విజయసేనుడు మారాడా..?

విజయపురి రాకుమారుడు విజయసేనుడు, మంత్రి కుమారుడు రవిచంద్ర ఇద్దరూ మంచి స్నేహితులు. వాళ్లు వరదాచార్యులు అనే గురువు దగ్గర విద్యాభ్యాసం చేస్తున్నారు.

Updated : 17 Feb 2024 05:24 IST

విజయపురి రాకుమారుడు విజయసేనుడు, మంత్రి కుమారుడు రవిచంద్ర ఇద్దరూ మంచి స్నేహితులు. వాళ్లు వరదాచార్యులు అనే గురువు దగ్గర విద్యాభ్యాసం చేస్తున్నారు. ఆయన ఆ చుట్టు పక్కల కొండల్లో దొరికే మొక్కల వేర్లతో.. ఆయుర్వేద వైద్యం కూడా చేస్తారు. విజయసేనుడికి కాస్త బద్ధకం ఎక్కువ. గురువు ఏ పని చెప్పినా.. సగం చేసి మిగితాది వదిలేసేవాడు. చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించేవాడు. అతని ప్రవర్తన మార్చుకోవాలని వరదాచార్యులు ఎన్నిసార్లు చెప్పినా అస్సలు పట్టించుకునేవాడు కాదు విజయసేనుడు. ఒకరోజు వరదాచార్యులు ఇద్దరినీ పిలిచి.. ‘నాయనలారా! వైద్యం కోసం ఔషధ మొక్కల వేర్లు కావాల్సి ఉంది. మీరిద్దరూ ఉత్తర దిక్కులో ఉన్న అమృతగిరి కొండల్లోకి వెళ్లి అవి తీసుకురావాలి’ అని వివరాలు చెప్పారు. అలాగేనంటూ.. ఇద్దరూ నడుముకు కత్తి ధరించి తలో గుర్రం ఎక్కి గురువు చెప్పిన బాటలో బయలుదేరారు.

కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత.. వాళ్లని దారిలో బందిపోటు దొంగలు అడ్డుకున్నారు. విజయసేనుడు, రవిచంద్రల మెడలో హారాలు, చేతి కడియాలను లాక్కోవటానికి ప్రయత్నించారు. దాంతో ఇద్దరూ కలిసి వాళ్లతో పోరాడారు. వాళ్ల కత్తి దెబ్బకు ప్రాణభయంతో పారిపోయారా దొంగలు. అప్పుడు విజయసేనుడు.. ‘రవిచంద్రా! నాకు కాస్త అలసటగా ఉంది. కొద్దిసేపు ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటాను. నువ్వు వెళ్లి తినటానికి ఏదైనా ఆహారం దొరుకుతుందేమో తీసుకురా’ అన్నాడు. ‘అలాగే మిత్రమా..’ అంటూ అక్కడి నుంచి వెళ్లాడతను. కొద్దిసేపటికి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న విజయసేనుడికి పులి గాండ్రిపు వినిపించడంతో.. కళ్లు తెరిచి చూశాడు. అడుగు దూరంలో ఉన్న పులిని చూసి, ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడతను. ఏం చేయాలో తోచక వెంటనే లేచి నిల్చొని.. ఒరలోంచి కత్తిని తీశాడు. పులి భయంకరంగా గాండ్రిస్తూ విజయసేనుడి మీదకు దూకబోయింది. కాస్త గాయపడినా.. ఎలాగోలా దాని నుంచి తప్పించుకున్నాడు విజయసేనుడు. కాసేపటికి రవిచంద్ర కూడా గాయాలతో తిరిగొచ్చాడు. అది చూసి కంగారుపడి.. ‘మిత్రమా! ఏంటీ గాయాలు?’ అని ప్రశ్నించాడు విజయసేనుడు. ‘తేనెపట్టు కోసం చెట్టు ఎక్కుతుంటే.. ఎలుగుబంటి దాడి చేసింది మిత్రమా..! దాని నుంచి తప్పించుకునే సమయంలో గాయాలయ్యాయి’ అని బదులిచ్చిన రవిచంద్ర.. ‘ఇప్పుడు నేను క్షేమమే! కానీ నీకేమైంది? ఒంటి నిండా ఆ రక్తం మరకలేంటి?’ అని కంగారుగా అన్నాడు. ‘నేను విశ్రాంతి తీసుకుంటుండగా ఒక పులి నాపై దాడి చేసింది. దానితో పోట్లాడుతుంటే గాయాలయ్యాయి’ అని జవాబిచ్చాడు విజయసేనుడు. ‘మనం జాగ్రత్తగా ఉండాలి’ అంటూ.. తాను తీసుకొచ్చిన దుంపలు, తేనె అందించాడు రవిచంద్ర.

 ఆహారం తిన్న తర్వాత.. ‘అమృతగిరికి నువ్వు వెళ్లు. నేను ఆశ్రమానికి వెళ్లిపోతాను’ అన్నాడు విజయసేనుడు. అలాగేనంటూ అమృతగిరి వైపు ఒంటరిగా బయలుదేరాడు రవిచంద్ర. ఒంటి నిండా గాయాలతో వెనక్కి వచ్చిన విజయసేనుడిని చూసి.. ‘ఏం జరిగింది విజయా? ముందు వెళ్లి స్నానం చేసి రా’ అన్నారు వరదాచార్యులు. అలాగేనంటూ.. నీళ్ల కోసం నూతిలో తాడుతో కట్టిన కడవను వదిలాడు విజయసేనుడు. అది నూతి గోడలకు తాకుతూ చప్పుడు చేస్తూ వెళ్లి నీటిలో పడింది. పైకి వచ్చేటప్పుడు మాత్రం నీటితో.. నిండుగా స్థిరంగా కదులుతూ పైకి వచ్చింది. అప్పుడే అతని దగ్గరకు వెళ్లిన గురువు.. ‘విజయా! జీవిత ప్రయాణంలో సుఖాలతో పాటుగా కష్టాలు కూడా ఉంటాయి. వాటిని ఎదుర్కొన్నప్పుడే మనం ఉన్నత స్థానాలను చేరుకోగలం. నీటిలో నుంచి ఎలాగైతే కడవ పైకి వచ్చిందో.. అలాగే కష్టాల్ని భయపడకుండా దాటినప్పుడు మన లక్ష్యాలను సాధించగలం. అంతే కానీ చేసే పనిని ఎప్పుడు కూడా మధ్యలో వదిలేయకూడదు’ అంటూ హితబోధ చేశారు. విజయసేనుడికి అప్పుడు తన తప్పు తెలిసొచ్చింది. వెంటనే స్నానం చేసి.. కొత్త వస్త్రాలు ధరించి, గుర్రం మీద మెరుపు వేగంతో ప్రయాణించాడు. ఆ మార్గంలోనే రవిచంద్రనూ కలుసుకున్నాడు. ఇక ఇద్దరూ ఆమృతగిరి కొండకు చేరుకుని ఔషద మొక్కల వేర్లతో తిరిగి ఆశ్రమానికి వచ్చారు. అప్పటి నుంచి విజయసేనుడు ఏ పనిని మధ్యలో వదిలేయలేదు. తన తీరును మార్చుకున్నందుకు వరదాచార్యులు కూడా చాలా సంతోషించారు.  

 పైడిమర్రి రామకృష్ణ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని