దానయ్య దానానికి ఫలితం..!

నరసింహపురం గ్రామంలో దానయ్య అనే ఓ వ్యక్తి ఉండేవాడు. పేరుకు తగ్గట్టుగానే.. అతను దానాలు ఎక్కువగా చేస్తుండేవాడు. దానయ్య వ్యవసాయంతో పాటు వ్యాపారం కూడా చేసేవాడు. కారణం తెలుసుకోకుండానే.. సాయం అడిగిన వాళ్లందరికీ దానం చేసేవాడు.

Updated : 07 Feb 2024 05:14 IST

రసింహపురం గ్రామంలో దానయ్య అనే ఓ వ్యక్తి ఉండేవాడు. పేరుకు తగ్గట్టుగానే.. అతను దానాలు ఎక్కువగా చేస్తుండేవాడు. దానయ్య వ్యవసాయంతో పాటు వ్యాపారం కూడా చేసేవాడు. కారణం తెలుసుకోకుండానే.. సాయం అడిగిన వాళ్లందరికీ దానం చేసేవాడు. ఒకసారి గ్రామంలోని కొంతమంది యువకులు వచ్చి.. ఆడుకోవడానికి ఆటస్థలం కావాలని అడిగారు. అతను మరేం మాట్లాడకుండా తనకున్న భూమిలో నుంచి కొంత భాగాన్ని వాళ్లకు రాసిచ్చాడు. తర్వాత ఇంకొంత మంది గ్రామస్థులు వచ్చి పాఠశాల భవనం నిర్మించడానికి కొంత స్థలాన్ని ఇవ్వమని కోరారు. అప్పుడు కూడా ఏం మాట్లాడకుండా అడిగినంత స్థలాన్ని దానం చేశాడు దానయ్య. కొన్ని రోజులకు మరికొంత మంది వచ్చి.. అనాథ శరణాలయానికి కొంత డబ్బును విరాళంగా ఇమ్మన్నారు. వాళ్లు అడిగినంత ధనం ఇచ్చేశాడతను. ఇలా దానాలు చేసి చేసి.. అతని ఆస్తి మొత్తం కరిగిపోయింది. వ్యాపారం కూడా క్షీణించింది. చివరికి తన కుటుంబాన్ని పోషించడం కూడా కష్టంగా మారింది దానయ్యకు. ఒక ఎకరం భూమి తప్ప ఇంకేమీ మిగల్లేదు. దాంతో అతడు ఆ భూమిని కూడా అమ్మేసి.. వచ్చిన డబ్బుతో చేమంతిపురం గ్రామానికి కుటుంబంతో సహా వలస వెళ్లిపోయాడు.

అక్కడికి వెళ్లాక దొరికిన పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించసాగాడు. కొన్ని రోజులకు తన దగ్గరున్న కొంత డబ్బుతో ఒక ఎకరం భూమిని కొన్నాడు. దానయ్య వేరే చోటుకు వెళ్లినా.. తన గుణాన్ని మాత్రం వదల్లేదు. ఒకసారి అతని భార్య కొంత ధాన్యాన్ని ఇచ్చి సంతలో అమ్ముకొని రమ్మంది. చెప్పినట్లుగానే.. దానయ్య ఆ ధాన్యాన్ని తీసుకొని సంతకు బయలుదేరాడు. దారిలో కొన్ని పక్షులు కనిపించడంతో ఆ ధాన్యాన్ని వాటికి వేశాడు. ఇంటికి తిరిగెళ్లి.. ఆ విషయాన్ని తన భార్యతో చెప్పాడు. దానికి ఆమె ‘ఫర్వాలేదు మంచి పని చేశారులే’ అని బదులిచ్చింది.

మరుసటి రోజు ఆమె ఇంట్లో చెట్టుకు కాసిన కొన్ని జామపండ్లు ఇచ్చి.. వాటిని అమ్ముకురమ్మని చెప్పింది. అవి తీసుకొని వెళ్తుండగా.. అతనికి ఓ కోతుల గుంపు కనిపించింది. అవి ఆశగా తన వైపు చూసేసరికి.. ఆ పండ్లన్నీ వాటికి ఇచ్చేశాడు దానయ్య. అప్పుడు కూడా అతని భార్య ఏమీ అనలేదు. చివరికి అతడు కూలి పని చేసి డబ్బు సంపాదించడం ప్రారంభించాడు. అది చేస్తూనే.. మళ్లీ వ్యవసాయం చేయాలని అనుకున్నాడు. కానీ దాని కోసం తన దగ్గర ఉన్న డబ్బు సరిపోదు కాబట్టి.. కొంత అప్పు చేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పు అడగటానికి భూషయ్య వద్దకు వెళ్లాడు దానయ్య, అతని భార్య. ఆ ఊరి రైతులందరికీ భూషయ్యే అప్పు ఇస్తాడు. కానీ ఆయన దానయ్యకు అప్పు ఇవ్వనని చెప్పేశాడు. అప్పుడు దానయ్య భార్య.. ‘అయ్యా!  గతంలో మేము చాలా బాగా బతికాము. ఎందరికో సాయం చేశాము. పరిస్థితులు బాగోలేక అప్పు కోసం వచ్చాము. మీ అప్పును వెంటనే తీర్చేస్తాము. మమ్మల్ని నమ్మండి’ అంది. దానికి భూషయ్య.. ‘తీసుకున్న డబ్బుతో మీరేం చేస్తారో నాకేం తెలుసు. మిమ్మల్ని నేనెలా నమ్మను. మీకు అప్పు ఇవ్వలేను’ అని చెప్పేశాడు. ‘వ్యవసాయం చేయాలనుకుంటున్నాం. పొలంలో నాటడానికి విత్తనాలు కావాలి. అందుకు కాస్త డబ్బు అవసరమైంది’ అని బదులిచ్చిందామె.

ఈ మాటలన్నీ అక్కడే ఉన్న రామయ్య అనే రైతు విన్నాడు. ‘దానయ్య నిన్ననే కదా.. ఎవరో మీ పొలంలో విత్తనాలు వేశారు. మీరే వేయిస్తున్నారు అనుకున్నాను’ అని అన్నాడు. దాంతో దానయ్య, అతని భార్య ఆశ్చర్యపోయారు. వెంటనే పొలం దగ్గరకు వెళ్లి చూశారు. రామయ్య చెప్పినట్లుగానే.. పొలంలో ఎవరో విత్తనాలు వేశారు. అప్పుడు వాళ్లు గ్రామ పెద్ద దగ్గరకు వెళ్లి.. ‘ఎవరో పొరపాటున మా భూమిలో విత్తనాలు వేశారు. ఇంతకీ వాళ్లెవరూ? వారికి మేము ఆ విత్తనాల డబ్బులు ఎలా ఇవ్వాలి?’ అని అన్నారు. ‘మా భూమిలో విత్తనాలు వేయమంటే మా వాళ్లు.. పొరపాటున పక్కనే ఉన్న మీ భూమిలో వేశారు. ఆ సంగతి నాకు తర్వాత తెలిసింది. అయినా మీరు నాకు డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. మీరు గతంలో చేసిన సాయం ఫలితమే ఇది అనుకోండి. మీరు మూగ జీవాల ఆకలిని తీర్చారు. మీ పొలంలో విత్తనాలు వేసింది ఎవరో తెలియకుండానే.. వారికి డబ్బులు తిరిగి ఇవ్వాలనుకున్నారు. మీ నిజాయతీనే మీకు అండగా నిలుస్తుంది. మీకు ఇక ముందు కూడా ఏ అవసరం వచ్చినా.. నా దగ్గరకు రండి. నాకు వీలైనంత సాయం చేస్తాను’ అన్నాడతను. దాంతో ఆ గ్రామ పెద్దకు కృతజ్ఞతలు తెలిపి.. సంతోషంగా ఇంటికి చేరుకున్నారు దానయ్య, అతని భార్య.

సంగనభట్ల చిన్న రామకిష్టయ్య


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు