మొదటి బహుమతి ఎవరికి..?

పూళ్ల గ్రామంలో ఉన్న గౌరీపతి శాస్త్రి మహా పండితుడు. మంచి పద్యాలు, కావ్యాలు రాసేవాడు. కానీ.. అది పల్లెటూరు కావడం, అక్కడ పెద్దగా కావ్యాల గురించి తెలియకపోవడం వల్ల ఆయనకు రావాల్సినంత పేరు రాలేదు.

Updated : 10 Feb 2024 01:17 IST

పూళ్ల గ్రామంలో ఉన్న గౌరీపతి శాస్త్రి మహా పండితుడు. మంచి పద్యాలు, కావ్యాలు రాసేవాడు. కానీ.. అది పల్లెటూరు కావడం, అక్కడ పెద్దగా కావ్యాల గురించి తెలియకపోవడం వల్ల ఆయనకు రావాల్సినంత పేరు రాలేదు. అయినా గౌరీపతి ఎప్పుడూ పేరు గురించి పాకులాడకుండా, తన రచనల మీదే దృష్టి పెట్టేవాడు. ఒకరోజు మహారాజు గ్రామ పర్యటన చేస్తూ పూళ్ల గ్రామానికి వచ్చాడు. అప్పుడు రాజుకి గౌరీపతి శాస్త్రి గురించి తెలిసింది. వెంటనే అతన్ని పిలిపించి.. ఆ కావ్యాలూ, పద్యాలూ విని అక్కడే ఘనంగా సన్మానించాడు మహారాజు. ఆ సంఘటన తర్వాత.. శాస్త్రి పేరు చాలా మందికి తెలిసింది. అప్పటి నుంచి ఆ చుట్టపక్కల గ్రామాల్లోని వారంతా.. ఏ కార్యక్రమం జరిగినా శాస్త్రిని పిలిచి, సన్మానించడం పరిపాటి అయ్యింది. మొదట్లో సత్కారాల మీద పెద్దగా ఆసక్తి చూపని శాస్త్రి.. ఇక ఎవరు పిలిచినా.. కార్యక్రమాలకు వెళ్లడం ప్రారంభించాడు. సన్మానాలు ఎక్కువై అతనికి రచనల మీద దృష్టి తగ్గిపోయింది. అంతకు ముందు ఉదయాన్నే లేచి.. వేదాలు చక్కగా చదివేవాడు. ఇప్పుడు అది కూడా మానేశాడు.

త్వరలో మహారాజు పుట్టినరోజు జరగబోతుంది. ఆ వేడుకలకు రావాలని గౌరీపతితో సహా రాజ్యంలో ఉండే పండితులందరికీ.. ఆహ్వానాలు అందాయి. ఆ రోజు చెప్పిన అంశాలపై మంచి పద్యాలు రాసిన వారికి బహుమతులు కూడా అందజేస్తారని అంతటా దండోరా వేయించాడు మంత్రి. అనుకున్నట్లుగానే.. ఆ రోజు రానే వచ్చింది. శాస్త్రి తన దగ్గర ఉన్న కొన్ని కావ్యాలు తీసుకుని నగరానికి బయలుదేరాడు. ఆ సమయంలో రాజ మందిరం అంతా కోలాహలంగా ఉంది. పండితులే కాకుండా.. చాలా మంది యువకులు కూడా ఆ కార్యక్రమానికి వచ్చారు. కాసేపటికి సభ ప్రారంభమైంది. అప్పుడు మంత్రి వచ్చి.. ‘ఇప్పుడు మీకు రెండు అంశాలు చెబుతాను. మీకు నచ్చినట్లుగా కవితలు, పద్యాలు రాసివ్వండి. ఆస్థాన పండితులు వాటిని పరిశీలించి.. విజేతలను నిర్ణయిస్తారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారు బహుమతులు అందుకుంటారు’ అని వివరించాడు. అలాగేనంటూ.. అందరూ వారికి ఇచ్చిన పత్రాలపై కవితలు, పద్యాలు రాశారు. పోటీలో పాల్గొన్న చాలా మంది.. ‘ఈ పందెంలో మొదటి బహుమతి గౌరీపతి శాస్త్రికే వస్తుంది. ఇక మిగిలిన రెండు స్థానాలకే మనం ప్రయత్నించాలి’ అనుకున్నారు. అన్నింటినీ పరిశీలించాక.. ఆస్థాన పండితుల నిర్ణయం ప్రకారం విజేతల పేర్లు ప్రకటించాడు మంత్రి. మొదటి మూడు స్థానాల్లోనూ.. గౌరీపతి పేరు ఎంపిక కాలేదు. దాంతో అందరూ ఆశ్చర్యపోయారు. కొత్తగా వచ్చిన యువకులు ఆ బహుమతులు గెలుచుకున్నారు.

మహారాజు లేచి.. ‘మా ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈ రోజు జరిగిన పోటీలో మహా పండితులు కాకుండా.. కొత్తగా వచ్చిన యువకులు ఎంపికవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసి ఉంటుంది. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. సాన పెడితేనే కత్తికి పదును. అలాగే.. మన దగ్గర ఉన్న  విద్యతో రోజూ సాధన చేస్తేనే.. మంచి ఫలితం దక్కుతుంది. అప్పుడే ఇంకా కొత్తగా ఆవిష్కరణలు చేయగలుగుతాం. ఒకప్పుడు గౌరీపతి శాస్త్రి రోజూ కావ్యాలు చదివి, మంచి పద్యాలు రాసేవారు. కానీ ఆయనకి జరుగుతున్న సన్మానాలు, సత్కారాలు తన ప్రతిభకి ప్రతిబంధకంగా మారాయి. ఆయన రచనల్లో నాణ్యత తగ్గింది. ఈ విషయం నాకు ఈ మధ్యనే తెలిసింది. అప్పటి శాస్త్రి రచనలకు, ఇప్పుడు రాసిన పద్యాలకు ఎంతో తేడా కనిపించింది. తనొక్కడిలోనే కాదు.. ఈ వ్యత్యాసం చాలా మంది పండితుల్లో తెలిసింది. సత్కారాలు అవసరమే కానీ.. అవి మితిమీరితే మొదలునే మర్చిపోతాం. ఈ యువకులు కొత్తగా నేర్చుకోవాలనే తపనతో రచనలు చేశారు. అవి చాలా అద్భుతంగా ఉన్నాయి. వారి శ్రమకు ఫలితమే.. ఈ రోజు వాళ్లు పొందిన బహుమతులు. ఈ విషయాన్ని గమనించి అందరూ.. తమ పూర్వ వైభవానికి ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను’ అంటూ అందరినీ సత్కరించాడు.

 కూచిమంచి నాగేంద్ర


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని