానేసింది. కప్ప ఎలాగైనా తొండ గర్వం అణచాలనుకుంది. ఆలోచించగా... దానికో ఉపాయం తట్టింది. అప్పటి నుంచి తగిన సమయం కోసం ఎదురుచూస్తోంది. ఓ రోజు బాటసారి ఎవరో వచ్చి బావిలో చేద వేశాడు. వెంటనే ఆ బకెట్‌లోకి గెంతింది కప్ప. చేద గట్టు మీదకు చేరగానే కప్ప గెంతుతూ దూరం వెళ్లింది.

చుట్టూ చూసింది... ‘అబ్బా! ఎంత విశాల ప్రపంచమో! ఈ బాటసారి పుణ్యమా అని బావి నుంచి బయటపడ్డాను. ఈ ప్రయత్నమేదో తాను ఇంతకుముందే చేస్తే ఎంత బాగుండేది’ అనుకుని మనసులోనే బాటసారికి కృతజ్ఞతలు చెప్పుకుంది. ఆ పక్కనే చిన్న తోట ఉంటే అటు నడిచింది. అలా తోటంతా తిరిగింది. దగ్గరలోనే పిల్ల కాలువ కూడా కనిపించింది. నీళ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. తనకిక ఏ సమస్యా లేదు’  అనుకుంది.

‘నేను ఉభయచర జీవి కాబట్టి నేల మీద, నీళ్లల్లో.. బతికేయగలను. నాకు ఇక ఏ ఇబ్బందీ ఉండదు’ అని మనసులోనే సంతోషపడింది కప్ప. ఆ రోజు నుంచి అది ఆ తోటలోనే హాయిగా కాలక్షేపం చేస్తోంది. ‘ఎప్పుడో ఓ రోజు తొండ కలవకపోతుందా, దాని గర్వం అణచకపోతానా’ అని అనుకుంది.

ఇలా రోజులు గడుస్తుండగా, ఓ రోజు దాని పూర్వ నివాసమైన బావిని ఒకసారి చూడాలనిపించింది. ‘గట్టు మీద నుంచే జాగ్రత్తగా తొంగి చూసి వచ్చేస్తా’ అనుకుంటూ హుషారుగా ముందుకు సాగింది. అంతలో స్నేహం చేసినట్లే చేసి, అవమానించిన తొండ ఎదురైంది. భూమ్మీదకు వచ్చానని చెపితే ఇప్పుడేమంటుందో అనుకుంటూ.. ‘నేస్తం బాగున్నావా?’ అని అదే ముందుగా పలకరించింది.

‘ఎవరూ?!’ పరీక్షగా చూస్తూ అడిగింది తొండ. ‘బావిలోని కప్పను. అప్పుడే మరిచిపోయావా’ అని అందది. ‘ఏంటీ.. నువ్వు.. బావిలోని కప్పవా!.. అబద్ధాలు చెబుతున్నావు. బావిలోని కప్ప బయటికెలా వస్తుంది? దాని జన్మంతా అందులోనే..’ అంది తొండ.

‘నేను ఆ కప్పనే. బయటకు ఎలా వచ్చానంటే..’ అంటూ అంతా వివరంగా చెప్పింది. ‘నేను బావిలోకి చూసి కానీ నమ్మను’ అని బదులిచ్చింది తొండ. ‘సరే అయితే పద.. నేనూ వస్తున్నా..’ అంటూ తొండ వెనకే వెళ్లింది కప్ప. తొండ బావి గట్టు మీద నుంచి లోపలికి తొంగి చూస్తూ.. ‘బావిలోని కప్పా! నువ్వు గుర్తొచ్చి నీ కోసం వచ్చా. ఒకసారి కనిపించు’ అని గట్టిగా పిలిచింది. కానీ అది కనిపించలేదు. బెక బెక వినిపించలేదు. తొండ ఇంకొంచెం ముందుకు వంగి మళ్లీ పిలిచింది.

వెనకే ఉండి దాని వృథా ప్రయాస చూస్తున్న కప్ప బెకబెక నవ్వింది. తొండకు చర్రున కోపం వచ్చింది. గిర్రున వెనక్కు తిరగబోయింది. కాలు పట్టు తప్పి బావిలో పడి.. ‘అయ్యో! అయ్యో!..’ అని అరుస్తూ, భయంగా వెంటనే బావి గోడను పట్టుకుంది. కప్ప బయటి నుంచి.. ‘అయ్యో లేదు, కుయ్యో లేదు. నా మాట నమ్మలేదు. నువ్వే మహా గొప్ప అనుకున్నావు. అహంకారంతో నన్ను అవమానించావుగా అనుభవించు’ కోపంగా అంది కప్ప.  

‘బుద్ధి గడ్డి తిని నిన్ను అవమానించినందుకు, నీ మాట నమ్మనందుకు క్షమించు నేస్తం. చెట్ల దగ్గర తిరగడం తప్ప నాకు మరొకటి తెలియదు. ఇంత లోతులో భయంగా ఉంది. ప్రాణాలు పోతాయేమో?’ వణుకుతూ అంది తొండ. కప్ప దాని మాటలు విని, జాలితో.. ‘భయపడకు. బావి గోడకు కుడివైపు చిన్న గూడు ఉంది. వెంటనే అందులోకి వెళ్లు. మనుషులు ఎవరైనా నీళ్ల కోసం వస్తే.. నువ్వు ఆ బొక్కెనకు అతుక్కుని ఉండి బయటపడు. అప్పటిదాకా జాగ్రత్తగా కాలక్షేపం చెయ్యి’ అని సలహా ఇచ్చింది.

‘చాలా చాలా ధన్యవాదాలు. నాకు గూడు సంగతి చెప్పి మేలు చేశావు. నీ సాయం మరిచిపోను మిత్రమా!’ అంది తొండ గూడు చేరుతూ. ‘సరేలే.. కష్టాల్లో కాకపోతే స్నేహితులెందుకు? నేనీ దగ్గరలోనే ఉండి, అప్పుడప్పుడు బెకబెకమంటా. నీకు ధైర్యంగా ఉంటుంది’ అని అంది కప్ప.

‘నువ్వెంత మంచిదానివి. నేను ఇక్కడే కదలకుండా ఉంటా’ అంది తొండ. మాట ప్రకారం మధ్య మధ్య బెకబెకలతో తొండను పలకరిస్తూనే ఉంది కప్ప. ఆ మర్నాడే తొండ అదృష్టం బాగుండి ఓ బాటసారి వచ్చి బావిలో నీళ్లు తోడడంతో, కప్ప చెప్పినట్లే తొండ బొక్కెనను పట్టుకుని బయట పడింది.

బయటపడ్డ తొండను చూసి.. ‘హమ్మయ్యా! గండం గట్టెక్కింది’ అంది కప్ప. ‘అంతా నీ మంచితనం వల్లే’ అని కృతజ్ఞతగా బదులిచ్చింది తొండ. అప్పటి నుంచి కప్ప, తొండ నిజమైన స్నేహితులయ్యాయి.

జె.శ్యామల


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు