ఫలించిన కుందేలు పథకం..!

చిత్రకొండ అడవికి ఒక సింహం మృగరాజుగా ఉండేది.. అది చాలా మంచిది. కానీ ఎక్కువ అవసరమైతే తప్ప ఏ విషయాన్ని పెద్దగా పట్టించుకునేది కాదు. అదే అడవిలో ఒక నక్క కూడా ఉంది. అది చాలా జిత్తులమారి.

Updated : 02 Feb 2024 00:26 IST

చిత్రకొండ అడవికి ఒక సింహం మృగరాజుగా ఉండేది.. అది చాలా మంచిది. కానీ ఎక్కువ అవసరమైతే తప్ప ఏ విషయాన్ని పెద్దగా పట్టించుకునేది కాదు. అదే అడవిలో ఒక నక్క కూడా ఉంది. అది చాలా జిత్తులమారి. పెద్ద జంతువులను వంచించి అవి చనిపోయేలా చేసేది. చిన్న వాటినేమో.. బెదిరించి చంపేసేది. మృగరాజు కంటే కూడా ఈ నక్క అంటేనే అన్నీ జంతువులకు ఎక్కువ భయం. అవి చాలాసార్లు దాని గురించి మృగరాజుకు ఫిర్యాదు చేసేవి. కానీ అది చెప్పే మాయ మాటలు విని సింహం దాని మీద ఎలాంటి చర్య తీసుకునేది కాదు. దాంతో ఆ అడవిలో అది ఆడిందే ఆటగా సాగేది.

ఆ నక్క.. ఒకరోజు ఏనుగును మాటలతో మభ్యపెట్టి అడవి చివర కొండ వద్దకు తీసుకెళ్లి పులికి బలయ్యేలా చేసింది. దాంతో విషయం తెలిసిన చిన్న జంతువులన్నీ మరింత భయపడ్డాయి. ‘మనం భయపడుతూ కూర్చుంటే.. సమస్య పరిష్కారం అవ్వదు. దానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి’ అంది జింక. ‘మనం ఇలా అనుకుంటున్న విషయం నక్కకు తెలిస్తే ఏ పులినో, చిరుతనో తీసుకొచ్చి మన మీద దాడి చేయిస్తుంది. మన చిన్న జంతువుల్లో తెలివైంది కుందేలు కాబట్టి దాన్ని సలహా అడుగుదాం’ అంది దుప్పి. ‘అవును అది నిజమే!’ అంటూ బదులిచ్చింది చెట్టు మీదున్న కాకి. మరుసటి రోజు ఉదయాన్నే జీవులన్నీ కలిసి కుందేలు దగ్గరకు వెళ్లాయి. దానికి విషయాన్ని మొత్తం వివరించాయి. అప్పుడు.. ‘మన గురించి అంటే.. మృగరాజు పట్టించుకోవడం లేదు. కానీ.. దాని వరకూ వస్తే ఊరుకుంటుందా?’ అంటూ.. ఒక పథకాన్ని వివరించిందది. తర్వాత రోజు జంతువులన్నీ ఒకచోట సమావేశమయ్యాయి. రకరకాల పువ్వులతో ఒక పెద్ద మాల తయారుచేశాయి. అడవిలో ఉండే పక్షుల గుడ్లు సేకరించి.. ఒక బుట్టలో నింపింది నెమలి. ఎలుగుబంటి సహాయంతో తేనె తీసుకొచ్చింది గున్నఏనుగు. ఇక అన్నీ కలసి.. నక్క గుహ దగ్గరకి బయలుదేరాయి.

 అక్కడికి వెళ్లాక జీవులన్నీ కలసి.. ‘నక్క మహారాజుకి జై’ అంటూ నినాదాలు చేశాయి. దాంతో.. ‘ఏంటీ గోల?’ అంటూ బయటకి వచ్చిందది. వెంటనే వెళ్లి నక్క మెడలో పువ్వుల దండ వేసింది కుందేలు. ఆ హడావిడి చూసిన నక్క.. ‘నేను మహారాజుని ఏంటి? మీకేమైనా మతిపోయిందా?’ అంటూ ఆశ్చర్యంగా అడిగింది. ‘మేమంతా కలిసి.. మా చిన్న జీవులకు మిమ్మల్ని మహారాజుగా ఎన్నుకున్నాం’ అని చెప్పింది కుందేలు. ‘వినడానికి బాగానే ఉంది. కానీ ఈ విషయం తెలిస్తే.. మృగరాజు ఊరుకుంటుందా?’ అంది నక్క. ‘సింహం పెద్ద జంతువులకు రాజు.. మీరు మాలాంటి చిన్న జీవులకు రాజు. అయినా.. సింహాన్ని రాజుగా ఎవరు నియమించారు. మేమంతా మీరు రాజుగా ఉండాలని కోరుకుంటున్నాం. అవసరమైతే ఆ మృగరాజుని ఎదిరిస్తాం’ అంది గున్న ఏనుగు. జంతువులన్నీ దాని పేరుతో నినాదాలు చేయడంతో.. దానికి గర్వంగా అనిపించింది. ‘అవసరమైతే ఏదోలా వంచించి మృగరాజుని కూడా చంపితే సరి. అప్పుడు అడవి మొత్తానికి నేనే రాజుని అవుతాను’ అని మనసులోనే అనుకుందది. అలా నక్కని రాజుని చేసి, అక్కడి నుంచి సింహం గుహ దగ్గరకు చేరుకున్నాయి జంతువులన్నీ.

అక్కడికి వెళ్లాక మృగరాజుతో కాకి.. ‘మృగరాజా! చిన్న జంతువులను బెదిరించి.. నక్క తనకు తానుగా రాజునని ప్రకటించుకుంది. పైగా మన అడవికి రాజు ఉందిగా అంటే.. ఆ సింహం రాజేంటి? సేవకుడిగా కూడా పనికిరాదు. నేనొక ఉపాయం ఆలోచించానంటే.. ఇక్కడి నుంచి పారిపోతుంది. అది నన్నేమీ చేయలేదు. రేపటి నుంచి దానికి ఆహారం దొరకకుండా చేసి ఆకలితో చంపేస్తాను’ అని నక్క అన్నట్లుగా వివరించింది. దాంతో మండిపడ్డ మృగరాజు.. ‘అంత పొగరా.. దానికి. నాకే ఎదురు తిరుగుతుందా... దాని సంగతి చెబుతాను’ అంటూ నక్క గుహ వైపు నడిచింది. అప్పటికే రాజుగా మారిన నక్క ఠీవిగా ఒక సింహాసనం ఏర్పరచుకుని కూర్చుంది. వచ్చిన సింహాన్ని పట్టించుకోలేదు సరికదా.. ‘ఏమిటిలా వచ్చావు?’ అని ఏకవచనంతో మాట్లాడింది. ‘ఏమీలేదు కొత్త రాజును కలుద్దామని వచ్చాను’ అంటూ నక్క మీదకు దూకి పంజాతో ఒక దెబ్బ కొట్టిందది. దాంతో నేల మీద పడి ప్రాణాలు విడిచిందా.. జిత్తులమారి. ఉపాయం ఫలించి, నక్క పీడ వదిలినందుకు జంతువులన్నీ సంతోషించాయి.  
కూచిమంచి నాగేంద్ర


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు