అమ్మ ఆరోగ్యమే పిల్లలకు మహాభాగ్యం!

అప్పుడే మెల్లగా తెల్లవారుతోంది.. చిన్ని అనే గున్న ఏనుగు నిద్ర లేచి, పక్కనే ఉన్న తల్లి ఏనుగును చూసింది. అది ఇంకా నిద్రపోతూనే ఉంది. ‘అమ్మ లేస్తే నన్ను బయటకు వెళ్లనివ్వదు.

Updated : 09 Feb 2024 05:07 IST

ప్పుడే మెల్లగా తెల్లవారుతోంది.. చిన్ని అనే గున్న ఏనుగు నిద్ర లేచి, పక్కనే ఉన్న తల్లి ఏనుగును చూసింది. అది ఇంకా నిద్రపోతూనే ఉంది. ‘అమ్మ లేస్తే నన్ను బయటకు వెళ్లనివ్వదు. ఇప్పుడే వెళ్లాలి’ అనుకుని ఆలస్యం చేయకుండా ముందుకు కదిలింది చిన్ని. అలా వెళ్తూ వెళ్తూ ఉండగా.. దానికి ఒక కుందేలు, జింక ఎదురుపడ్డాయి. ‘చిన్నీ..! ఇంత ఉదయాన్నే.. అమ్మ లేకుండా ఎక్కడికి వెళ్తున్నావు?’ అని అడిగింది కుందేలు.

‘నాకు కొంచెం ఒంట్లో బాలేదు. కాస్త నడిస్తే.. బాగుంటుందని ఇలా వచ్చాను’ అని బదులిచ్చింది చిన్ని. ‘సరేలే కానీ.. ఇంకా ముందుకు వెళ్లకు. అక్కడ పులులు, సింహాలు ఉంటాయి’ అంటూ జాగ్రత్తలు చెప్పింది జింక. అలాగేనంటూ చిన్ని మళ్లీ నడవడం ప్రారంభించింది. నడుస్తూ నడుస్తూ వెళ్లి.. చివరకు ఒక తోట దగ్గర ఆగింది. ‘హమ్మయ్య! నేను అనుకున్న తోట వచ్చేసింది’ అనుకుంటూ లోపలికి వెళ్లి.. దానికి కావాల్సిన మొక్క కోసం వెతకసాగింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఒక జిత్తులమారి నక్క.. చిన్నిని గమనించింది. 

‘ఉదయాన్నే.. పసందైన విందు దొరికింది. ఈ గున్న ఏనుగును మాటల్లో పెట్టి, సింహం వద్దకు తీసుకెళ్తాను. ఆ తర్వాత సింహంతో కలిసి విందారగిస్తాను’ అని మనసులోనే అనుకుందది. చిన్ని దగ్గరకు మెల్లగా నడుచుకుంటూ వెళ్లి.. ‘ఈ సమయంలో ఎందుకిలా ఒంటరిగా వచ్చావు? అని అడిగింది నక్క. ఇక్కడ తోటలో కొన్ని మొక్కల ఆకులు కావాలి’ అని దీనంగా జవాబిచ్చింది చిన్ని. 

‘ఆ మాత్రం దానికి ఎందుకు దిగులు. ఇంకాస్త దూరం వెళ్తే.. నీకు కావాల్సిన మొక్కలు చాలా ఉంటాయి. ఇంకా ఎక్కువ ఆకులు కోసుకోవచ్చు’ అంది నక్క. ‘అవునా! ఆ విషయం నాకు తెలియక ఇక్కడే ఆగాను. అక్కడికే వెళ్దాం పద’ అంటూ దానితో పాటు కలిసి బయలుదేరబోయింది చిన్ని.
అప్పుడే అక్కడికి కుందేలు, జింక వచ్చి ‘చిన్నీ.. ఆగు!’ అనగానే అక్కడే ఆగిపోయిందది. ‘ఈ తోట దాటితే మృగరాజు గుహ ఉంది. మా చిన్నిని ఎక్కడికి తీసుకెళ్తున్నావు. నీ జిత్తులమారి బుద్ధి మాకు చాలా బాగా తెలుసు. ఈ విషయాన్ని చిన్నీకి చెప్పామంటే.. దాని తొండంతో నిన్ను కొడుతుంది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపో’ అని నక్కను హెచ్చరించింది కుందేలు.
దాంతో భయపడి అక్కడి నుంచి పారిపోయిందది. ‘మీరు అప్పుడే వెళ్లిపోయారు కదా.. మళ్లీ ఎందుకు వచ్చారు?’ అని ఆశ్చర్యంగా అడిగింది గున్న ఏనుగు. ‘మా చిన్ని ఒంటరిగా ఎటైనా వెళ్తూ కనిపిస్తే.. దాని వెనకాలే మీరు వెళ్లండి. చిన్నీకి కాస్త తొందర పాటు ఎక్కువ. అందరినీ నమ్మేసి, ఆపదలో చిక్కుకుంటుంది’ అని గతంలో ఎప్పుడో మీ అమ్మ చెప్పింది. అది గుర్తొచ్చి.. ఇలా వచ్చామని బదులిచ్చింది జింక.
‘కొంచెం ఆలస్యం అయితే.. ఆ నక్క నిన్ను మాయ చేసి సింహానికి బలి చేసేది. అయినా నువ్వు ఎందుకు ఇటు వైపు వచ్చావు?’ అని అడిగింది కుందేలు. ‘నిన్న అమ్మ నా కోసం చెరకు గడలు తెస్తుండగా.. కాలికి ముళ్లు గుచ్చుకుంది. ఆ బాధతో రాత్రి చాలాసేపు నిద్రపోలేదు. గతంలో ఇలాగే ముళ్లు గుచ్చుకున్నప్పుడు.. కొంగ మామ, ఈ తోటలో ఆకులు తెచ్చి పసరు మందు వేసింది. అప్పుడు అమ్మకు తొందరగా తగ్గిపోయింది. అందుకే అమ్మ నిద్ర లేచే లోపు మందు తేవాలని వచ్చాను. నా బాధను అమ్మ పట్టించుకుంటుంది. మరి తను ఇబ్బంది పడుతున్నప్పుడు నేనూ చూసుకోవాలి కదా..!’ అని బదులిచ్చింది చిన్ని.
ఆ మాటలు విన్న కుందేలు, జింక ఆశ్చర్యపోయాయి. చిన్నీ! నీకు అమ్మ మీద ఉన్న ప్రేమ చాలా గొప్పది. అది కావాలి.. ఇది కావాలి అని మారాం చేసే పిల్లలు ఉన్న ఈ రోజుల్లో.. నీలా ఆలోచించే వాళ్లు కూడా ఉండటం చాలా బాగుంది’ అన్నాయవి. ‘అమ్మ ఆరోగ్యమే.. పిల్లలకు మహాభాగ్యం. అప్పుడే పిల్లలు కూడా బాగుంటారు’ అంటూ ఆకులు కోసింది కుందేలు.
‘అమ్మ నిద్ర లేవకముందే మనం వెళ్లాలి. నేను కనబడకపోతే అమ్మ భయపడుతుంది’ అంది చిన్ని. వెంటనే అన్నీ కలిసి తల్లి ఏనుగు దగ్గరకు బయలుదేరాయి. తీసుకెళ్లిన పసరు మందు దాని గాయానికి పెట్టాయి.

కేవీ లక్ష్మణరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని