ఇంతకీ కేశవ మారాడా..?

రామాపురంలో ఉండే రాజయ్యకు ఒకే ఒక్క కుమారుడు కేశవ. వాళ్లమ్మ చిన్నతనంలోనే చనిపోవడంతో.. ఆ అబ్బాయిని చాలా గారాబంగా పెంచుకుంటున్నాడు రాజయ్య.

Published : 02 Mar 2024 00:02 IST

రామాపురంలో ఉండే రాజయ్యకు ఒకే ఒక్క కుమారుడు కేశవ. వాళ్లమ్మ చిన్నతనంలోనే చనిపోవడంతో.. ఆ అబ్బాయిని చాలా గారాబంగా పెంచుకుంటున్నాడు రాజయ్య. అందరికంటే బాగా చదవాలని డబ్బులు కట్టి మరీ ప్రైవేటు పాఠశాలలో చేర్పించాడు. కానీ ఆ పిల్లవాడు బడి బాగోలేదని నెల రోజులకే వెళ్లడం మానేశాడు. రాజయ్య ఎంత చెప్పినా అస్సలు వినలేదు. పైగా ఏడవటం మొదలుపెట్టాడు. గారాబంగా పెరిగిన కొడుకు ఏడవటంతో రాజయ్య తనని ఏమీ అనలేకపోయేవాడు. దాంతో కేశవ ఇంకా మొండిగా, అల్లరి వాడిగా తయారయ్యాడు. రాజయ్య పండ్ల వ్యాపారం చేస్తుంటాడు. తాజా పండ్లు తోటల్లో కొని.. ఊర్లోకి తీసుకొచ్చి అమ్ముతుంటాడు. రాజయ్య నిజాయతీ, అతను అమ్మే తాజా సరుకు ఆ కొట్టుకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఒకరోజు అతను కొట్టులో ఉన్నప్పుడు కేశవ వచ్చి.. ‘నాన్నా నా స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి వెళ్తున్నాను. ఒక పది రూపాయలు ఇవ్వవా!’ అని అడిగాడు. దానికి.. ‘నిన్ననే ఇచ్చాను కదా. ఏం చేశావు?’ అని ప్రశ్నించాడు రాజయ్య. ‘అది నిన్న. ఇది ఈ రోజు.. ఎప్పటిది అప్పుడే నాన్నా!’ అంటూ తండ్రి చేతిలో ఉన్న పది రూపాయలు తీసుకొని పరిగెత్తాడు కేశవ.

అక్కడే ఉండి ఇదంతా చూస్తున్న పరంధామయ్య మాస్టారు.. ‘ఆ అబ్బాయి ఎవరు రాజయ్యా.. నీ కొడుకా? ఏం చదువుతున్నాడు’ అని అడిగారు. ‘అవునండీ నా కొడుకే.. ప్రస్తుతం ఏం చదవటం లేదయ్యా. బడికి వెళ్లమంటే మారాం చేసి వెళ్లడంలేదు. వాడిని ఎక్కువగా ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక నేనూ ఏమీ అనలేకపోతున్నా’ అని బాధగా జవాబిచ్చాడు రాజయ్య. ఆ మాటలు విన్న మాస్టారు.. ‘పిల్లవాడికి కనీస చదువు లేకపోతే ఎలా? ఇలాగే వదిలేస్తావా మరి’ అన్నారు. ‘నాకు ఓపిక ఉన్నంత కాలం వాడిని పోషిస్తాను. కొంత సొమ్ము వాడి కోసం దాచిపెడతాను’ అన్నాడా తండ్రి. ‘అందరు తల్లిదండ్రులు చేసే తప్పు ఇదే. మొక్కై వంగనిది మానై వంగుతుందా అన్నారు పెద్దలు. ఇప్పుడిలా వదిలేస్తే వాడు జులాయిలా మారతాడు. నువ్వు కష్టపడి దాచిన డబ్బు కొద్ది రోజుల్లోనే ఖర్చు చేసేస్తాడు. తర్వాత తన పరిస్థితి దుర్భరంగా మారుతుంది. ఏ పనీ రాక.. చేతిలో డబ్బు లేక.. దొంగగా కూడా మారొచ్చు’ అన్నారు మాస్టారు. ‘మీరు అలా అనకండి మాస్టారు. ఏదైనా మార్గం చూపండి’ అని అడిగాడు రాజయ్య. అలాగేనంటూ.. ఏం చేయాలో వివరించారా మాస్టారు.

ఆ మరుసటి రోజు ఆడుకోవడానికి వెళ్తున్న కొడుకుని పిలిచి ‘కేశవా..! నాకు జ్వరం వచ్చింది.. చాలా నీరసంగా ఉంది. ఈ రోజుకి కొట్టు నువ్వే చూసుకోవాలి’ అన్నాడు రాజయ్య. ‘నేను కొట్టు చూసుకోవడమేంటి? నాకు తెలియదు నాన్న. నేను ఆడుకోవడానికి వెళ్లాలి’ అన్నాడు కేశవ. ‘అలా అనొద్దురా.. కొట్టు తీయకపోతే ఉన్న పండ్లన్నీ పాడైపోతాయి. అప్పుడు మనకు చాలా నష్టం వస్తుంది. ఆటలు రేపటి నుంచి మళ్లీ ఆడుకోవచ్చు. ఇంత చెప్పాక కూడా నీకు ఆటలే ముఖ్యమైతే ఇక వెళ్లు’ అన్నాడు రాజయ్య. అంత బాధగా తండ్రి మాట్లాడటం ఎప్పుడూ చూడని కేశవ.. ‘నేను కొట్టు తీస్తాను నాన్నా. కానీ నాకు ఎలా అమ్మాలో తెలియదు’ అని మెల్లగా అన్నాడు. ఆ మాటలు విన్న తండ్రి ‘ఫర్వాలేదు. నేను నీ పక్కనే కూర్చుంటాను’ అని ఆనందంగా బదులిచ్చాడు. ‘అలాగైతే సరే!’ అంటూ ఉత్సాహంగా తండ్రి వెంట బయలుదేరాడు కేశవ.

కొట్టు తెరిచి మొత్తం శుభ్రం చేశాడు. తర్వాత నాన్న చెప్పినట్లుగా దేవుడి పటానికి నమస్కరించి కొట్టులో కూర్చున్నాడు. అనుకున్నట్లే ముందుగా పరంధామయ్య మాస్టారు వచ్చారు. ‘రాజయ్యా.. ఎవరు నీ కొడుకా.. చాలా బుద్ధిమంతుడిలా ఉన్నాడే. ఈ వయసులో నీకు సహాయం చేస్తున్నాడంటే చాలా మంచివాడన్నమాట’ అంటూ కొన్ని పండ్లు కొనుక్కొని డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారాన. ఆయన మాటలకు కేశవ చాలా ఆనందించాడు. ఆ తర్వాత తను ఉత్సాహంగా పని చేయసాగాడు. అప్పుడే బయటికి వెళ్లి వచ్చిన రాజయ్య.. ఆ రోజు వచ్చిన డబ్బులు లెక్క చూసి ‘నువ్వు ఈ రోజు కొట్టు బాగా నడిపావు కేశవా.. ఇన్ని డబ్బులు ఎప్పుడూ రాలేదు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక నుంచి కొట్టును నువ్వే చూసుకోవాలి. నేను తోట నుంచి పండ్లు తీసుకొచ్చి నీకు అప్పజెప్పుతాను’ అన్నాడు. తండ్రి మాటలు కాదనలేక అలాగేనంటూ తలూపాడు కేశవ. మరుసటి రోజు నుంచి ఉదయాన్నే లేచి తండ్రి కంటే ముందుగానే.. కొట్టుకు వెళ్లడం ప్రారంభించాడా అబ్బాయి. దానికి చాలా సంతోషించిన రాజయ్య.. కొడుకు మంచి మార్గంలోకి రావడానికి ఉపాయం చెప్పిన పరంధామయ్య మాస్టారుకు కృతజ్ఞతలు తెలిపాడు. ఇక కొన్ని నెలల్లోనే తండ్రి సహాయంతో మంచి పండ్ల వ్యాపారిగా ఎదిగాడు కేశవ.

 కూచిమంచి నాగేంద్ర


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని