యువరాజు మెచ్చిన దర్జీ!

నాదర్‌గుల్‌లో నాజర్‌ చదువుకున్న నిరుపేద దర్జీ. దుస్తులు నాణ్యంగా, అందంగా కుట్టేవాడు. ఎప్పటికప్పుడు వినూత్నంగా ఆలోచిస్తూ వినియోగదారుల ఆకృతిని బట్టి వారికి నప్పేలా, నలుగురూ మెచ్చేలా కుట్టేవాడు.

Updated : 22 Feb 2024 04:41 IST

నాదర్‌గుల్‌లో నాజర్‌ చదువుకున్న నిరుపేద దర్జీ. దుస్తులు నాణ్యంగా, అందంగా కుట్టేవాడు. ఎప్పటికప్పుడు వినూత్నంగా ఆలోచిస్తూ వినియోగదారుల ఆకృతిని బట్టి వారికి నప్పేలా, నలుగురూ మెచ్చేలా కుట్టేవాడు. నాజర్‌ ఉదయమే లేచి మైదానంలో వ్యాయామం చేసేవాడు. నాదర్‌గుల్‌ యువ జమీందారు నారదదత్తు కూడా ప్రతిరోజు మైదానానికి వచ్చి ఆటలు ఆడేవాడు. ఇద్దరికీ దేహదారుఢ్యం మీద ఆసక్తి ఉండటంతో స్నేహం ఏర్పడింది.

అతను కూడా నాజర్‌ దగ్గరే దుస్తులు కుట్టించుకునేవాడు. నారదదత్తు, యువరాజు వినోదవర్మ మంచి మిత్రులు. ఇద్దరూ ఒకే గురుకులంలో కలిసి చదువుకున్నారు. యువరాజును కలవటానికి రాజధానికి వెళ్లినప్పుడు నాజర్‌ కుట్టిన దుస్తులే వేసుకునేవాడు నారదదత్తు. ఆ దుస్తులు బాగున్నాయని, అందంగా కుట్టారని మెచ్చుకునేవాడు వినోదవర్మ.

అతనికి దుస్తులంటే పిచ్చి ప్రేమ. ఖరీదైన దుస్తులు కుట్టించుకుని అందంగా కనబడాలని ఆరాటపడేవాడు. దుస్తులపై బంగారు తీగలతో సింహం, పులి వంటి రాజసం ఉట్టిపడే జంతువుల తలలు అల్లించుకునేవాడు. చిన్ని చిన్ని రత్నాలతో ఇరువైపులా బుసలు కొట్టే పాముల బొమ్మలు  పొదిగించుకునేవాడు. వజ్రాలతో గుండీలు కుట్టించుకునేవాడు. ఆ ఖరీదైన దుస్తులు వేసుకుని కూడా అసంతృప్తి చెందేవాడు.

తనకు నప్పేలా కుట్టలేదని దర్జీలపై అరిచేవాడు. ఎంతో ఖరీదైన వస్త్రం, ఇతర అలంకరణ వస్తువులు ఇచ్చినా కుట్టడం రాలేదని కసురుకునేవాడు. కోపంతో ఎందరో దర్జీలను మార్చాడు వినోదవర్మ. ఒక ఉదయం మైదానంలో వ్యాయామం చేస్తూ... ‘నాజర్‌! నెలరోజుల్లో యువరాజు వినోదవర్మ పుట్టినరోజు రాబోతోంది. అతనికి నచ్చేలా దుస్తులు కుట్టావంటే, నీ పేదరికం మొత్తం పోయి ధనవంతుడివి అవుతావు! యువరాజు నాకు మంచి మిత్రుడు. ఈసారి తనకు దుస్తులు కుట్టే అవకాశం నీకు ఇప్పిస్తాను. రేపు నిన్ను రాజ భవనానికి తీసుకెళ్తాను!’ అన్నాడు నారదదత్తు.

చెప్పినట్లుగానే మరుసటిరోజు ఉదయాన్నే నాజర్‌ను రాజధానికి తీసుకెళ్లాడు దత్తు. యువరాజు శరీర కొలతలు తీసుకున్నాక.. కాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చాడు దర్జీ. ‘నా మిత్రుడికి కుట్టినట్లు నాకూ అందంగా దుస్తులు కుట్టావంటే నీకు కోరినంత ధనం ఇస్తాను!’ అన్నాడు యువరాజు.

‘తప్పకుండా మీరు మెచ్చుతారు.... యువరాజా!’ అన్నాడు నాజర్‌. ‘నీకు ఎంత ఖరీదైన వస్త్రం కావాలో అడుగు ఇప్పిస్తాను. కానీ నాకు దుస్తులు అందంగా ఉండాలి! బంగారం, వజ్రాలు, రత్నాలు, ముత్యాలు ఎన్ని కావాలంటే, అన్ని తీసుకుని కుట్టు. దుస్తులు వేసుకోగానే హుందాగా, అద్భుతంగా ఉండాలి!’ అన్నాడు వినోదవర్మ. ‘యువరాజా! లోకం మెచ్చేలా అందమైన దుస్తులు కుట్టి ఇచ్చే పూచీ నాది! కానీ ఈ నెల రోజులు మీరు.. నేను చెప్పినట్టు నడుచుకుంటానని మాట ఇవ్వాలి!’ అన్నాడు. యువరాజు ఒక్క నిమిషం ఆలోచించి, అంగీకరించాడు.
పుట్టినరోజుకు నాజర్‌ కుట్టిన దుస్తులు ధరించాడు వినోదవర్మ. సామాన్యమైన వస్త్రంతో, ఖరీదైన అలంకారాలు ఏమీ లేకుండా కుట్టిన దుస్తుల్లో యువరాజు ఎంతో హుందాగా, అందంగా కనిపిస్తున్నాడు. వేడుకకు వచ్చిన వారంతా యువరాజు అందాన్ని పొగిడారు. అద్దం ముందు నిలబడి తన ప్రతిబింబాన్ని చూసుకుని మురిసిపోయాడు.

నారదదత్తునితో.. ‘మిత్రమా! వ్యాయామం లేకుండా అడ్డదిడ్డంగా పెరిగిన నా శరీరమే నాకు ఇంతకాలం వికారం ఆపాదించింది. లోపం.. పాపం ఆ దర్జీలది కాదు. నా ఆకారం వల్లే అనర్థమంతా! ఖరీధైన దుస్తులతో అందం రాదని.. మంచి ఆకృతిలో ఉన్న శరీరానికి సామాన్య వస్త్రాలు కూడా ఎంతో అందాన్ని ఇస్తాయని నాజర్‌ నిరూపించాడు’ అన్నాడు.

నాజర్‌ నెలరోజులు యువరాజు వెంటే ఉండి వ్యాయామం చేయించాడు. దాంతో పొట్టతగ్గి అందమైన రూపం ఏర్పడింది. నాజర్‌కు ఊహించనంత ధనం ఇవ్వడమేగాక, ఆస్థాన దర్జీగా నియమించుకున్నాడు వినోదవర్మ.

పైడిమర్రి రామకృష్ణ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని