కొండలుకు వంటలు నచ్చాయోచ్‌!

ఒకప్పుడు నాదర్‌గుల్‌ కూడలిలో.. నాగినీడు అన్నసత్రం నడిపేవాడు. అక్కడ రకరకాల దుకాణాలుండేవి. ప్రతి శనివారం ఆ ప్రాంతంలో సంత జరిగేది. కూరగాయలు, ఆకుకూరలు, పశువులు, పక్షులతో పాటు రకరకాల చిరుతిండ్లు, పండ్ల రసాలు అమ్మేవారు.

Updated : 08 Feb 2024 01:19 IST

కప్పుడు నాదర్‌గుల్‌ కూడలిలో.. నాగినీడు అన్నసత్రం నడిపేవాడు. అక్కడ రకరకాల దుకాణాలుండేవి. ప్రతి శనివారం ఆ ప్రాంతంలో సంత జరిగేది. కూరగాయలు, ఆకుకూరలు, పశువులు, పక్షులతో పాటు రకరకాల చిరుతిండ్లు, పండ్ల రసాలు అమ్మేవారు. చుట్టుపక్కల గ్రామాల వాళ్లు పెద్ద సంఖ్యలో వచ్చేవారు. అక్కడికి వచ్చిన వారికి నాగినీడు తన సత్రంలో రుచికరంగా, వేడి వేడిగా భోజనం కడుపు నిండా పెట్టేవాడు. పనిమీద నాదర్‌గుల్‌ వచ్చిన వారు నాగినీడు అన్నసత్రంలో తప్పకుండా భోజనం చేసే ఇంటికి తిరిగి వెళ్లేవారు.
ప్రతి శనివారం కూర్మల్‌గూడ నుంచి కొండలు అనే వ్యక్తి వచ్చి సంతలో పండ్ల రసాల బండి పెట్టేవాడు. నిమ్మ, దానిమ్మ, బత్తాయి, ద్రాక్ష, సపోటా, మామిడి, బొప్పాయి, ఆపిల్‌, పైనాపిల్‌ లాంటి పండ్లతో రుచిగా జ్యూస్‌లు చేసేవాడు. అన్నసత్రం నడిపే నాగినీడుతో పాటు కూడలిలో ఇతర దుకాణదారులు కూడా కొండలు చేసే పండ్ల రసాలు ఒకటికి రెండుసార్లు తెప్పించుకుని మరీ తాగేవారు.
కొండలు ప్రతి శనివారం నాగినీడు అన్నసత్రంలోనే భోజనం చేసేవాడు. అన్నం తింటున్న అతిథులను పలకరించి వంటలు ఎలా ఉన్నాయో వాకబు చేసేవాడు నాగినీడు. కొందరు అద్భుతంగా ఉన్నాయనేవారు. ఇంకొందరు మాత్రం కూరలు బాగున్నాయంటే, మరికొందరు పచ్చళ్లు బాగున్నాయనేవారు. కానీ కొండలు మాత్రం అందరికీ నచ్చింది.. తనకు నచ్చలేదనేవాడు. ఇతరులకు నచ్చనిది మాత్రం తనకు నచ్చిందనేవాడు.
ఒక శనివారం అన్నసత్రంలో పూజ జరిపించాడు నాగినీడు. వచ్చిన అతిథులందరికీ భోజనంతో పాటు పులిహోర కూడా వడ్డించారు. వాళ్లంతా.. లొట్టలేసుకు తిన్నారు. ఇంకొందరు రుచిగా, దేవుడి గుడిలో ప్రసాదంలా ఉందన్నారు. మరికొందరు ఏకంగా పులిహోరతోనే కడుపు నింపుకొన్నారు. కానీ కొండలు మాత్రం విస్తరిలో పులిహోర వదిలేసి చేతులు కడిగేసుకున్నాడు.
‘ఏమోయ్‌ కొండలూ! పులిహోర తినలేదే?’ అని అడిగాడు నాగినీడు. దాంతో కొండలు... ‘అయ్యా! పులిహోరలో ఇంగువ పోపు నచ్చలేదు. అందుకే తినకుండా వదిలేశాను’ అని సమాధానమిచ్చాడు. ముందు నుంచీ.. కొండలు స్వభావం తెలిసిన నాగినీడు మౌనంగా ఉండిపోయాడు. ఒకరోజు ఎప్పటిలా బత్తాయి రసం తీసుకెళ్లి కూడలిలోని ఇతర దుకాణదారులతో పాటు అన్నసత్రం నాగినీడుకు కూడా ఇచ్చాడు కొండలు. అందరూ కాస్త రుచి చూసి... ‘పండ్ల రసం బాలేదు. పంచదార వేయలేదా!’ అని విసుక్కున్నారు. నాగినీడు మాత్రం ఎప్పటిలానే తాగి డబ్బులిచ్చాడు.
‘అయ్యా! పండ్ల రసం ఎలా ఉంది?’ అని అడిగాడు కొండలు. ‘బాగుందోయ్‌! నువ్వు ఇచ్చాక రుచిగా లేకుండా ఉంటుందా?’ అన్నాడు నాగినీడు. ‘పంచదార వేయటం మరిచిపోయాను. అయినా మీకు నచ్చిందా?’ అని కాస్త సందేహంగా అడిగాడు. ‘వృక్ష జాతి ఒక్కటే అయినా.. ఒక్కో చెట్టు పండుది ఒక్కో రుచి. పంచదార లేకుంటేనే.. పండ్ల రసం అసలు రుచి తెలుస్తుంది. నిజానికి నాకు ఇలానే ఇష్టం’ బదులిచ్చాడు నాగినీడు.
ఆ రోజు అన్నసత్రంలో భోజనం చేస్తున్న కొండలు... ‘అందరి నాలుకలు ఒకేలా ఉన్నా... ఒక్కొక్క వ్యక్తికి నచ్చే ఆహార పదార్థాలు, రుచులు వేర్వేరుగా ఉంటాయి. పులుపు, కారం, తీపి ఇలా అనేక రుచుల పదార్థాల్లో ఒక్కొక్కరికి ఒక్కోటి నచ్చుతుంది. అంత మాత్రాన బాగోలేవని చెప్పి ఎదుటివారిని బాధ పెట్టకూడదు’ అని గ్రహించాడు. అందుకే ఈ సారి నాగినీడు అడగక ముందే... ‘అయ్యా! ఈ రోజు వంటలన్నీ రుచిగా ఉన్నాయి’ అని మెచ్చుకొని బయటకు వెళ్లాడు. ఎప్పుడూ నచ్చని వంటలు ఈరోజు ఎలా నచ్చాయో అర్థం కాక కొండలు వైపే సంబరంగా చూస్తూ.. ఉండిపోయాడు నాగినీడు.

పైడిమర్రి రామకృష్ణ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని