ఆస్థానంలో ఎవరు గొప్ప?

విజయపురి రాజ్యాన్ని నరేంద్రుడు పాలించేవాడు. అతని ఆస్థానంలో ఆరుగురు కవులతో పాటు సుధాముడు అనే విదూషకుడు కూడా ఉండేవాడు. కవులు సుధాముడితో అంత సఖ్యతతో ఉండేవారు కాదు

Updated : 03 Mar 2024 07:03 IST

విజయపురి రాజ్యాన్ని నరేంద్రుడు పాలించేవాడు. అతని ఆస్థానంలో ఆరుగురు కవులతో పాటు సుధాముడు అనే విదూషకుడు కూడా ఉండేవాడు. కవులు సుధాముడితో అంత సఖ్యతతో ఉండేవారు కాదు.. కానీ అతడు మాత్రం వారిని గౌరవించేవాడు. ఒక రోజు ‘మంత్రివర్యా! మన ఆస్థానంలో ఎవరు గొప్పవారో తెలుసుకోవాలని ఉంది’ అన్నాడు రాజు. ‘రాజ్యాన్ని పాలించే మీరు గొప్పవారు.. మీకు సలహాలు ఇచ్చే నేను కూడా గొప్పవాడినే!’ అని బదులిచ్చాడు మంత్రి. ఆ మాటలు విన్న కవులు.. ‘మహారాజా! మేము కూడా గొప్పవాళ్లమే’ అన్నారు. ఇదంతా సుధాముడూ విన్నాడు.

కాసేపటికి అక్కడే ఉన్న మహారాణి వద్దకు వెళ్లి ‘మీ దృష్టిలో ఎవరు గొప్పవారో చెప్పండి?’ అన్నాడు రాజు. ‘సుధాముడు’ అని చెప్పింది రాణి. ‘అలాగా’ అంటూ వెళ్లి.. సింహాసనం మీద కూర్చున్నాడు రాజు. ఆ లోపు సుధాముడు ద్వారం బయట ఉన్న కాపాలాదారుడి చెవిలో ఏదో చెప్పి గబగబా వచ్చి తన స్థానంలో కూర్చున్నాడు. కొద్ది సేపటికి లోపలికి వచ్చి.. ‘మహారాజా! మన్నించండి. సుధాముడి ఇంటి నుంచి ఆయనకు పిలుపు వచ్చింది’ అన్నాడా కాపలాదారుడు. దాంతో వెంటనే లేచి.. ‘మీరు అనుమతి ఇస్తే ఇలా వెళ్లి.. అలా వస్తాను’ అని అడిగాడు సుధాముడు. ‘సరే వెళ్లిరా’ అని చెప్పాడు మహారాజు. ఒక అరగంట తర్వాత సభలోకి వచ్చి.. ‘అంతా అయిపోయింది. కాలం మూడింది కాలి చచ్చాయి’ అన్నాడు సుధాముడు. ‘ఏంటి? అంత చిరాగ్గా చెబుతున్నావు. ఏం జరిగింది.. సరిగ్గా చెప్పు’ అన్నాడు రాజు. ‘రాత్రి, పగలు అని చూడకుండా నులక మంచంలో దూరిన నల్లులు కుట్టి కుట్టీ.. రక్తాన్ని పీలుస్తున్నాయి. అందుకే నా భార్య దానికి నిప్పు అంటించాలని రమ్మని కబురు పెట్టింది. వెళ్లి పని పూర్తి చేసుకొని వచ్చాను. నులక మొత్తం బూడిదయ్యింది. ఆ నల్లులూ చచ్చాయి’ అన్నాడు సుధాముడు.

 ఆ మాటలు విని.. రాజుతో పాటుగా మందిరంలో ఉన్న అందరూ బిగ్గరగా నవ్వారు. ‘సుధామా! భలేగా నవ్వించావు.. ఇదిగో ఈ ఐదు బంగారు నాణేలు బహుమతిగా ఇస్తున్నాను తీసుకో’ అన్నాడు రాజు. వాటిని తీసుకొని.. ‘హమ్మయ్యా! ఈ రోజు రాత్రి నులక మంచం లేకుండా ఎలా పడుకోవాలా అనుకున్నాను. ఈ నాణేలతో ఇంకో మంచం కొంటాను’ అన్నాడు సుధాముడు.

కాసేపటికి.. ‘తనను తాను తక్కువ చేసుకుని, మనల్ని అందరినీ నవ్వించిన సుధాముడే మహారాణి చెప్పినట్లు గొప్పవాడు’ అన్నాడు రాజు. దాంతో కవులందరిలో గుసగుసలు మొదలయ్యాయి.
‘మహారాజా! ఎవరు గొప్ప అనడానికి ఒక విషయం చెబుతాను. మట్టి ప్రమిద నేనే గొప్ప నూనెను ఒడిసి పడుతున్నా అనుకుంటుంది. నూనె.. నేను లేకుండా వెలుగే లేదు అనుకుంటుంది. నేను లేకుండా ఒత్తి లేదు అనేది పత్తి భావన. ఇవన్నీ ఉన్నా.. నిప్పు రవ్వ లేకుండా ఒత్తి వెలగదు. దాన్ని వెలిగించే మనిషి కూడా కావాలి. కాబట్టి ఎవరి గొప్పతనం వారిదే.. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేక లక్షణం ఉంటుంది. అలాగే.. ఇక్కడ ఆస్థానంలో ఉన్న వారంతా గొప్పవారే! మీరు ప్రజలను, ఆస్థానంలోని వారిని ఎంతో ఆప్యాయంగా చూస్తున్నారు’ అన్నాడు సుధాముడు. ఆ మాటలు విని సభలో ఉన్నవారంతా.. కరతాళ ధ్వనులు చేశారు. ఇక సభ ముగియడంతో అందరూ ఇంటి ముఖం పట్టారు. అప్పుడు సుధాముడు.. ‘నేను చెప్పమన్నట్లే చెప్పావు. నేను మహారాజుకు చెప్పాలనుకున్న విషయం ఆయనకు తెలపడంలో నాకు సాయం చేశావు. దానికి నీకు కృతజ్ఞతలు. ఇదిగో తీసుకో’ అని ఒక బంగారు నాణేన్ని ఆ కాపలాదారుడుకి ఇచ్చాడు. ‘అయ్యా! మీకు ధన్యవాదాలు త్వరలో మా అమ్మాయి పెళ్లి జరగబోతోంది. ఈ నాణెం నాకు చాలా ఉపయోగపడుతుంది’ అన్నాడు కాపలాదారుడు. ‘చాలా సంతోషం’ అని బదులిచ్చాడు సుధాముడు.
- యు.విజయశేఖర రెడ్డి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని