సింహానికి జబ్బు చేసింది!

సుందరవనం అనే అడవిలో ఒక కోతి ఉచితంగా వైద్యం చేస్తూ ఉండేది. నాణ్యమైన వైద్యం చేస్తుందని ఆ అడవిలో దానికి చాలా మంచి పేరుంది. అది అక్కడే ఉండే నక్కకు ఏ మాత్రం నచ్చేది కాదు. ఎలాగైనా దాన్ని మృగరాజుతో తిట్టించాలని చూసేది. ఒకరోజు మృగరాజు సింహం చాలా అస్వస్థతకు గురైంది. అది వెంటనే.. నక్కను పిలిచి వైద్యం చేయడానికి కోతిని దాని వద్దకు తీసుకురమ్మని పంపింది. ఆలస్యం చేయకుండా కోతి వద్దకు బయలుదేరింది నక్క. అక్కడికి వెళ్లి.. ‘కోతీ! సింహానికి ఒంట్లో బాగోలేదు. నిన్ను వెంటనే రమ్మంది. ఇది మృగరాజు ఆజ్ఞ’ అని చెప్పిందది. కోతి బదులిస్తూ.. ‘నక్క మామా! ఇప్పుడు నేను రాలేను.

Updated : 14 Feb 2024 04:11 IST

సుందరవనం అనే అడవిలో ఒక కోతి ఉచితంగా వైద్యం చేస్తూ ఉండేది. నాణ్యమైన వైద్యం చేస్తుందని ఆ అడవిలో దానికి చాలా మంచి పేరుంది. అది అక్కడే ఉండే నక్కకు ఏ మాత్రం నచ్చేది కాదు. ఎలాగైనా దాన్ని మృగరాజుతో తిట్టించాలని చూసేది. ఒకరోజు మృగరాజు సింహం చాలా అస్వస్థతకు గురైంది. అది వెంటనే.. నక్కను పిలిచి వైద్యం చేయడానికి కోతిని దాని వద్దకు తీసుకురమ్మని పంపింది. ఆలస్యం చేయకుండా కోతి వద్దకు బయలుదేరింది నక్క. అక్కడికి వెళ్లి.. ‘కోతీ! సింహానికి ఒంట్లో బాగోలేదు. నిన్ను వెంటనే రమ్మంది. ఇది మృగరాజు ఆజ్ఞ’ అని చెప్పిందది. కోతి బదులిస్తూ.. ‘నక్క మామా! ఇప్పుడు నేను రాలేను. చాలా జీవులు ఒంట్లో బాగోలేక.. వైద్యం కోసం వచ్చాయి. వాటిని ఇక్కడే ఉంచి రావడం పద్ధతి కాదు. మృగరాజునే రమ్మని చెప్పు. ఇక్కడికి వస్తే.. కావాల్సిన మందులన్నీ అందుబాటులో ఉంటాయి. నేను రాలేకపోతున్నందుకు మన్నించమని అడిగానని చెప్పు’ అంది. దాంతో నక్క.. ఆ కోతి గురించి మృగరాజుకు చెడుగా చెప్పడానికి ఇదే సరైన సమయమని భావించింది.

పరుగున సింహం దగ్గరకు వెళ్లిన నక్క.. కోతి మీద ఉన్నవీ లేనివీ అన్నీ చెప్పింది. చివరికి మృగరాజుకు దాని మీద కోపం వచ్చేలా చేసింది. అప్పుడది వెంటనే ఆ నక్కని తీసుకుని కోతి దగ్గరకు బయలుదేరింది. దాన్ని చూసిన కోతి.. ‘మృగరాజా! మీకు అస్వస్థతగా ఉందని ఈ నక్క చెప్పింది. ఇక్కడ నేను కొన్ని జంతువులకు వైద్యం చేయాల్సి ఉంది. నా అంచనా ప్రకారం.. ఇప్పుడు మీకు వైద్యం అత్యవసరం అయితే కాదు. నిజంగానే మీ పరిస్థితి మరీ బాగోలేకపోతే.. నా దగ్గరకు నెమ్మదిగా వచ్చే ఈ నక్కను పంపించరు. వేగంగా ఎగిరే ఏ పక్షినో పంపిస్తారు. అది ఊహించే.. నేను మీ వద్దకు రాలేదు’ అంది. ఆ మాటలు విన్న సింహం.. ‘నేను రమ్మంటే రాకుండా పైగా సంజాయిషీ ఇచ్చుకుంటున్నావా?’ అని కోప్పడింది. అప్పుడు కోతి వినయంగా.. మృగరాజా! ఈ అడవిలోని నాలాంటి ప్రాణులన్నీ మీ బిడ్డలే. నేను అన్ని జంతువులకు వైద్యం చేస్తే ఆ కీర్తి మీకే వస్తుంది కదా! అందుకే అలా ప్రవర్తించాను. మీ మనసు నొప్పించి ఉంటే నన్ను క్షమించండి’ అంది. సింహం అలా కోతిని హెచ్చరించడం చూసిన నక్క.. చాలా సంతోషించింది. ఆ తర్వాత సింహం అక్కడి నుంచి గుహకు వచ్చేసింది.

కొన్నిరోజుల తర్వాత.. జంతువుల పండగ వచ్చింది. ప్రతి ఏటా ఆ అడవిలో జంతువులు ఉత్సవాలు జరుపుకుంటాయి. అప్పుడే ఆ ఏడాదంతా మంచి పనులు చేసిన జీవులను మృగరాజు సన్మానిస్తుంది. ఆ అడవిలో నివసించే ఒక కుందేలు.. ఇతర జంతువులకు చాలా సాయం చేస్తోంది. ఆ విషయం తెలుసుకున్న సింహం దాన్ని సన్మానించాలనుకొని కాకితో కబురు చేసింది. నక్క దాన్ని కూడా సింహం సన్మానిస్తుందని అనుకుంది. కానీ దాని పేరు చెప్పనందుకు లోలోపలే కుళ్లుకుంది. ఆ తర్వాత మృగరాజు వైద్యం చేస్తున్న కోతిని కూడా రమ్మని కాకితో కబురు పంపింది. అది విన్న నక్క ఆశ్చర్యపోయింది. దాని ఎత్తులు పారనందుకు మూతి ముడుచుకొని కూర్చుంది. ఉత్సవాల్లో కుందేలు, కోతిని సింహం ఘనంగా సత్కరించింది.

మృగరాజు మాట్లాడుతూ.. ‘ఈ కుందేలు అనేక జంతువులను దాని తెలివితేటలతో వేటగాళ్లకు చిక్కకుండా కాపాడింది. ఇక కోతి వైద్యం చేస్తూ తన వృత్తినే దైవంగా భావిస్తూ జంతువుల ప్రాణాలు రక్షిస్తుంది. అందుకే ఈ సంవత్సరం వీటిని సన్మానించాను. ఇంకో విషయం ఏంటంటే.. నేను రమ్మని చెప్పినా కూడా.. కోతి రాకుండా దాని వృత్తి ధర్మాన్ని నిర్వర్తించింది. అది నేనే స్వయంగా వెళ్లి చూశాను’ అంది. దానికి అక్కడున్న జంతువులు కరతాళ ధ్వనులు చేశాయి.

అప్పుడు కోతి.. ‘మృగరాజా! నా దగ్గరకు వచ్చిన ఈ జంతువులకు ఏవీ ఉచితంగా వైద్యం చేయవు. మీరు మృగరాజు కాబట్టి ఎలుగుబంటి లాంటివి మీకు వైద్యం చేసేస్తాయి. ఒంట్లో బాగోలేకపోయినా జంతువులు ఇక్కడి వరకు రాగలుగుతున్నాయంటే.. వాటికి అత్యవసర వైద్యం ఏమీ అవసరం లేదని అర్థం. అలాగని వాటిని నిర్లక్ష్యం చేస్తే.. అది వాటి ప్రాణాలకే ముప్పును తీసుకురావచ్చు. ఆ రోజు నేను మీ వద్దకు రాకపోయినా.. మీరు గుర్తుపెట్టుకొని మరి సత్కరించడం మీ గొప్పతనానికి నిదర్శనం’ అంది. ‘నీ గురించి నాకు తెలుసు.. కావాలనే ఆ రోజు నేను.. నాకు బాగోలేదని నాటకం ఆడాను. నిన్ను పరీక్షిద్దాం అనుకున్నాను. అందులో నువ్వు గెలిచావు’ అంది సింహం. దాంతో అక్కడున్న జీవులన్నీ కోతిని అభినందించాయి.

సంగనభట్ల చిన్న రామకిష్టయ్య


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని