కుటిలం చూపిన కుటిల బుద్ధి!

ఒక దట్టమైన అడవిలో మృగరాజు కేసరి, గజరాజు కుందనంతో చాలా స్నేహంగా ఉండేది. అవి అలా కలిసి ఉండటం కుటిలమనే నక్కకు అస్సలు నచ్చేది కాదు

Published : 29 Feb 2024 02:47 IST

ఒక దట్టమైన అడవిలో మృగరాజు కేసరి, గజరాజు కుందనంతో చాలా స్నేహంగా ఉండేది. అవి అలా కలిసి ఉండటం కుటిలమనే నక్కకు అస్సలు నచ్చేది కాదు. ఎప్పుడూ ఏదో ఒక రకంగా వాటిని విడదీయాలని చూస్తుండేది. మృగరాజు దాని సహజ స్వభావంతో దురుసుగా ప్రవర్తించినా.. కుందనం శాంతంగా ఎదురు చెప్పకుండా స్నేహంతో సరిపెట్టుకునేది.  

ఒక రోజు కేసరి, కుందనం కలిసి అడవిలో షికారు చేస్తున్నాయి. వాటితో కుటిలం కూడా ఉంది. ‘మృగరాజా! సరదాగా ఒక చిన్న మాట చెప్పనా?’ అంది కుందనం. ‘ఆలస్యమెందుకు? చెప్పు’ కుతూహలంగా అంది కేసరి. ‘మనిద్దరం ఇలా పక్క పక్కన నడుస్తుంటే నా పక్కన మీరు ఎలుక పిల్లలాగా చిన్నగా అనిపిస్తున్నారు’ అంటూ కిసుక్కున నవ్వింది కుందనం.

‘ఎంత మాటన్నావు? నిన్ను నీవు కొండంత ఎక్కువ చేసుకుని రారాజును చిట్టెలుకతో పోల్చి అవమానించావు. మంచి స్నేహితులను ఇలా కించపరుస్తారా?’ అని ఇదే అవకాశంగా అంది కుటిల. ఆ మాటలకు కేసరి అహం దెబ్బతినడంతో కోపంగా.. ‘ఇంత ఘోరంగా అవమానించిన నువ్వు ఈ రోజు నుంచి నీ ముఖం చూపించకూడదు. నాకు ఇక నీతో స్నేహం వద్దు, వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపో’ అని గర్జించింది.

‘మీరు పొరబడుతున్నారు మృగరాజా! నేను సరదాగా అని ముందే చెప్పాను. మీరు నా ప్రాణ స్నేహితులు.. మిమ్మల్ని నేను అవమానిస్తానా?’ అంటూ కుందనం ఎంత బతిమిలాడినా కేసరి వినలేదు. దాంతో బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయిందది. దాని కోరిక నెరవేరిందని కుటిలం లోలోపల చాలా ఆనందించింది. రెండు రోజుల తరువాత ఒక వానరం, జింక తగవులాడి న్యాయం కోసం కేసరి దగ్గరకు వచ్చాయి.
‘మృగరాజా! ఈ వానరం, నేను మంచి మిత్రులం. కొద్దిరోజులుగా వానరం ఆరోగ్యం బాగా లేదు. దీనికి ఆహారం నేనే తెచ్చిస్తున్నాను. కానీ అందుకు అది ఒప్పుకోవడం లేదు. దయచేసి దాని ఆరోగ్యం కుదుటపడే వరకు నేను ఆహారం అందించడానికి మీరు ఒప్పించగలరు’ అంది జింక.
జింక వాదన విన్న తరువాత కేసరి అక్కడే ఉన్న వానరం వైౖపు చూసింది. ‘మృగరాజా! జింక మాటలు విన్నారు కదా! దీనికి నేనంటే చాలా ఇష్టం. ఎన్నో క్రూరమృగాలున్న ఈ అడవిలో తనకు ఆహారం దొరకడమే కష్టం. చాలా జాగ్రత్తగా మరుగున దాక్కుంటూ తిరగాలి. ఇక నాకు కూడా ఆహారం తేవాలంటే ఇంకా కష్టపడాల్సి ఉంటుంది. నేను కొద్ది రోజులు పస్తులున్నా ఫర్వాలేదు... కానీ నా నేస్తానికి ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం నేను తట్టుకోలేను. కాబట్టి దానికి మీరు అనుమతివ్వకండి’ అంది.  
‘అదేంటి స్నేహితులంటే ఒకరికి కష్టం వచ్చినప్పుడు మరొకరు ఆదుకోవాలి కదా! అవసరంలో చేయని సహాయం నిరుపయోగం అని మా అమ్మ చెప్పింది’ అంది జింక. ‘శక్తికి మించిన ధర్మం చేయరాదని, మా అమ్మ కూడా చెప్పింది. నా కోసం తను కష్టాలపాలవడం నాకు నచ్చలేదు ప్రభూ!’ అంది వానరం. ఆ ఇద్దరి స్నేహం కేసరికి చూడముచ్చటగా అనిపించింది.
‘భేష్‌! మీరిద్దరూ మంచి స్నేహితులు. ఒకరి కోసం మరొకరు ఆలోచిస్తున్నారు. మీ స్నేహం ఎప్పుడూ ఇలాగే ఉండాలంటే... వానరం ఆరోగ్యం కుదుటపడే వరకు జింక ఆహారం అందించాలి. ఆ తరువాత జింక కోరినన్ని రోజులు వానరం దానికి ఆహారం సమకూర్చాలి. ఇక ఇక్కడ నుంచి సంతోషంగా వెళ్లండి’ అంది కేసరి.
కోతి, జింక ఆనందంగా అక్కడ నుంచి వెళ్లిపోయాయి. కాసేపటి తర్వాత కేసరి ఆలోచనలు కుందనం మీదకు మళ్లాయి. ‘మృగరాజా! స్నేహితులంటే ఇలా ఉండాలి. కుందనంలా కాదు’ అని అవకాశం చూసుకుని అంది కుటిలం. కేసరికి మొదటిసారిగా కుందనం విషయంలో తప్పుగా ప్రవర్తించానేమోననే సంశయం మొదలైంది.
ఆలోచిస్తూ పరధ్యానంగా నడుస్తున్న కేసరి చూసుకోకుండా ఒక గొయ్యిలో పడిపోయింది. పక్కనే ఉన్న కుటిలం... ‘అయ్యో మృగరాజా! ఎంత పని జరిగింది? నేను వెళ్లి మిమ్మల్ని పైకి లాగడానికి ఎవరినైనా తీసుకొస్తాను’ అని ఒడ్డున నిలబడి అంది. ‘కుటిలా! పక్కకు జరుగు’ అంటూ మోకాళ్ల మీద వంగి తొండంతో కేసరిని పైకి లాగింది కుందనం. ‘నిన్ను మృగరాజు ముఖం చూపించవద్దంటే మళ్లీ వచ్చావేంటి?’ అని అసూయగా అంది కుటిలం. ‘మృగరాజా! మీరు నన్ను కనిపించవద్దన్నాక, మీ ముందుకు రాకుండా దాక్కుంటూ మిమ్మల్ని కనిపెట్టుకుంటున్నాను. ఈ రోజు మీరు ఆపదలో ఉన్నారు కాబట్టి, మీ ఆజ్ఞ ధిక్కరించి మరీ మిమ్మల్ని కాపాడాను. నన్ను క్షమించండి. ఇక మీకు కనిపించను’ అంటూ అక్కడ నుంచి వెళ్లబోయింది కుందనం.
‘నేను నీ పై కోపం చూపించినా... నువ్వు నన్ను వదిలేయకుండా, నీడలా నా వెన్నంటే ఉన్నావు. నిజమైన స్నేహమంటే ఇదే! మాట్లాడకపోయినా నా మేలు కోరి, నన్ను రక్షించావు. ఇక నన్ను వదిలి వెళ్లొద్దు. ఇదివరకటి లాగానే మనం స్నేహంగా ఉందాం. నా తొందరపాటుకు మన్నించు’ అని కుందనంతో అంది కేసరి. ‘అలా అనకండి మృగరాజా! స్నేహితుల మధ్య క్షమాపణలు ఉండకూడదు’ అని ఆనందంగా అంది కుందనం. తన జిత్తులు పని చేయకపోవడం వల్ల తోక ముడుచుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది కుటిలం.
- కె.వి.సుమలత


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని