చేసిన మంచి.. వృథా కాదు!

నాదర్‌గుల్‌లో కొమరయ్యది పేద కుటుంబం. ఉదయాన్నే చెరువుకు వెళ్లి మట్టి తెచ్చి కుండలు, కూజాలు, తయారు చేసేవాడు. ఇంకా దీపావళికి ప్రమిదలు, బొమ్మలు, మట్టి పాత్రలు, గ్లాసులు చేస్తుండేవాడు. కొమరయ్య భార్య కోమల వాటికి రంగులు వేస్తుండేది.

Updated : 05 Mar 2024 04:27 IST

నాదర్‌గుల్‌లో కొమరయ్యది పేద కుటుంబం. ఉదయాన్నే చెరువుకు వెళ్లి మట్టి తెచ్చి కుండలు, కూజాలు, తయారు చేసేవాడు. ఇంకా దీపావళికి ప్రమిదలు, బొమ్మలు, మట్టి పాత్రలు, గ్లాసులు చేస్తుండేవాడు. కొమరయ్య భార్య కోమల వాటికి రంగులు వేస్తుండేది. కొడుకు కోదండం చదువుకుని కులవృత్తిని కొనసాగిస్తూ కొలువు కోసం ప్రయత్నిస్తున్నాడు.

కోదండం కుండలు చక్రాల బండి మీద వేసుకుని వీధుల వెంట తిరుగుతూ అమ్మేవాడు. కొందరు నేరుగా కొమరయ్య ఇంటికే వచ్చి ఖరీదు చేసి పట్టుకెళ్లేవారు. రైతులు కుండలు తీసుకుని ధాన్యమో, నగదో ఇచ్చేవారు. కష్టపడి చదువుకున్న కొడుకుని మంచి కొలువులో చూసుకోవాలని కొమరయ్య, కోమల కలలు కనేవారు.

నాదర్‌గుల్‌ జమీందారు నారాయణదత్తు కింద పది గ్రామాలుండేవి. వేసవి వస్తుందంటే కొమరయ్యకు కబురు పెట్టి గ్రామానికో నాలుగు చొప్పున పెద్ద పెద్ద కుండలు చేయించేవాడు. వాటిని గ్రామ కూడళ్లలో, దేవాలయాలు, సంతల దగ్గర, ప్రయాణికులతో రద్దీగా ఉండే ప్రాంతాల్లో పందిరి కింద పెట్టించేవాడు. వాటిని స్వచ్ఛమైన నీటితో నింపించి, తన కొడుకు నారదదత్తు పేరుతో చలివేంద్రాలుగా ఏర్పాటు చేసేవాడు.

ఆ సంవత్సరం కూడా వేసవి రాబోతుందనగా జమీందారు నౌకరు వచ్చాడు. వేగంగా తిరుగుతున్న చక్రంపై మట్టిని ఒత్తిపట్టి గుండ్రటి కుండలు చేస్తున్న కొమరయ్య లేచి నిలుచున్నాడు. ‘కొమరయ్యా! జమీందారు గారు వచ్చే ఉగాదికి ఎప్పటిలా కొత్త కుండలు సిద్ధం చేయమన్నారు!’ అంటూ కొంత నగదును, కుండలకు రంగులు వేస్తున్న కోమలకు అందించాడు.

‘అయ్యా! జమీందారు ప్రతియేడు వేసవిలో చలివేంద్రాలు ఆయన కొడుకు పేరుతో ఎందుకు పెట్టిస్తున్నారు?’ అని అడిగింది కోమల. ‘మండుటెండలో తిరుగుతున్న బాటసారుల దాహార్తిని తీర్చటం వల్ల పుణ్యం కలిగి, మనసులో కోరుకున్న కోరికలు తీరుతాయని జమీందారు నమ్మకం!’ అని చెప్పి వెళ్లిపోయాడా నౌకరు.

అప్పుడే ఒక పక్షి దాహంతో ఎగురుకుంటూ వచ్చి కోమల పక్కన ఉన్న పాత్రలోని నీటిని భయం భయంగా తాగి దాహం తీర్చుకుంది. తర్వాత కాసేపటికి ఓ ఉడుత కూడా ఇలానే నీళ్లు తాగి వెళ్లింది. ‘అయ్యా! మనం పక్షులు, ఉడుతల్లాంటి చిరు జీవుల కోసం వేసవిలో మట్టి పాత్రల్లో నీటిని పెట్టి వాటి దాహం తీర్చుదామా!?’ అంది బొమ్మలకు రంగులేస్తూ కోమల. ‘అలాగే!’ అన్నాడు ఆరిన కుండల్ని కాలుస్తూ కొమరయ్య.

ఉగాదికి నారాయణదత్తు ఎప్పటిలా కొడుకు నారదదత్తు పేరు మీద చలివేంద్రాలు ప్రారంభించాడు. అదే రోజు కొమరయ్య కూడా కోదండం పేరు మీద మట్టి పాత్రల్లో పక్షులు, జంతువులకు నీటిని ఏర్పాటు చేశాడు. చలివేంద్రంలో చల్లని నీటిని తాగి దాహం తీర్చుకున్న బాటసారుల ఆశీస్సులు నారదదత్తుకు అందాయి!

ఎండలకు నీరులేక దాహంతో అల్లాడుతున్న పిట్టలు, ఉడుతల్లాంటి చిరు జీవులు కొమరయ్య ఏర్పాటు చేసిన మట్టి పాత్రల్లోని చల్లని నీటిని తాగాయి. ఆ సంవత్సరమే నారాయణదత్తు కొడుకు నారదదత్తుకు రాజు గారి కోట నుంచి, కొమరయ్య కొడుకు కోదండానికి జమీందారు దివాణం నుంచి కొలువుల కోసం కబుర్లు అందాయి. ‘చేసిన మంచి.. వృథా కాదు’ అని అటు జమీందారు, ఇటు కొమరయ్య అనుకున్నారు.

పైడిమర్రి రామకృష్ణ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని