మున్నీ.. బన్నీ.. డాలీ.. చింపూ!

మున్నీ, బన్నీ జంతువుల ప్రదర్శనశాల చూడటానికి వెళ్దామని చాలా సార్లు వాళ్ల నాన్న గారి దగ్గర పేచీ పెడుతున్నారు. ఒక ఆదివారం రోజున కుటుంబమంతా కలిసి జంతుప్రదర్శనశాలకు వెళ్ళడానికి ప్రణాళిక వేసుకున్నారు. జూలో రకరకాల జంతువులను చూసి మున్నీ, బన్నీ చాలా ఆనందించారు. పెద్ద మెడతో ఉన్న జిరాఫీలను, తొండం ఎత్తి ఘీంకరిస్తున్న ఏనుగులను, బోనులో బంధించిన సింహాలను, పులులను కాసేపు బెదురుతూ, మరికాసేపు ఉత్సాహంగానూ చూశారు. అందమైన నెమళ్ళను చూసి ముచ్చటపడ్డారు. కుందేళ్ళను, లేళ్ళను చూసి కేరింతలు కొట్టారు.

Published : 05 Feb 2024 00:04 IST

మున్నీ, బన్నీ జంతువుల ప్రదర్శనశాల చూడటానికి వెళ్దామని చాలా సార్లు వాళ్ల నాన్న గారి దగ్గర పేచీ పెడుతున్నారు. ఒక ఆదివారం రోజున కుటుంబమంతా కలిసి జంతుప్రదర్శనశాలకు వెళ్ళడానికి ప్రణాళిక వేసుకున్నారు. జూలో రకరకాల జంతువులను చూసి మున్నీ, బన్నీ చాలా ఆనందించారు. పెద్ద మెడతో ఉన్న జిరాఫీలను, తొండం ఎత్తి ఘీంకరిస్తున్న ఏనుగులను, బోనులో బంధించిన సింహాలను, పులులను కాసేపు బెదురుతూ, మరికాసేపు ఉత్సాహంగానూ చూశారు. అందమైన నెమళ్ళను చూసి ముచ్చటపడ్డారు. కుందేళ్ళను, లేళ్ళను చూసి కేరింతలు కొట్టారు. జూలో సగ భాగం తిరిగేసరికి అలసిపోయారు. దానికి తోడు బాగా ఆకలి వేసింది.

‘అమ్మా! నాకు చాలా ఆకలి వేస్తోంది’ అన్నాడు బన్నీ. ‘నాకూ చాలా ఆకలిగా ఉంది’ అంది మున్నీ. ‘మనం తినడానికి బయటకు వెళ్తే మళ్ళీ తిరిగి లోపలకు రాలేము. మీరు ఇలా ఆకలి అంటారనే మీకోసం పాప్‌ కార్న్‌, చేగోడీలు తెచ్చాను. అవి తింటూ నడవండి’ అంది వాళ్ల అమ్మ. ‘అలాగే అమ్మా!’ అంటూ ఇద్దరూ పాప్‌ కార్న్‌ ప్యాకెట్లు పట్టుకుని తింటూ రెండు వైపులా కంచె లోపల ఉన్న జంతువులను చూస్తూ నడుస్తున్నారు. కోతులు, చింపాంజీలు ఉన్న బోనుల దగ్గరకు వచ్చి ఆగారు.

ఓ కోతి బన్నీ వైపు చూస్తూ తనకూ పెట్టమని చెయ్యి చాపింది. ‘డాడీ! ఈ కోతి నన్ను పాప్‌కార్న్‌ అడుగుతోంది’ ఆశ్చర్యంగా అన్నాడు బన్నీ. చింపాంజీ కూడా మున్నీ చేతిలో ప్యాకెట్‌ వైపు చూసి ఏదో అరుపు అరిచింది. ‘డాడీ! ఇది కూడా నన్ను పాప్‌కార్న్‌ పెట్టమని అడుగుతోంది. పాపం ఆకలి వేస్తుందనుకుంటా... కొంచెం పెట్టనా?’ అంది మున్నీ. ‘నేను కోతికి పెడతాను, నువ్వు చింపాంజీకి పెట్టు’ అంటూ ముందుకు అడుగులు వేయబోయాడు బన్నీ.  

‘మున్నీ, బన్నీ! ఒకసారి అక్కడ ఉన్న బోర్డు మీద ఏముందో చదివి చెప్తాను వినండి’ అన్నాడు వాళ్ల నాన్న. ‘జంతువుల ప్రదర్శనశాలలో ఉన్న ఏ జంతువులకు కూడా సందర్శకులు ఆహారం అందివ్వకూడదు. అది వాటికి హాని చేస్తుంది’ అని పైకి చదివాడు. ‘డాడీ! ఎందుకు అలా రాశారు? పాపం ఆ చింపాంజీ నన్ను పెట్టమని ఇంకా అడుగుతూనే ఉంది’ అని
పేచీ పెట్టింది మున్నీ.

ఇంతలో అక్కడకు జూ కీపర్‌ వచ్చారు. అతడి వెనుక జంతువులకు ఆహారం సరఫరా చేసే వ్యాన్‌ కూడా వచ్చింది. అందులో నుంచి కోతులు తినే ఆహారం, చింపాంజీలు తినే ఆహారం ఉన్న గిన్నెలు తీసి ఒక వ్యక్తి వాటి బోనుల్లో పెట్టాడు. కోతులు, చింపాంజీలు ఆవురావురుమంటూ తింటున్నాయి. ‘అంకుల్‌! నేను ఈ పాప్‌కార్న్‌ కొంచెం కోతికి పెట్టవచ్చా?’ అని జూ కీపర్తో అన్నాడు బన్నీ. ‘పెట్టకూడదు బాబూ! అవి మీరు తినే పదార్థాలు. కోతులు తినే ఆహారం వేరుగా ఉంటుంది. అలాగే ఇక్కడ ఉన్న అన్ని రకాల జంతువులు తినే ఆహారం వేరు వేరుగా జూలో ఉండే ఉద్యోగులు ప్రత్యేకంగా తయారు చేస్తారు. అప్పుడే ఇవి ఆరోగ్యంగా ఉంటాయి. మీరు ఇలాంటివి పెడితే వాటికి అనారోగ్యం కలుగుతుంది’ అన్నాడు జూ కీపర్‌. ‘అవునా అంకుల్‌! పాపం అది ఆశగా అడుగుతోంది’ అని నిరాశగా అంది మున్నీ.

‘పిల్లలూ! మీకు ఆనందం కలిగించే ఒక విషయం చెప్పనా? మీకు నచ్చిన ఏ జంతువునైనా మీరు పెంచుకోవచ్చు’ అన్నారు జూ కీపర్‌. ‘అంకుల్‌! ఈ కోతిని మాకు ఇచ్చేస్తారా?’ అని అడిగాడు బన్నీ. ‘ఉహూ! అలా కాదు. మీరు వీటిని దత్తత తీసుకోవచ్చు. వాటికి మీకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు. మీరు మీ పాకెట్‌ మనీలో నుంచి మీరు ఇవ్వగలిగినంత డబ్బును ఇస్తే అది మేము వాటి కోసం ఖర్చు పెడతాం. ఆ బోను మీద మీ పేరు కూడా ఉంటుంది. అది చేసే అల్లరి, ఆటలు మీకు ప్రతీ వారం వీడియోల రూపంలో పంపుతాను’ అన్నారు జూ కీపర్‌.

‘భలే భలే! డాడీ నాకు ఈ కోతి కావాలి. దీనికి నేను డాలీ అనే పేరు పెట్టుకుంటాను’ అన్నాడు బన్నీ. ‘డాడీ! నేను ఈ చింపాంజీని తీసుకుంటాను. దీనికి చింపూ అనే పేరు పెట్టుకుంటాను. మీరు నాకిచ్చిన పాకెట్‌ మనీ జాగ్రత్తగా దాచి దీని కోసం అంకుల్‌కు ఇస్తాను’ అంది మున్నీ. ‘భేష్‌ పిల్లలూ! మీరు మీ స్నేహితులతో కూడా చెప్పి వారికి కూడా మూగ ప్రాణులను ప్రేమించడం నేర్పించండి’ అని ఆనందంగా అన్నారు జూ కీపర్‌. తరువాత జూ కీపర్‌ వాళ్ళను ఆఫీసు గదిలోకి తీసుకువెళ్ళి మున్నీ, బన్నీలు కోతి, చింపాంజీలను దత్తత తీసుకున్నట్లుగా వాళ్ల నాన్నగారితో సంతకాలు పెట్టించుకున్నారు. ఆయన ఫోన్‌ నెంబర్‌ కూడా తీసుకున్నారు. పిల్లలు అక్కడ నుంచి మరోసారి కోతి, చింపాంజీల దగ్గరకు వెళ్ళి... ‘మళ్ళీ వస్తాం’ అంటూ వీడ్కోలు చెప్పారు. జూ కీపర్‌ చెప్పినట్లుగానే వారం వారం వీడియోలు పంపుతున్నారు. వాటిని చూస్తూ మున్నీ, బన్నీలు చాలా సంతోషపడుతున్నారు. వీలైనప్పుడల్లా జూకి వెళ్ళి కోతి, చింపాజీని చూసి వస్తున్నారు.

కేవీ.సుమలత


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని