నాకో పుస్తకం కావాలి!

ఆ రోజు చివరి క్లాస్‌ అయిపోవడంతో పిల్లలంతా ఇంటికి వెళ్లడానికి బ్యాగులు సర్దుకుంటున్నారు. ఇంతలోనే గంట మోగడంతో.. టీచర్‌ లేచి వెళ్లిపోయారు. పిల్లలు కూడా పరుగున బయటికి వెళ్తున్నారు.

Updated : 16 Feb 2024 05:12 IST

రోజు చివరి క్లాస్‌ అయిపోవడంతో పిల్లలంతా ఇంటికి వెళ్లడానికి బ్యాగులు సర్దుకుంటున్నారు. ఇంతలోనే గంట మోగడంతో.. టీచర్‌ లేచి వెళ్లిపోయారు. పిల్లలు కూడా పరుగున బయటికి వెళ్తున్నారు. అప్పుడు యశస్వి.. ‘ఆకాశ్‌.. ఒక్క నిమిషం ఆగు. రేపు సాయంత్రం మా ఇంటికి వస్తావా? ఎంచక్కా ఐస్‌క్రీం పార్టీ చేసుకుందాం. నువ్వు వస్తానంటే వేదాంత్‌, సార్థక్‌లను కూడా పిలుస్తా’ అన్నాడ[ు. దానికి.. ‘నేను రాలేను యశస్వీ’ అని బదులిచ్చాడు ఆకాశ్‌. ‘ఏమైంది? ఎందుకు రానంటున్నావు’ అని మెల్లగా అడిగాడు యశస్వి. ‘మా నాన్న రేపు నన్ను, మా చెల్లిని పుస్తక ప్రదర్శనకు తీసుకెళ్తానన్నారు’ అని బదులిచ్చాడా అబ్బాయి. ‘పుస్తకాలు ఎప్పుడైనా, ఎక్కడైనా కొనుక్కోవచ్చు కదా! ఎగ్జిబిషన్‌ వరకు వెళ్లాలా’ అని ఆశ్చర్యంగా అడిగాడు యశస్వి. ‘ఎగ్జిబిషన్‌లో అయితే చాలా దుకాణాలు ఉంటాయి. రకరకాల పుస్తకాలన్నీ ఒకే చోట దొరుకుతాయి. ఏవి కావాలంటే అవి కొనుక్కోవచ్చు. ఆ పుస్తక ప్రదర్శన కొన్ని రోజులే ఉంటుంది. ఐస్‌క్రీం పార్టీ ఇంకెప్పుడైనా చేసుకోవచ్చు’ అన్నాడు ఆకాశ్‌.

‘అయితే నేనూ మీతో రావచ్చా?’ అని అడిగాడు యశస్వి. ‘ఓ.. తప్పకుండా రావచ్చు. వస్తామంటే.. వేదాంత్‌, సార్థక్‌లను కూడా తీసుకెళ్దాం’ అంటూ.. ముందుకు వెళ్లి, వాళ్లను కూడా అడిగాడు ఆకాశ్‌. అప్పుడు.. ‘మనకు కథలు అమ్మానాన్నలు చెబుతారు. పైగా యూట్యూబ్‌లో కూడా వింటాం. ఇంకా పుస్తకాలు ఎందుకు?’ అన్నాడు సార్థక్‌. ‘ఇది వరకు ఒకసారి నేను కూడా మా నాన్నతో ఇదే మాట అన్నాను. అప్పుడు ఆయన.. ‘కథలు వినడం వేరు, చదవడం వేరు. చిన్న వయసులో కథలు వినడం బాగుంటుంది. ఎదిగే కొద్దీ, పై తరగతులు చదివేటప్పుడు పుస్తకం చదవడం రావాలి. అంటే తప్పకుండా కథల పుస్తకాలు చదవాలి. అప్పుడే భాష బాగా వస్తుంది. కొత్త కొత్త పదాలు తెలుస్తాయి. తప్పులు లేకుండా రాసేందుకు పుస్తక పఠనం సహాయపడుతుంది. అంతే కాదు కథలు చదువుతూ.. పొందే అనుభూతి వేరని చెప్పారు’  అంటూ వివరించాడు ఆకాశ్‌. ‘వింటుంటే.. నువ్వు చెప్పింది కూడా నిజమే అనిపిస్తోంది. పుస్తక ప్రదర్శనకు మేము కూడా వస్తాం’ అన్నాడు సార్థక్‌.

ఇక అలా మాట్లాడుకుంటూ.. అందరూ నడుస్తూ ఉన్నారు. ‘నాకు రాజులు, జంతువుల పాత్రలు ఉన్న కథలు అంటే చాలా ఇష్టం. అలాంటి పుస్తకాలే కొనుక్కుంటాను’ అన్నాడు సార్థక్‌. ‘నేను సైన్స్‌, ప్రకృతికి సంబంధించిన పుస్తకాలు కొంటాను’ అన్నాడు యశస్వి. అయితే.. నేను అనువాద కథలు, జీవిత చరిత్రలు తీసుకుంటాను’ అన్నాడు ఆకాశ్‌. ‘నాకు ఎక్కువగా.. సాహస వీరుల కథలు, ప్రపంచంలోని ప్రసిద్ధ ప్రాంతాలు, కట్టడాలకు చెందిన పుస్తకాలు నచ్చుతాయి’ అని చెప్పాడు వేదాంత్‌. ‘ఇప్పుడు కొనుక్కునే పుస్తకాలన్నీ వేసవి సెలవుల్లో ఎంచక్కా చదువుకోవచ్చు. ఒకరి పుస్తకాలు మరొకరు తీసుకుని అన్ని రకాలూ చదివేయొచ్చు’ అన్నాడు ఆకాశ్‌.

‘ఈ ఆలోచన ఏదో బాగుందే’ అని బదులిచ్చాడు యశస్వి. ఇంతలో వేదాంత్‌, సార్థక్‌ వాళ్ల ఇళ్లు రావడంతో రేపు కలుద్దాం అంటూ వెళ్లిపోయారు. ఇంకాస్త దూరం నడిచాక.. యశస్వి, ఆకాశ్‌ కూడా వాళ్ల ఇళ్లు చేరిపోయారు. మరుసటి రోజు సాయంత్రమే మిత్రులంతా ఆకాశ్‌ వాళ్ల ఇంటికి చేరుకున్నారు. వాళ్ల నాన్న, చెల్లితో కలిసి అంతా పుస్తక ప్రదర్శనకు బయలుదేరారు. పిల్లలంతా పుస్తకాల గురించి మాట్లాడుకుంటూ.. ఉన్నారు. ఇంతలోనే ఎగ్జిబిషన్‌ రానే వచ్చింది. అన్ని పుస్తకాల దుకాణాలు చూస్తూ.. పిల్లలు ఉత్సాహంగా ముందుకు నడవసాగారు. రంగు రంగుల బొమ్మల పుస్తకాలు చూసి, ఆకాశ్‌ చెల్లి విద్య.. ‘నాన్నా! నాకు ఈ పుస్తకం కొను, అదుగో! ఆ పుస్తకం కొను’ అంటూ హడావిడి చేసింది. ముందుగా అనుకున్నట్లుగానే పిల్లలంతా వారికి నచ్చిన పుస్తకాలు కొనుక్కున్నారు. ఆకాశ్‌ వాళ్ల నాన్న కూడా వాళ్లందరికీ ఒక్కో పుస్తకం కొనిపెట్టారు. కాసేపు అక్కడే ఉండి.. తర్వాత పుస్తకాలతో ఇంటికి తిరిగొచ్చారు.  

 జె.శ్యామల


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని