లడ్డూ కావాలా చింటూ!

చింటూకు మిఠాయిలు అంటే చాలా ఇష్టం. ఎన్ని రకాల స్వీట్లు ఉన్నా లడ్డూలంటే మరింత ప్రాణం! కానీ చింటూ వాళ్ల అమ్మ మాత్రం తనను స్వీట్లు తినడంలో నియంత్రిస్తూ ఉండేది.

Updated : 06 Feb 2024 05:40 IST

చింటూకు మిఠాయిలు అంటే చాలా ఇష్టం. ఎన్ని రకాల స్వీట్లు ఉన్నా లడ్డూలంటే మరింత ప్రాణం! కానీ చింటూ వాళ్ల అమ్మ మాత్రం తనను స్వీట్లు తినడంలో నియంత్రిస్తూ ఉండేది. ‘చూడు చింటూ.. స్వీట్లు ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే పళ్లు పాడవుతాయి. ఇంకా కొన్ని ఆరోగ్య సమస్యలూ కలుగుతాయి. కొన్నే తినాలి. అదే ఆరోగ్యానికి మంచిది’ అని చెబుతుండేది. పాపం చింటూకు మాత్రం లడ్డూలు తినాలనే బలమైన కోరిక ఒక్కోసారి తీరని కోరికలాగానే మిగిలిపోతూ ఉండేది. ఎప్పుడెప్పుడు పండగలు వస్తాయా... ఎప్పుడెప్పుడు అమ్మ లడ్డూలు తయారు చేస్తుందా.. అని ఆశగా ఎదురు చూస్తూ ఉండేవాడా అబ్బాయి.

ఒకసారి దీపావళి పండగకు చింటూ వాళ్ల అమ్మ కొన్ని రకాల పిండివంటలు చేసింది. అందులో జంతికలు, అరిసెలు, కజ్జికాయలు, ఇంకా లడ్డూలు కూడా ఉన్నాయి. అవన్నీ చూసి ఆ రోజే తనకు నిజమైన పండగ వచ్చింది అనుకున్నాడు చింటూ. చక్కగా స్కూల్‌ నుంచి వచ్చిన వెంటనే జంతికలు, అరిసెలు లాంటివి కొన్ని కొన్ని అమ్మ ఇస్తుండేది. చింటూ సంతోషంగా తినేవాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. చేసిన పిండి పదార్థాలు అయిపోయాయి. కానీ లడ్డూలు మాత్రం ఉన్నాయి. వాటిని చింటూ వాళ్ల అమ్మ జాగ్రత్తగా ఒక డబ్బాలో సర్ది అటక మీద పెట్టింది. చింటూకు మాత్రం ఎప్పుడెప్పుడు బడి అయిపోతుందా... ఇంటికి వెళదామా, అమ్మ పెట్టే లడ్డూలు తిందామా.. అని భలే కోరికగా ఉండేది.

కానీ.. ఎక్కువగా తీపి తినడం వల్ల అమ్మ చెప్పినట్లే చింటూకు దగ్గు మొదలైంది. దాంతో తను కొంచెం ఇబ్బంది పడ్డాడు. ‘నేను చెబుతూనే ఉన్నా కదా.. చింటూ.. స్వీట్లు ఎక్కువగా తింటే అనారోగ్యం కలుగుతుందని! నీకు దగ్గు తగ్గే వరకూ లడ్డూలు తినకు’ అని మందలించిందామె. దాంతో చింటూకు బెంగ వచ్చింది. లడ్డూలంటే తనకు చాలా ఇష్టం. ‘దగ్గు తగ్గేవరకూ అవి తినకూడదా? అయ్యో ఇప్పుడెలా?’ అంటూ చాలా బాధ పడిపోయాడు చింటూ. నాన్న తెచ్చిన దగ్గు సిరప్‌ రోజూ తాగుతున్నాడు. అయినా తగ్గడం లేదు. ఇంట్లో వాళ్లందరూ లడ్డూలు తింటూంటే చింటూకు చాలా బాధగా ఉండేది. తనకు కూడా ఒక లడ్డూ తినాలనిపించేది. కానీ అమ్మ మాత్రం ససేమిరా తినడానికి వీల్లేదని ఆంక్షలు పెట్టేసింది.

ఇలా కొన్ని రోజులు గడిచాయి. దగ్గు తగ్గేసరికి లడ్డూలన్నీ అయిపోతాయేమో... మళ్లీ పండగ వచ్చే వరకు అమ్మ చేయదు. ఈలోగా ఎలాగైనా రెండు మూడు కాకపోయినా, కనీసం ఒక్క లడ్డూ అయినా తినాలి... అనే కోరిక చింటూ మనసులో బలంగా నాటుకుంది. అయితే ఎలా తినడం.. ఇంట్లో ఎవ్వరూ తనకు లడ్డూ ఇవ్వరు. తన దగ్గు ఇంకా తగ్గు ముఖం పట్టలేదు. అప్పుడే ఒక సిరప్‌ సీసా కూడా ఖాళీ అయిపోయింది. బాగా ఆలోచించిన చింటూ మెదడులో తళుక్కున ఒక ఆలోచన వచ్చింది. అవును అలా చేస్తేనే కానీ తన కోరిక తీరదు అనుకున్నాడు.  

ఆ రోజు ఆదివారం. బడికి సెలవు. ఎలాగైనా లడ్డూ తినాలనుకున్నాడు చింటు. అమ్మను అడిగినా లడ్డూ పెట్టదు. అవేమో అయిపోతున్నాయి. సరే ఎవరికీ తెలియకుండా తనే ఒకటి తీసుకోవాలి అనుకున్నాడు. లడ్డూలున్న గదిలో చదువుకుంటున్నట్టు నటిస్తూ డబ్బాలో నుంచి తీసి తినాలనుకున్నాడు. తను అటక మీద డబ్బాను తీద్దాం అనుకున్న ప్రతీసారీ ఎవరో ఒకరు ఇంట్లో అటూ ఇటూ తిరుగుతున్నారు. ఎంత ఇబ్బంది పడినా చివరికి.. చింటూ లడ్డూ మాత్రం తినలేకపోయాడు.

ఇంతలో చింటూ వాళ్ల అమ్మ ఆ గదిలోకి వచ్చింది. అటక మీద నుంచి డబ్బా తీసింది. మూత తీసి రెండు లడ్డూలు చింటూకు ఇచ్చింది. దాంతో చింటూ మొహం మతాబులా వెలిగిపోయింది. ‘బాబూ.. చింటూ! మన ఇంట్లోనే అయినా మనం ఎప్పుడూ దొంగతనం చేయకూడదు. అది చాలా తప్పు. నువ్వు లడ్డూలు తీయడానికి చేసే ప్రయత్నాలు అన్నీ నేను చూశాను. ఇంకెప్పుడూ అలా చేయకు’ అని చెప్పింది. అప్పుడు చింటూకు.. ‘నేను ఎంతో భయపడుతూ, దొంగతనంగా తీసుకొని తింటే ఒక లడ్డూ మాత్రమే తినగలిగేవాణ్ని. కానీ అమ్మ నా మనసు తెలుసుకొని ఇచ్చిన రెండు లడ్డూలు ఎలాంటి భయం లేకుండా తినగలుగుతున్నాను. ఇదే ఎంతో సంతోషంగా ఉంది. ఇక నేనెప్పుడూ దొంగతనంగా ఏవీ తినకూడదు. అందులో భయం తప్ప, తృప్తి ఉండదు’ అనిపించింది.

నంద త్రినాథరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు