కుందేలు ఉపాయం.. సింహానికి అపాయం!

తెల్లవారక ముందే.. రామచిలుక చెప్పినట్లు, అడవిలో జంతువులన్నీ సమావేశం అయ్యాయి. ‘ఉరుము లేని పిడుగులా కొత్తగా మన అడవిలోకి వచ్చిన సింహం విచ్చలవిడిగా వేటాడుతోంది.

Published : 04 Mar 2024 00:14 IST

తెల్లవారక ముందే.. రామచిలుక చెప్పినట్లు, అడవిలో జంతువులన్నీ సమావేశం అయ్యాయి. ‘ఉరుము లేని పిడుగులా కొత్తగా మన అడవిలోకి వచ్చిన సింహం విచ్చలవిడిగా వేటాడుతోంది. ఇలా అయితే మనమంతా త్వరలో దానికి ఆహారం కావాల్సిందే’ అంది గుర్రం. ‘ఈ ఆపద నుంచి మీ అందరినీ కాపాడే బాధ్యత నాది. కానీ దీనికి అడవి దున్న మామ సహాయం కావాలి’ అని పలికింది కుందేలు.  

‘అల్లుడూ..! ఏం చేయమంటావో చెప్పు’ అంది దున్నపోతు. దాని చెవి దగ్గర ఏదో గుసగుసగా చెప్పింది కుందేలు. ‘అలాగే ఇప్పుడే వెళుతున్నా... అక్కడే హాయిగా నిద్రపోతా’ అని అది వెళ్లిపోయింది. అప్పుడే నిద్ర లేచిన సింహం పెద్దగా గర్జించసాగింది. అదే అదనుగా అక్కడకు వెళ్లిన కుందేలు.. ‘ప్రభూ! తమరు దైవం పంపినట్లు మా అడవికి వచ్చారు. కనుక నేటి నుంచి మా అడవికి మీరే రాజు, తమరు అనుగ్రహిస్తే... నేను తమ మంత్రిగా ఉంటాను..., తమకు సమాచారం తెలియజేస్తాను’ అంది. 

‘నా పంటి కిందకు చాలని నువ్వు.. నాకు సమాచారం ఇస్తావా?’ అంది సింహం. ‘ప్రభూ ముల్లు చూడటానికి చిన్నగానే కనిపిస్తుంది. కానీ కంటికి తగిలినా, కాలిలో దిగినా అది ఎంతో బాధిస్తుంది. నేను అలాంటి దాన్నే. నా మాట నమ్మితే, ఈ రోజు తమరికి వారం రోజులకు సరిపడా ఆహారం లభించే మార్గం చూపుతాను, కాకపోతే ఓ చిన్న చిక్కు ఉంది’ అంది కుందేలు. 

‘సరే నేటి నుంచి నువ్వే నా మంత్రివి. నా ఆహార వ్యవహారాలన్నీ నువ్వే చూసుకోవాలి. ఏంటా ఆహారం, ఏంటా చిక్కు?’ అంది సింహం. ‘వనదేవత వరం పొందిన ఆ దున్నపోతును వేటాడాలి అంటే మామూలు విషయం కాదు. చాలా కష్టం. అది ఉన్న ప్రదేశంలో ఆకాశాన్ని చూస్తూ లేడిలా గెంతుతూ వెళ్లి, దాన్ని చంపాలి’ అంది కుందేలు.

‘అలాగే ఆ దున్నపోతును చూపించు దానిపై దాడి చేసే సమయంలో ఆకాశం చూస్తూ గెంతుతా’ అని కుందేలును అనుసరించింది సింహం. కొంతదూరం అడవిలో ప్రయాణం చేశాక, వాటికి ఓ చెట్టుకింద దున్నపోతు కనిపించింది. ‘ప్రభూ...! దున్నపోతు ముఖం అటుపక్కకు పెట్టుకు పడుకుంది, ఆకాశం వైపు చూస్తూ, తమరు గెంతుతూ వెళ్లి దున్నపోతుపై దాడి చేయండి’ అంది కుందేలు.

జింకలాగా ఎగిరి దూకుతూ, దున్నపోతు సమీపంలోని ఊబిలో దిగబడింది సింహం. దాని లోనికి కూరుకుపోతూ.. ‘ఓయ్‌ కుందేలూ! ఏమిటి నన్ను ఇలా ఊబిలో దూకించావు. నన్ను త్వరగా కాపాడే ప్రయత్నం చేయి’ అంది సింహం. ‘మూర్ఖుడా ఎవరు ఏది చెబితే అది నమ్మడమేనా? సొంత ఆలోచన చేయకపోతే ప్రమాదం కాదా? ఆకాశం వైపు చూస్తూ ఎగిరితే కింద ఏముందో ఎలా తెలుస్తుంది. మా వాళ్లందరినీ కాపాడుకోవడం కోసం నిన్ను రాజును చేసి, నేను మంత్రిని అయ్యాను!’ అంది కుందేలు.
ఊబిలోకి దిగబడిపోతున్న సింహాన్ని చూసిన జంతువులన్నీ కుందేలును అభినందించాయి. ఆఖరుకు ఈ అడవి వదిలిపోతానని ఆ సింహం హామీ ఇవ్వడంతో, జంతువులన్నీ కలిసి అతికష్టం మీద దాన్ని కాపాడాయి. సింహానికి వాటి మీద విపరీతమైన కోపం ఉన్నప్పటికీ.. వాటి ఐకమత్యాన్ని చూసి, ఆ అడవిని వదిలి వెళ్లిపోయింది. సమస్యను ఉపాయంతో పరిష్కరించిన కుందేలును జీవులన్నీ సన్మానించాయి.

 బెల్లంకొండ నాగేశ్వరరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు