ఇద్దరు మిత్రులు!

విజయపురి గ్రామంలో శరభయ్య, భీమయ్య అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. వాళ్లు ఒకరి కుటుంబానికి ఇంకొకరు అండగా ఉంటూ.. అందరితో ఆత్మీయ మిత్రులు అనిపించుకునేవారు.

Updated : 25 Feb 2024 05:20 IST

విజయపురి గ్రామంలో శరభయ్య, భీమయ్య అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. వాళ్లు ఒకరి కుటుంబానికి ఇంకొకరు అండగా ఉంటూ.. అందరితో ఆత్మీయ మిత్రులు అనిపించుకునేవారు. శరభయ్య తన ఇంటి పై భాగంలో ఉన్న గదిని ఆ గ్రామంలో వ్యాపారం చేసుకోవడానికి వచ్చిన రఘురాంకు అద్దెకు ఇచ్చాడు. అయితే అతను శరభయ్యకు యాభైవేల రూపాయలు ఇచ్చి.. దానికి వడ్డీ లేకుండా, తాను ఉండే గదికి అద్దె లేకుండా.. ఇల్లు ఖాళీ చేసేటప్పుడు మళ్లీ ఆ డబ్బులు తిరిగి ఇచ్చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. శరభయ్య తన కుమారుడికి వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం రఘురాంని గది ఖాళీ చేయమని చెప్పాడు. అలాగేనంటూ.. ‘మన ఒప్పందం ప్రకారం నేను మీకు ఇచ్చిన యాభై వేలు ఇవ్వండి. వెంటనే ఖాళీ చేస్తాను’ అన్నాడతను. కాసేపు ఆలోచించిన శరభయ్య.. నువ్వు ఇచ్చిన డబ్బులు ప్రతినెల అద్దె కింద జమ చేసుకున్నాను. ఇక నేను నీకు ఇవ్వాల్సిందేమీ లేదు. వెంటనే గది ఖాళీ చెయ్యి’ అని కోపంగా చెప్పాడు. అప్పుడు ఆ వ్యాపారి తనకు ఇవ్వాల్సిన డబ్బులు శరభయ్య ఇవ్వడం లేదని పంచాయితీలో ఫిర్యాదు చేశాడు. మరుసటి రోజు ఉదయాన్నే ఆ గ్రామ రావిచెట్టు దగ్గర సమావేశం ఏర్పాటు చేశారు.

విజయపురిలో పంచాయితీ నియమాల ప్రకారం ఎవరైతే ఫిర్యాదు చేస్తారో, వారు ఆ రోజు సమావేశానికి హాజరైన గ్రామస్థుల్లో ఎవరినైనా న్యాయాధికారిగా ఎంపిక చేసుకోవచ్చు. ఫిర్యాదు చేసిన రఘురాం ఈ తగాదాకు న్యాయాధికారిగా భీమయ్య పేరు సూచించాడు. అప్పుడు అతను వ్యాపారితో.. ‘శరభయ్య నా మిత్రుడు. అందువల్ల ఈ సమస్యకు న్యాయాధికారిగా నన్ను ఎంచుకోవడం సరైంది కాదు’ అన్నాడు. వెంటనే శరభయ్య కలగజేసుకొని.. ‘మిత్రమా! నిన్ను న్యాయాధికారిగా ఎంపిక చేసుకున్న తర్వాత కాదనడం సరికాదు. మన ఊరి నియమాలను ఉల్లంఘించినట్లు అవుతుంది. కాబట్టి నువ్వే న్యాయం చెప్పాలి’ అని అన్నాడు. అక్కడున్న అందరూ కూడా అదే అనడంతో, భీమయ్య న్యాయాధికారి స్థానంలో కూర్చొని.. శరభయ్య, రఘురాం వాదనలు విన్నాడు. వారి ఒప్పందం గురించి చర్చించి, తీర్పు చెప్పడానికి సన్నద్ధమయ్యాడు. శరభయ్య మిత్రుడు తనకే అనుకూలంగా తీర్పు చెబుతాడని అనుకున్నాడు. కానీ భీమయ్య అన్నీ పరిశీలించి.. ‘మీ ఇద్దరూ చేసుకున్న ఒప్పందం ప్రకారం.. రఘురాం ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయేటప్పుడు తప్పనిసరిగా యాభైవేల రూపాయలు చెల్లించాలి’ అని తీర్పు చెప్పాడు. ఆ తీర్పు తనకు అనుకూలంగా లేకపోవడంతో.. మిత్రుడు భీమయ్య మీద కోపం పెంచేసుకొని తనతో మాట్లాడటం మానేశాడు శరభయ్య.

అలా కొన్నిరోజులు గడిచాయి. భీమయ్య తన పాత ఇంటిని పడగొట్టి కొత్త ఇల్లు నిర్మించడానికి సన్నద్ధమయ్యాడు. తన పక్కనే నివాసం ఉంటున్న రామయ్యతో ఉమ్మడి గోడ నిర్మించడానికి అయ్యే ఖర్చులో సగం ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకున్నాడు. భీమయ్య గోడ కట్టిన తర్వాత.. తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలని అడిగాడు. కానీ దానికి రామయ్య నిరాకరించాడు. గట్టిగా అడిగే సరికి.. ‘భీమయ్య నన్ను డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తున్నాడు’ అని పంచాయితీలో ఫిర్యాదు చేశాడు. ఎప్పటిలాగే రావిచెట్టు నీడలో సమావేశం ఏర్పాటు చేశారు. ఫిర్యాదు చేసిన రామయ్య.. నియమం ప్రకారం ఈ తగాదాను పరిష్కరించడానికి న్యాయాధికారిగా శరభయ్యను ఎంచుకున్నాడు. దాంతో భీమయ్యకు దిగులు మొదలైంది. ‘ఎప్పటి నుంచో అవకాశం కోసం ఎదురుచూస్తున్న శరభయ్య కచ్చితంగా నాకు వ్యతిరేకంగానే తీర్పు చెబుతాడు’ అనుకున్నాడతను. శరభయ్య వెళ్లి న్యాయాధికారి స్థానంలో కూర్చొని ఇరువురి వాదనలు విన్నాడు. అక్కడికి వచ్చిన కొందరు పెద్దల అభిప్రాయాలు కూడా తీసుకొని.. తీర్పు చెప్పడానికి సన్నద్ధమయ్యాడు. రామయ్యను పిలిచి.. ‘ఉమ్మడి గోడ నిర్మాణంలో మొత్తం సొమ్ము భీమయ్య ఖర్చు చేశాడు. న్యాయబద్ధంగా ఆ గోడపై హక్కు ఇద్దరికీ ఉంటుంది. కాబట్టి ఖర్చు కూడా సమానంగా ఉండాలి. నీ వంతు సొమ్ము కచ్చితంగా నువ్వు భీమయ్యకి చెల్లించాలి’ అని తీర్పు చెప్పాడు. ఆ మాటలు విన్న భీమయ్య.. ఆశ్చర్యపోయాడు. అప్పుడు శరభయ్య తన మిత్రుడి దగ్గరకు వచ్చి.. ‘మిత్రమా! నేను ఆ స్థానంలో కూర్చోవడానికి ముందు నీకు వ్యతిరేకంగా తీర్పు చెప్పాలనుకున్నాను. కానీ న్యాయాధికారి స్థానంలో ఉండి అలా చేయడం సరైంది కాదు. ఆ రోజు నువ్వు నాకు అనుకూలంగా తీర్పు ఇవ్వలేదని బాధపడ్డాను. కానీ అప్పుడు ఎందుకలా చేశావో ఇప్పుడే అర్థమైంది. నన్ను క్షమించు’ అన్నాడు. అప్పటి నుంచి ఇద్దరు మిత్రులు ఎప్పటిలాగే కలిసిమెలిసి ఉండసాగారు.

 మొర్రి గోపి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని