దొరికిన ఇరవై రూపాయల నోటు!

అది ఒక ప్రాథమిక పాఠశాల. అయిదో తరగతి పిల్లలకు అప్పుడే డ్రిల్‌ పీరియడ్‌ ఇచ్చారు. పిల్లలంతా ఆనందంగా బడి ముందున్న ఆటస్థలంలోకి ఆడుకోవడానికి వెళ్లారు.

Updated : 27 Feb 2024 05:32 IST

అది ఒక ప్రాథమిక పాఠశాల. అయిదో తరగతి పిల్లలకు అప్పుడే డ్రిల్‌ పీరియడ్‌ ఇచ్చారు. పిల్లలంతా ఆనందంగా బడి ముందున్న ఆటస్థలంలోకి ఆడుకోవడానికి వెళ్లారు. కవిత, కమల కూడా ఆటస్థలంలో అడుగుపెట్టారు. కవిత, కమల ఇరుగుపొరుగు వారే కావడంతో ఎప్పుడూ కలిసే ఉంటారు. కలిసే బడికి కూడా వస్తారు. ఇంటి దగ్గర కూడా హోమ్‌ వర్క్స్‌ అన్నీ ఒకే దగ్గర కూర్చుని పూర్తి చేస్తారు. ఆటస్థలంలో వారిద్దరికీ, కింద పడి ఉన్న ఇరవై రూపాయల నోటు కనబడింది. ‘కవితా! ఇరవై రూపాయల నోటు’ అని కమల అంది. ‘అవును, చూశాను!’ అంటూ ఆ నోటును తీసింది కవిత. కమల చుట్టూ చూసింది. తోటి స్నేహితులంతా ఆడుకుంటున్నారని, ఆ నోటును తీయడం ఎవరూ గమనించలేదని అనుకుంది.

వెంటనే కవితతో.. ‘నోటును నేను చూశాను. నువ్వు తీశావు. కాబట్టి అది మనిద్దరికి మాత్రమే చెందుతుంది. సగం, సగం పంచుకుందాం. నచ్చినవి కొనుక్కుందాం’ అంది కమల నోటుకేసి మురిపెంగా చూస్తూ. ‘అలా చేయడం తప్పు. పరుల సొమ్ము పాము వంటిదని రవి సార్‌ చెప్పారు. నోటు దొరికిందని సార్‌కు ఇచ్చేద్దాం. పోగొట్టుకున్న వారికి చేరుతుంది’ అంది కవిత.

 ‘లేదు.. లేదు.. నోటు సార్‌కు ఇవ్వొద్దు. మనం పంచుకుందాం. లేకపోతే నా వాటా నాకిచ్చేసి, నీ డబ్బులు రవి సార్‌కు ఇవ్వు’ అంటూ పట్టుబట్టింది కమల. ‘మొన్న నా పెన్సిల్‌ ఇదే ఆటస్థలంలో పోయింది. చాలా బాధపడ్డాను. మన ఫ్రెండ్‌ రమకు దొరికితే, రవి సార్‌కు ఇచ్చింది. అందుకే నా పెన్సిల్‌ తిరిగి నాకు దక్కింది. వస్తువు పోగొట్టుకున్నప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో స్వయంగా తెలుసుకున్నాను. దోచుకుంటేనే కాదు, దొరికింది తీసుకున్న వాళ్లు కూడా దొంగలతో సమానమేనని సార్‌ ఒకసారి చెప్పారు. డ్రిల్‌ పీరియడ్‌ పూర్తవగానే ఆయన క్లాసుకొస్తారు. విషయం చెప్పి ఈ నోటు ఇచ్చేద్దాం.. సరేనా?’ అని అడిగింది కవిత.

 ‘వీల్లేదు, నా డబ్బులు నాకు ఇవ్వాల్సిందే’ అంటూ కవితను అనుసరించింది కమల. బెల్‌ కొట్టడంతో, తోటి పిల్లలతో పాటు వీరు కూడా క్లాసులోకి వెళ్లారు. అప్పుడే రవి సార్‌ కూడా క్లాసులోకి వచ్చారు. ‘డబ్బులు సార్‌కు ఇస్తాను’ అంటూ కవిత నిలబడబోయింది. ‘నా వాటా నాకు ఇచ్చేయ్‌!’ అంటూ కమల, కవితను అడ్డుకుంటోంది.
‘సార్‌! కవితా, కమల దేని గురించో వాదులాడుకుంటున్నారు’ అని వాళ్లిద్దరి పక్కనే కూర్చున్న రమ లేచి చెప్పింది. తరగతిలోని పిల్లలతో పాటు రవి సార్‌ కూడా వాళ్ల వైపు చూసి.. విషయం ఏంటని అడిగారు. అప్పుడు కవిత లేచి, ఇరవై రూపాయల నోటు దొరికిన విషయమంతా చెప్పింది.
‘కమలా! నీ వస్తువు ఏదైనా పోగొట్టుకుంటే బాధ పడతావా?’ అని అడిగారు రవి సార్‌. ‘మొన్నొకసారి, నాన్న నాకోసం కొన్న నోటు బుక్‌ కనబడలేదు. చాలా బాధపడ్డాను. కొన్నిరోజులకు, ఇంట్లో దొరికింది. అప్పుడు చాలా సంతోషం వేసింది సార్‌’ అని కమల బదులుగా అంది. అప్పుడు సార్‌ నవ్వుతూ.. ‘పోగొట్టుకున్న వస్తువు దొరికితే చాలా ఆనందం కలుగుతుంది. మరి ఈ ఇరవై రూపాయలు పోగొట్టుకున్న వారికి అందిస్తే వాళ్లకెంత ఆనందం కలుగుతుందో ఊహించావా? ఏదైనా వస్తువు దొరికితే, అది పోగొట్టుకున్న వారికి చేర్చడం మన బాధ్యత. అలా అందరూ చేసినప్పుడే, మనం పొరపాటున పోగొట్టుకున్న వస్తువు తిరిగి మనకు చేరుతుంది’ అని సార్‌ చెప్పిన మాటలు శ్రద్ధగా వింది.
‘సార్‌! మీరు చెప్పింది నిజమే. ఆ డబ్బులు పోగొట్టుకున్న వారికి ఇచ్చేయండి’ అని కమల అంది. ‘అయితే ఈ డబ్బులు నావే’ అంటూ నవ్వుతూ సార్‌ జేబులో పెట్టుకున్నారు. కవిత, కమలతో పాటు పిల్లలంతా ఆశ్చర్యపోయారు. ‘సార్‌! అవి మీ డబ్బులా?’ అని కమల అడిగింది.  
‘అవును! మీకు పొదుపు విలువ చెప్పాలని, డబ్బులు దాచుకోవడం నేర్పించాలని, మీ మీ పేర్లతో డిబ్బీలు ఏర్పాటు చేశాను. సంవత్సరం తర్వాత ఎవరివి వారికిస్తాను. పొదుపు చేసిన డబ్బులతో, నచ్చిన పుస్తకాలు కొనుక్కోవచ్చు. దీన్ని చూసేందుకు ఇద్దరు నిజాయతీ గల పిల్లలు కావాలి. మొన్న కవిత పోగొట్టుకున్న పెన్సిల్‌ తెచ్చిచ్చిన, రమ నిజాయతీ తెలిసింది. అయితే రమకు తోడుగా, తెలివైన కవిత, కమలలో ఒకరిని నియమించాలనుకున్నాను. అందుకే ఆటస్థలంలో వారిద్దరికి మాత్రమే కనబడేలా నా ఇరవై రూపాయల నోటును ఉంచాను. నేను చాటుగా ఉండి గమనించాను. ఈ పరీక్ష ద్వారా, కవిత నిజాయతీ తెలిసింది. కనుక రమకు తోడుగా, కవితను నియమిస్తున్నాను. కమల తన తప్పు తెలుసుకున్నందుకు, అభినందిస్తున్నాను!’ అంటూ సార్‌ చప్పట్లు కొట్టారు. తరగతి గదిలోని పిల్లలంతా కూడా, కవితను అభినందిస్తూ చప్పట్లు కొట్టారు. కమల కూడా చప్పట్లు కొట్టింది. ‘ఇంకెప్పుడూ, దొరికిన వస్తువులను సొంతం చేసుకోరాదు’ అని మనసులో అనుకుంది.
- కె.వి.లక్ష్మణరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని