తాతయ్య మాట బంగారు బాట!!

‘పిల్లలూ...! రేపు మనం పంచభూతాల గురించి పాఠం చెప్పుకుందాం. దాంట్లో ఎన్నో ముఖ్యమైన విషయాలున్నాయి. మీలో ఎవరూ రేపు స్కూల్‌ మానేయకూడదు. సరేనా?’ అన్నారు టీచర్‌. ‘ఓ.. సరే మేడం!’ అన్నారు పిల్లలు ముక్తకంఠంతో.

Updated : 20 Feb 2024 05:12 IST

‘పిల్లలూ...! రేపు మనం పంచభూతాల గురించి పాఠం చెప్పుకుందాం. దాంట్లో ఎన్నో ముఖ్యమైన విషయాలున్నాయి. మీలో ఎవరూ రేపు స్కూల్‌ మానేయకూడదు. సరేనా?’ అన్నారు టీచర్‌. ‘ఓ.. సరే మేడం!’ అన్నారు పిల్లలు ముక్తకంఠంతో. ఇంతలో ఇంటికి వెళ్లిపోయే బెల్‌ మోగింది. పిల్లలందరూ బ్యాగులు సర్దుకుని ఇళ్లకు బయలుదేరారు. శ్లోక ఇంటికి రావడంతోనే బ్యాగ్‌ అలమరాలో పెట్టి సరాసరి వంటగదిలోకి వెళ్లింది.

‘అమ్మా! పంచభూతాలు అంటే ఏమిటి?’ అని అడిగింది. ‘ఇప్పుడు అవెందుకు? నీ కోసం వేడి వేడి పకోడీలు వేశాను. కాళ్లూచేతులు కడుక్కొని ఈ ప్లేటు తీసుకో. అలాగే మరో ప్లేటు తీసుకెళ్లి మీ తాతయ్యకివ్వు’ అంది శ్లోక వాళ్ల అమ్మ. ‘అది కాదమ్మా! మా టీచర్‌ రేపు పంచభూతాల గురించి పాఠం చెప్తారంట. ఆ మాట విన్నప్పటి నుంచి, నాకు వాటి గురించి తెలుసుకోవాలనుంది’ అంది శ్లోక.

‘శ్లోకా! రేపు టీచర్‌ చెప్తానన్నారు కదా! నన్ను విసిగించకుండా ఇక్కడ నుంచి వెళ్లు. పకోడీలు తాతయ్యకు ఇచ్చి, నువ్వు కూడా తిను’ అంది అమ్మ. తను అయిష్టంగానే ప్లేట్లు తీసుకుని హాల్లో ఉన్న తాతయ్య దగ్గరకు వెళ్లింది. పుస్తకం చదువుతున్న ఆయన శ్లోకను చూశారు. ‘బంగారు తల్లి ముఖంలో ఏదో దిగులు కనిపిస్తోంది. అది ఏమిటో?’ అంటూ రెండు ప్లేట్లు తీసుకుని పక్కన పెట్టి, మనవరాలిని ఒళ్లో కూర్చోబెట్టుకున్నారు రాఘవరావు.

‘తాతయ్యా! పంచభూతాలు అంటే ఏమిటి? అమ్మను అడిగితే చెప్పలేదు’ బుంగమూతి పెడుతూ అంది శ్లోక. రాఘవరావు చిన్నగా నవ్వి.. ‘నేను చెప్తాను.. కానీ పకోడీ చల్లారిపోతోంది. త్వరగా తిను.. తర్వాత తీరిగ్గా వాటి గురించి చెప్పుకుందాం’ అన్నారు. దాంతో ఆ చిన్నారి ముఖం వికసించింది. గబగబా పకోడీలు తినేసింది.

తను తిన్న ప్లేటూ, తాతయ్య తిన్న ప్లేటూ వంట గదిలోకి వెళ్లి సింకులో పెట్టి చెయ్యి కడుక్కుని మంచినీళ్లు తాగింది. తాతయ్యకు కూడా మంచి నీళ్ల గ్లాసు తెచ్చిచ్చింది. ‘ఇప్పుడు చెప్పండి తాతయ్యా! పంచభూతాలు అంటే ఏంటో?’ అని ఆసక్తిగా అడిగింది శ్లోక. ‘భూమి, ఆకాశం, అగ్ని, జలం, వాయువునే పంచభూతాలు అంటారు’ అని చెప్పారు రాఘవరావు.  

‘తాతయ్యా! నాకు అర్థం కావడం లేదు. వివరంగా చెప్పండి’ అంది శ్లోక. ‘సరే శ్రద్ధగా విను. ప్రకృతిని పరిరక్షించేవి పంచభూతాలు. భూమి మనం నివసించడానికి మూలం. ఆకాశం అంటే మనకు తెలియని పెద్ద శక్తి. అగ్ని అంటే చైతన్యం. నిప్పు లేకపోతే మనం ఏ పనీ చేయలేం. జలం అంటే అమృతంతో సమానం. నీరు లేకపోతే మనిషికి మనుగడే లేదు. వాయువు అంటే సమస్త జీవరాశికి ఊపిరి. ఈ అయిదూ లేకపోతే ప్రకృతి లేనట్లే. అందుకని మనం వీటిని రక్షించాలి’ అన్నారు రాఘవరావు.

‘మనం వీటిని ఎలా రక్షించాలి తాతయ్యా?’ అంది శ్లోక. ‘వీటిలో ఆకాశం, అగ్నిని మనం ఏమీ చేయలేం. మిగిలిన మూడు మనం చేయగలిగినవి. భూమి మీద మట్టి కనిపించనివ్వడం లేదు. వర్షపు నీరు ఇంకనివ్వకుండా అంతా సిమెంటు, కాంక్రీటు చేసేస్తున్నారు. దీని వల్ల భూమి వేడెక్కిపోతోంది. మనం స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ కార్బన్‌డయాక్సైడ్‌ వదిలేస్తాం. మనకు ఆక్సిజన్‌ మొక్కల నుంచి వస్తుంది. మనం వదిలిన గాలి అవి పీల్చుకుంటాయి. కానీ రోడ్లు, ఇళ్లు, పరిశ్రమలు, ఇతర నిర్మాణాల కోసం మొక్కలు, చెట్లు నరికేస్తున్నాం. గాలిని కలుషితం చేస్తున్నాం. ఇక నీటి విషయానికి వస్తే రకరకాల ఫ్యాక్టరీలు విడుదల చేసే వ్యర్థ పదార్థాలను నదులు, చెరువుల్లోకి వదలడం వల్ల జలవనరులు కలుషితం అవుతున్నాయి. వీటన్నింటి కోసం ప్రభుత్వం, ప్రజలు తగిన చర్యలు తీసుకోవాలి’ అన్నారు రాఘవరావు.

‘అమ్మో! పంచభూతాలంటే మీరు చాలా చెప్పారు తాతయ్యా! ఇదంతా నేను ఎలా గుర్తుపెట్టుకోగలను?’ కళ్లు పెద్దవి చేసుకుంటూ అందా చిన్నారి. ‘శ్లోకా! ఇదంతా నువ్వు అర్థం చేసుకుంటే తప్పకుండా గుర్తుంటుంది. బాగా ఆలోచించి చూడు. మనం నిలబడిన నేల, మన తలపైన ఆకాశం, మనలో జీవం అగ్ని, మన ఊపిరి గాలి, ప్రాణం నీరు. అంతా కలిపితే ప్రకృతి. ఇప్పుడు తేలికగా ఉందా?’ అని నవ్వుతూ అన్నారు రాఘవరావు.  

‘తాతయ్యా! ఇప్పుడు బాగా అర్థమైంది. నేను మా స్నేహితులకు మీరు చెప్పిందంతా వివరంగా చెప్పగలను’ అని  ఆనందంగా అంది శ్లోక. ‘అందుకే నువ్వు నా బంగారు తల్లివి’ అన్నారు రాఘవరావు. ‘మా తాతయ్య కూడా బంగారమే’ కిలకిలా నవ్వుతూ అందా అమ్మాయి. ‘పిల్లలూ! మీలో ఎవరికైనా పంచభూతాల గురించి తెలుసా?...’ అని మరుసటి రోజు ఉదయం తరగతి గదిలో అడిగారు టీచర్‌.

‘నాకు తెలుసు మేడం!’ అని సమాధానమిచ్చింది శ్లోక. ‘నిజమా! అయితే చెప్పమ్మా!’ అన్నారు టీచర్‌. శ్లోక, తాతయ్య చెప్పిందంతా పొల్లు పోకుండా చెప్పింది. దాంతో ‘వెరీ గుడ్‌ శ్లోకా!’ అంటూ టీచర్‌ మెచ్చుకున్నారు. ఆ వెంటనే పిల్లలందరూ చప్పట్లతో శ్లోకను అభినందించారు.

కేవీ సుమలత

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని