ఏ నిర్ణయం సరైంది..?

స్కందవనాన్ని కేసరి అనే సింహం పరిపాలించేది. అది అడవి జీవుల సంక్షేమం కోసం నిర్ణయం తీసుకునే ముందు.. జంతువులన్నింటికీ సమావేశం ఏర్పాటు చేసేది.

Published : 03 Feb 2024 00:07 IST

స్కందవనాన్ని కేసరి అనే సింహం పరిపాలించేది. అది అడవి జీవుల సంక్షేమం కోసం నిర్ణయం తీసుకునే ముందు.. జంతువులన్నింటికీ సమావేశం ఏర్పాటు చేసేది. వాటి అభిప్రాయాన్ని కూడా తెలుసుకునేది. మంత్రి అయిన ఎలుగుబంటి, కేసరితో.. ‘మృగరాజా! అడవి జీవుల సంక్షేమం నిమిత్తం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వాటి సమక్షంలో తీసుకోవడం, వాటి అభిప్రాయాల్ని సేకరించడం బాగానే ఉంది. కానీ జంతువులకు నచ్చిన నిర్ణయాలు అన్నీ.. వాటికి మేలు చేసేవి అయ్యి ఉండకపోవచ్చు. కాబట్టి మీరు అన్ని విషయాలు వాటితో చర్చించాల్సిన పని లేదు’ అని ఎప్పుడూ చెప్తుండేది. అయినా మృగరాజు మాత్రం ఏ పని చేయాలన్న అడవి జీవులకు సమావేశం ఏర్పాటు చేసేది.

ఒకసారి మృగరాజు ఒక ముఖ్యమైన సమావేశం ఏర్పాటు చేయాలనుకుంది. ఆ విషయాన్ని కాకి ద్వారా అన్ని జీవులకు తెలియజేసింది. ఆ మరుసటి రోజు ఏర్పాటు చేసిన సమావేశానికి.. అడవిలోని జంతువులు, పక్షులు హాజరయ్యాయి. ‘ఈ రోజు మీ అందరితో సమావేశం ఏర్పాటు చేయడానికి కారణమేమిటంటే.. మన అడవిలో ఉత్తర దిశగా మాత్రమే నీటి కొలను ఉంది. వచ్చేది వేసవికాలం.. అందుకే ఆ సమయంలో నీటి కొరత రాకుండా దక్షిణ దిశలో కూడా ఒక చెరువును మనం తవ్వుకోవాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నాను’ అంది మృగరాజు. ఆ వైపు ఉంటున్న జంతువులు, పక్షులన్నీ కేసరి నిర్ణయాన్ని అంగీకరించాయి. కానీ ఉత్తర దిక్కున నివసిస్తున్న ఒక తోడేలు ‘మృగరాజా! మన అడవిలో ఉన్న నీటి కొలనులో సమృద్ధిగా నీరు ఉంది. వేసవి వచ్చినా నీరు ఎండిపోయే ప్రమాదం ఏమీ లేదు. అనవసరంగా శ్రమను వృథా చేసి ఇంకో నీటి కొలను తవ్వడం సరైంది కాదు. అంతేకాకుండా ఇక్కడ నీటి కొలను దగ్గరకే అన్ని జీవులూ రావడం వల్ల వాటి మధ్య మంచి స్నేహం కొనసాగుతుంది. ఇప్పుడు మీరు అది ఏర్పాటు చేస్తే.. మా మధ్య దూరం పెరిగే అవకాశం ఉంది. అందుకే దక్షిణ దిశలో నీటి కొలను తవ్వాల్సిన అవసరం లేదు’ అని దాని అభిప్రాయాన్ని తెలియజేసింది. ఆ తోడేలు మాటలకు దక్షిణ దిశలో నివసిస్తున్న జీవులన్నీ వంతపాడాయి. దాంతో మృగరాజు నిర్ణయం తీసుకోకుండానే సమావేశం ముగించింది. అప్పుడు మృగరాజుతో.. ‘దక్షిణ దిక్కున నీటి కొలను తవ్వించడమే మంచిదని అనిపిస్తుంది. ఈ విషయంలో మీరు సొంత నిర్ణయం తీసుకోండి. అది ఈ అడవి జీవులకు కచ్చితంగా మంచి చేస్తుంది’ అంది ఎలుగుబంటి. అయినా అది నిర్ణయాన్ని మార్చుకోలేదు.

చూస్తుండగానే వేసవికాలం వచ్చేసింది. విపరీతమైన ఎండల వల్ల కేసరి చెప్పినట్లుగానే.. కొలను నీరు ఆవిరైపోయింది. ఇక అడవిలోని జంతువులు, పక్షులకు నీటి కొరత ఏర్పడింది. దాంతో జీవులన్నీ చుట్టపక్కల గ్రామాలకు వెళ్లసాగాయి. కొన్ని అక్కడే వేటగాళ్లకు చిక్కి ప్రాణాలు కూడా కోల్పోయాయి. కొన్ని రోజుల తర్వాత ఈ విషయం ఎలుగుబంటి ద్వారా మృగరాజుకు తెలిసింది. అప్పుడు మంత్రి.. ‘మృగరాజా! చూశారా.. ఆ రోజు మీరు తోడేలు మాట వినకుండా, మీ ఆలోచనను పాటించి ఉంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో. అందుకే.. కొన్నిసార్లు కష్టంగా ఉన్నా.. అందరికీ నచ్చేవి కాకుండా.. మంచి చేసే నిర్ణయాలే తీసుకోవాలి. ఈ విషయం మీకు అర్థమైందని అనుకుంటాను’ అంది. దానికి బదులిస్తూ.. ‘అవును మంత్రి! నువ్వు నాకు ఎన్నిసార్లు సూచించినా.. పట్టించుకోలేదు. అందరి ఆమోదయోగ్యమే కావాలని అనుకున్నాను. అప్పుడే ఆ కొలను తవ్వించి ఉంటే ఈరోజు ఈ దుస్థితి వచ్చేది కాదు. ఇక నుంచి నా పద్ధతి మార్చుకుంటాను. సాయంత్రం జరిగే సమావేశానికి అన్ని జీవులను హాజరవ్వమని కబురు పంపు’ అంది మృగరాజు.

గతంలో మృగరాజు నిర్ణయాన్ని వ్యతిరేకించిన తోడేలు కూడా ఆ సమావేశానికి వచ్చింది. అది సింహానితో.. ‘నన్ను క్షమించండి మృగరాజా! ఆ రోజు నేను మీ మాటను కాదన్నందువల్ల.. ఇప్పుడు అడవిలోని జీవులన్నీ కూడా నీళ్లు లేక బాధపడుతున్నాయి’ అంది. దానికి మృగరాజు.. ‘మరేం ఫర్వాలేదు.. ఇది మనకొక పాఠం లాంటిది. ప్రస్తుతం నీటి కొరతతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం కదా! భవిష్యత్తులో ఇలాంటి సమస్య మళ్లీ రాకుండా.. దక్షిణ దిక్కున నీటి కొలను తవ్వుకుందాం. దీనికి అన్ని జీవులు తప్పకుండా సహకరించాలి’ అని చెప్పింది. చెప్పినట్లుగానే అన్ని జంతువులు కలిసి విజయవంతంగా కొలను ఏర్పాటు చేసుకున్నాయి. తర్వాత వర్షాకాలంలో ఆ కొలను నిండటంతో అవన్నీ చాలా సంతోషించాయి.

మొర్రి గోపి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు