మయూఖ మనసెరిగిన నాన్న!

ఆదివారం సెలవు రోజు కావడంతో ఆ కుటుంబంలోని సభ్యులందరూ కలిసి విహారయాత్రకు వెళ్లారు. ఆడారు, పాడారు, అందమైన ప్రదేశాలు చూశారు.

Published : 26 Feb 2024 00:10 IST

దివారం సెలవు రోజు కావడంతో ఆ కుటుంబంలోని సభ్యులందరూ కలిసి విహారయాత్రకు వెళ్లారు. ఆడారు, పాడారు, అందమైన ప్రదేశాలు చూశారు. అటూ ఇటూ వెళుతున్న పిల్లల్ని పెద్దలు అదిలించారు. కొన్ని చోట్లకు వెళ్లబోయే చిన్నారుల్ని వద్దని వారించారు. ఇలా చాలా సేపు ఆనందంగా గడిపారు. భోజనాలు చేసే ముందు చూస్తే మయూఖ కనిపించలేదు. కుటుంబ సభ్యులందరూ ఎవరి సందడిలో వారు ఉండడం వల్ల ఆమె విషయం పట్టించుకోకుండా కాస్త పరాకుగా ఉన్నారు. తల్లి కూడా సందడిలో పడి బిడ్డను పట్టించుకోలేదు.
ఇప్పుడేమో అందరిలోనూ ఒకటే కంగారు. కానీ మయూఖ తండ్రి మాత్రం ఇవేమీ పట్టనట్లు నిబ్బరంగా ఉన్నాడు. ఇంతమంది అంతలా కంగారు పడుతుంటే అతను మాత్రం అంత ప్రశాంతంగా ఉండడం చూసిన భార్యకు కోపం వచ్చింది. ‘పిల్ల కనబడలేదని అందరూ తెగ కంగారు పడుతుంటే మీరు ఇంత నింపాదిగా ఎలా ఉండగలుగుతున్నారు? మయూఖ ఎక్కడికి వెళ్లిందో, ఏమైందో? అన్న ఆలోచన మీకేమాత్రమైనా ఉందా?’ అని కోపం, దుఃఖం కలగలిసిన స్వరంతో నిలదీసింది.
ఆ మాట విన్న అతడు భార్యను ఓదార్చుతూ... ‘అంత కంగారు పడనక్కరలేదు. మయూఖ ఆచూకీ దొరుకుతుంది లే!’ అన్నాడు ధీమాగా. ‘అసలు వెతక్కుండా ఎలా దొరుకుతుంది’ అంది భార్య మరింత కోపంగా. అంతలోనే ఏదో అనుమానం వచ్చి... ‘మీతో చెప్పి ఎక్కడికైనా వెళ్లిందా ఏంటి?’ అని కాస్త ఆశగా అడిగింది.
‘లేదు.. లేదు..’ అన్నట్లు ఆయన అడ్డంగా తలూపాడు. ‘మరి ఏమైనట్టు?’ మళ్లీ అదే ఆత్రుతతో అడిగింది. ఆ మాటకు భర్త.. ‘ఆమె ఎక్కడికైనా వెళ్తున్నా, వెళ్తానన్నా వెళ్లకుండా వద్దని వారించావా?’ అని అడిగాడు. కాసేపు ఆలోచించిన తర్వాత జ్ఞాపకం వచ్చినట్టు.. ‘అవునండీ! ఇందాక ఆ జలపాతం దగ్గరికి వెళతానంది. వద్దన్నాను’ అంది. ‘ఆ తర్వాత ఇంకేమైనా అందా?’ అని రెట్టించి అడిగాడు.
‘నాకు జాగ్రత్తలు తెలుసు. అందుకే దానికి దగ్గరగా వెళ్లను. దూరం నుంచే జలపాతం అందాలను చూస్తానంది. అయినా భోజనాల సమయం దగ్గరవుతున్నందువల్ల నేను వద్దన్నాను’ అని ఆమె సమాధానం ఇచ్చింది. ఆ మాట విన్న భర్త... ‘అయితే నా అంచనా ప్రకారం ఆమె కచ్చితంగా ఆ జలపాతం దగ్గరే ఉంటుంది. వెళ్లి చూడు..’ అన్నాడు.
దీంతో భార్య వెంటనే అక్కడకు పరుగెత్తుకుని వెళ్లింది. భర్త చెప్పినట్టే మయూఖ జలపాతానికి దూరంగా ఒక బండ మీద కూర్చుని ఉంది. పై నుంచి కిందకు జాలువారుతున్న నీటిని చూస్తూ మంత్రముగ్ధురాలవుతోంది. అమ్మ పిలుపు వినగానే మరేమీ మారాం చెయ్యకుండా ఆమె వెనక వచ్చేసింది. అక్కడ నుంచి వచ్చాక భర్తకు ఈ విషయం చెప్పి... ‘మయూఖ జలపాతం దగ్గర ఉంటుందని మీరు అంత కచ్చితంగా ఎలా చెప్పగలిగారు? మీకుగానీ చెప్పిందా? ఒక వేళ చెబితే, మేమంతా ఇంత కంగారు పడుతుంటే, ఆ విషయం నాకు చెప్పవచ్చు కదా?’ అని కాస్త దుఃఖం నిండిన గొంతుతో అడిగింది.
ఆమె మాటలు విన్న భర్త విషయాన్ని వివరిస్తూ... ‘నాకు మయూఖ ఏమీ చెప్పలేదు. కానీ ఊహించాను. పిల్లవాళ్లను ఎక్కడికి వెళ్లకూడదని అడ్డు పెడతామో, ఏ పని వద్దని వారిస్తామో... వారు వాటినే కచ్చితంగా ఏదో ఒక అదును చూసుకుని చెయ్యడానికి ప్రయత్నిస్తారు. అదేవిధంగా, వద్దన్న పనిని, అడ్డు చెప్పిన పనిని ఉద్దేశపూర్వకంగానే చేస్తారు. పెద్దలు కూడా ఇలానే చేస్తారనుకో.. కానీ ఏదైనా సమస్య వచ్చినా పెద్దలు తట్టుకోగలరు. కానీ పిల్లలు తట్టుకోలేరు. అందుకే వాళ్లు చేస్తానన్న పనిని వద్దనకుండా, జాగ్రత్తలు చెప్పి పెద్దల పర్యవేక్షణలో చేయమనడమే మంచిది. అందుకుగాను ఓపిక కావాలి’ అన్నాడు. భర్త చెప్పిన మాటలు ఆమెకు సబబుగానే అనిపించాయి.

ఆదిత్య కార్తికేయ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని