గాయపడిన గుర్రం!

పల్లవ రాజ్యాన్ని జయసింహుడు పాలించేవాడు. ఆయన కుమారుడు విజయుడు. కోటలో నామమాత్ర విద్య పూర్తి చేసుకున్న తర్వాత.. ఉన్నత విద్య కోసం యువరాజుని గురుకులానికి పంపించాడు రాజు.

Published : 21 Feb 2024 02:23 IST

ల్లవ రాజ్యాన్ని జయసింహుడు పాలించేవాడు. ఆయన కుమారుడు విజయుడు. కోటలో నామమాత్ర విద్య పూర్తి చేసుకున్న తర్వాత.. ఉన్నత విద్య కోసం యువరాజుని గురుకులానికి పంపించాడు రాజు. తనతో పాటుగా.. మంత్రి కుమారుడు వసంతుడు, సైన్యాధికారి కుమారుడు కేశవుడు కూడా అదే గురుకులంలో చేరారు. అక్కడ సకల విద్యలూ పూర్తిచేసుకొని ముగ్గురూ కోటకు చేరుకున్నారు. ఒకరోజు వాళ్లు గుర్రాల మీద కృష్ణాపురం నుంచి పార్వతీపురం వెళ్లి తిరిగి రావాలని పందెం వేసుకున్నారు. అనుకున్నట్లుగానే ప్రయాణం ప్రారంభించారు. విజయుడు వేగంగా గుర్రాన్ని తోలుతూ కృష్ణాపురం పొలిమేర వరకు వెళ్లాడు. అక్కడ రామయ్య అనే వ్యక్తి కట్టెలు కొడుతూ ఉన్నాడు. పొరపాటున అందులో నుంచి ఓ చెక్క ఎగిరి విజయుడి గుర్రం ముఖానికి తగిలింది. దాంతో అది గట్టిగా అరుస్తూ.. విజయుడిని కింద పడేసింది. అతను లేచే లోపే రామయ్య వచ్చి.. ‘క్షమించండి యువరాజా.. మీరు వస్తున్నది చూసుకోలేదు’ అన్నాడు. ఇంతలోనే.. వెనకాల వచ్చిన వసంతుడు, కేశవుడు గుర్రాలు దిగి విజయుడి అశ్వాన్ని పరీక్షించారు. దాని కంటి కింద కాస్త గాయమై రక్తం కారసాగింది. కాలు కూడా బెణికింది. వెంటనే గాయాన్ని తడి గుడ్డతో తుడిచారు.

విజయుడు దూకుడు స్వభావం కలవాడు. అందుకని వసంతుడు గాయపడిన గుర్రం దగ్గర ఉండి.. తన గుర్రాన్ని విజయుడికి ఇచ్చి పంపించాడు. కోటకు చేరుకున్నాక విజయుడు మహారాజుకు విషయం చెప్పి.. రామయ్యను బంధించి కోటకు రప్పించాడు. విచారణ తర్వాత ‘రామయ్యను చెరసాలలో వేయండి’ అన్నాడు రాజు. అప్పుడు విజయుడు.. ‘మహారాజా! రామయ్యకు ఉరి శిక్ష వేయాల్సిందే! గుర్రపు స్వారీలో గెలిచే అశ్వాన్ని గాయపరిచి నా ఓటమికి కారకుడయ్యాడు’ అన్నాడు. ఈ వార్త రాజ్యం మొత్తం వ్యాపించింది. ‘గుర్రానికి గాయమయితే.. ఒక మనిషిని ఉరి తీస్తారా?’ అని ప్రజలు చెవులు కొరుక్కోసాగారు. మరుసటిరోజు సభ ఏర్పాటు చేశాడు మహారాజు. ‘రాజ్య ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటున్నారు. గాయపడిన గుర్రం ఒక మాసంలో పూర్తిగా కోలుకుంటుంది.. కానీ మా నాన్నను ఉరి తీస్తే పోయిన ప్రాణం తిరిగొస్తుందా? మీరే ఆలోచించండి’ అన్నాడు రామయ్య కుమారుడు.

దాంతో ఆలోచనలో పడ్డ మహారాజు.. ‘యువరాజుది తప్పా? లేకపోతే.. రామయ్యది తప్పా?’ అని న్యాయమూర్తి నుంచి సలహా తీసుకుందామని నిర్ణయించుకున్నాడు. కానీ ఆయనకు ఆరోగ్యం బాగోలేకపోయేసరికి రాలేకపోయారు. అప్పుడు సహాయ న్యాయ సలహాదారులు.. ‘ప్రజాభిప్రాయ సేకరణ చేద్దాం. కొత్త పద్ధతిలో నిర్ణయం తీసుకుందాం’ అని రాజుకు సలహా ఇచ్చారు. అలా ఒక పక్షం రోజులు గడిచాయి. రాజ్యం చుట్టపక్కల పది గ్రామాల నుంచి వంద మంది సామాన్య ప్రజలను ఎన్నుకుని, వాళ్లను కోటకు తీసుకొచ్చారు. అనంతరం రెండు చెక్కపెట్టెలను వారికి ఎదురుగా ఉంచారు. ఒక పెట్టె మీద రామయ్యది తప్పు అని, మరో పెట్టె మీద యువరాజుది తప్పు అని రాయించారు. వచ్చిన వాళ్లందరికి విషయాన్ని వివరించి.. రాగి నాణేలు అందించారు. వాటిని ఆ పెట్టెల్లో వేసి నిర్ణయాన్ని తెలియజేయాలని చెప్పారు మహారాజు. చెప్పినట్లుగానే అందరూ.. ఒకరి తర్వాత మరొకరు నాణేలు ఆ పెట్టెల్లో వేశారు.

కొన్ని గంటల అనంతరం అందరి సమక్షంలో.. ఆ పెట్టెల్లోని నాణేలను లెక్కించారు. ఆ కార్యక్రమానికి గురుకుల గురువు సుధాముడు కూడా వచ్చారు. విచిత్రంగా ఇద్దరికీ సమానంగా చెరో యాభై వచ్చాయి. అప్పుడు మహారాజు తన నాణేన్ని ఉపయోగించి.. యువరాజుది తప్పు అని రాసి ఉన్న పెట్టెలో వేశాడు. అది చూసిన యువరాజు కోపంతో మందిరానికి వెళ్లిపోయాడు. తన వెనకాలే సుధాముడు వెళ్లి.. ‘యువరాజా! నువ్వు గురుకులంలో అన్ని విద్యలూ ఎంతో క్రమశిక్షణతో నేర్చుకున్నావు. కానీ రామయ్య విషయంలో తొందరపడ్డావు. త్వరలోనే నీకు పట్టాభిషేకం జరగబోతోంది. నువ్వు మీ నాన్న పేరు నిలబెట్టాలి.. కానీ ఈ దుడుకు స్వభావం మంచిది కాదు. ప్రజలపై నీకు సానుకూల భావం ఉండాలి. ఇలా చిన్నచిన్న విషయాలకు వారిని ఇబ్బంది పెట్టడం సరైంది కాదు. రామయ్య కావాలని చేసిన పని కాదు కాబట్టి, ఇందులో అతని తప్పేమీ లేదు.. అర్థమయ్యిందా?’ అని సున్నితంగా మందలించాడు. ఆ మాటలు విన్న యువరాజు.. ‘నాది తప్పే గురువు గారు క్షమించండి’ అన్నాడు. కాసేపటికి సుధాముడు, యువరాజు ఇద్దరూ కలిసి సభలోకి వచ్చారు. రాజాజ్ఞ మేరకు భటులు చెరసాల నుంచి రామయ్యను విడిపించారు. ఆ తర్వాత యువరాజు సభా ముఖంగా రామయ్యని క్షమాపణ కోరాడు. అతనిలో వచ్చిన మార్పునకు మహారాజుతో సహా అందరూ చప్పట్లతో అభినందించారు.

యు.విజయశేఖర రెడ్డి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని