పంచితే... స్నేహం పెరుగుతుంది!

ధాత్రి ఒకటో తరగతి చదువుతోంది. తెలివిగల అమ్మాయి.. కానీ పెంకిపిల్ల. తన వస్తువులను ఎవరినీ ముట్టుకోనివ్వదు. తను తినేవి ఎవరికీ ఇవ్వదు. ఎవరైనా ఇస్తే మాత్రం తీసుకుంటుంది. ‘

Updated : 07 Mar 2024 04:45 IST

ధాత్రి ఒకటో తరగతి చదువుతోంది. తెలివిగల అమ్మాయి.. కానీ పెంకిపిల్ల. తన వస్తువులను ఎవరినీ ముట్టుకోనివ్వదు. తను తినేవి ఎవరికీ ఇవ్వదు. ఎవరైనా ఇస్తే మాత్రం తీసుకుంటుంది. ‘ధాత్రీ! నువ్వు చేసేది తప్పు. అందరితో కలిసిమెలిసి ఉండాలి. నీ దగ్గర ఉన్నవి అందరితో పంచుకుంటే ప్రేమ పెరుగుతుంది. నీకు కావాల్సినప్పుడు వారు కూడా సాయం చేస్తారు’ అని వాళ్లమ్మ సుధ ఎప్పుడూ చెబుతుండేది. ‘అబ్బా.. పోమ్మా! నేను నా వస్తువులు ఎవరికీ ఇవ్వను’ అని పెంకిగా జవాబు ఇచ్చేది. తన కూతురి మొండితనానికి సుధ ఏమీ చేయలేక ఊరుకునేది.

ఒక ఆదివారం వాళ్లింటికి సుధ స్నేహితురాలు రమ, ఆమె పిల్లలు చైత్ర, విశాల్‌ వచ్చారు. పెద్దవాళ్లు గదిలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే పిల్లలు ముగ్గురూ హాల్లో ఆడుకోసాగారు. ధాత్రి మొదట కలవకపోయినా చైత్ర ఊరుకోకుండా తమతో ఆడించింది. కాసేపటి తర్వాత ఆ అమ్మాయి లోపల నుంచి ఒక రిమోట్‌ కంట్రోల్‌ కారు తీసుకొచ్చింది. అది చూడటానికి చాలా బాగుంది.

 ‘ఒకసారి నేను దానితో ఆడుకోవచ్చా?’ అని అడిగాడు విశాల్‌. ‘నా బొమ్మ నేను ఎవరికీ ఇవ్వను’ అని నిర్మొహమాటంగా అంది ధాత్రి. ఆ మాటతో విశాల్‌ ముఖం మాడిపోయింది. ‘విశాల్‌! అలా అడగకూడదు. అది తన బొమ్మ, ఇష్టమైతే ఇస్తుంది, లేకపోతే లేదు’ అంది చైత్ర. ‘నేనేమైనా అచ్చంగా ఇచ్చేయమన్నానా? ఒకసారి ఆడుకుని ఇస్తానన్నాను’ అని ఉక్రోషంగా బదులిచ్చాడా అబ్బాయి. ‘నేను ఇవ్వను గాక ఇవ్వను’ అని బొమ్మ గట్టిగా పట్టుకుని పెద్దగా అంది ధాత్రి.

 వీళ్ల గొడవ సుధ, రమకు వినిపించింది. ‘ఏమైంది?’ అంటూ వాళ్ల దగ్గరకు వచ్చారు. చైత్ర జరిగిందంతా చెప్పి బుంగమూతి పెట్టుకుని కూర్చున్న విశాల్‌ను చూపించింది. రమకు విషయం అర్థమైంది. ‘విశాల్‌! నువ్వు అలా అడగకూడదు, తను ఇవ్వకపోతే అలగడం కూడా తప్పే! ధాత్రికి సారీ చెప్పు’ అంది రమ. ‘సరే అమ్మా! ఇంకెప్పుడూ అలగను’ అంటూ దగ్గరకు వచ్చి.. ‘సారీ ధాత్రీ’ అన్నాడు విశాల్‌. ఆ చిన్నారి అయోమయంగా చూసింది. ‘ధాత్రి కోసం మనం తెచ్చిన బహుమతులు ఇంకా ఇవ్వలేదు. వెళ్లి మన బ్యాగ్‌ తీసుకురా విశాల్‌!’ అంది రమ. దాంతో తన ముఖంలో అలక ఎగిరిపోయింది. పరుగెత్తుకుంటూ వెళ్లి బ్యాగ్‌ తీసుకువచ్చాడు. అందులో నుంచి రంగు పెన్సిళ్ల డబ్బా, డ్రాయింగ్‌ పుస్తకం తీసి ధాత్రికి ఇచ్చాడు. చైత్ర బ్యాగ్‌లో నుంచి రంగు తిలకాల డబ్బా,  జడలకు పెట్టుకునే రిబ్బన్లు ఇచ్చింది.
అవి చూడగానే ధాత్రి కళ్లు ఆనందంతో మెరిసిపోయాయి. కానీ ఆమెకు తెలియకుండానే లోలోపల ఏదో తప్పు చేసిన భావన కలిగింది. విశాల్‌, చైత్రను పరిశీలించి చూసింది. ఎంత మాత్రం తనపై కోపం కనిపించలేదు. చక్కగా నవ్వుతున్నారు. ‘ధాత్రీ! నీ బొమ్మ ఇవ్వకపోయినా వాళ్లు నీకు బహుమతులిచ్చారు. నువ్వు థాంక్స్‌ అయినా చెప్పు’ అంది సుధ. ‘థాంక్స్‌’ అని చిన్నగా అంది ధాత్రి. ‘మనం ముగ్గురం కలిసి బొమ్మలు వేసుకుందాం. మా పెన్సిల్లు, డ్రాయింగ్‌ పుస్తకాలు కూడా తెచ్చుకున్నాం’ అంది చైత్ర. ‘సరే అలాగే’ అంది ధాత్రి.
‘నాకు కారు బొమ్మ వేయడం బాగా వచ్చు’ అన్నాడు విశాల్‌. తర్వాత ముగ్గురూ కలిసి బొమ్మలు వేసుకున్నారు. సుధ వచ్చి బిస్కెట్లు ఉన్న ప్లేట్లు ఇచ్చి.. ‘వీటిని మీ ముగ్గురూ తీసుకోండి’ అంది. విశాల్‌, చైత్ర ప్లేట్లలోవి కొన్ని తీసుకుని తన ప్లేటులో పెట్టుకుని, మిగిలినవి వాళ్లిద్దరికీ ఇచ్చింది ధాత్రి. అది చూసి కూడా విశాల్‌, చైత్ర తమకు ఇచ్చినవే తీసుకుని థాంక్స్‌ చెప్పారు. ఇదంతా రమ, సుధ ఇద్దరూ చూశారు.
‘ధాత్రీ! ఎన్ని సార్లు చెప్పినా నువ్వు అలాగే చేస్తున్నావు. నీకు ఇచ్చినవే కాకుండా వాళ్లకు ఇచ్చినవి కూడా తీసుకున్నావు’ అంది సుధ. ‘పోనీలే వదిలేయ్‌ సుధా!’ అంది రమ. కాసేపటి తర్వాత ధాత్రి స్నేహితులిద్దరూ ఆమెతో ఆడుకోవడానికి ఇంటికి వచ్చారు. విశాల్‌, చైత్ర చాలా త్వరగా వాళ్లతో కలిసిపోయారు. డ్రాయింగ్‌ వేసుకోవడానికి వారికి తమ వస్తువులు ఇచ్చి వేయమని ప్రోత్సహించారు.
ధాత్రికి అది వింతగా అనిపించింది. ‘విశాల్‌! అదేంటి నా ఫ్రెండ్స్‌.. నీకు తెలియదు కదా? నీ వస్తువులు అలా ఎలా ఇచ్చేశావు?’ అని ఆశ్చర్యంగా అడిగింది ధాత్రి. ‘మా అమ్మ అందరితో అన్నీ పంచుకోమని చెబుతుంది. అలా చేయడం వల్ల వాళ్లతో మంచి స్నేహం ఏర్పడుతుంది. మనకు అవసరమైనప్పుడు వాళ్లు కూడా సహాయం చేస్తారు. అమ్మ చెప్పింది ఏదైనా సరే మేము తప్పకుండా వింటాం’ అన్నాడు విశాల్‌.
ధాత్రి ఆ మాటలు విన్నాక కాస్త పశ్చాత్తాపానికి గురైంది. తన ప్రవర్తనలో లోపాన్ని గ్రహించింది. ఇక ముందు తను కూడా అందరితో కలిసి పోవాలని, తన దగ్గర ఉన్న వాటిని మరొకరితో పంచుకోవాలని అర్థం చేసుకుంది. అమ్మ చెప్పిన మాటల్లో నిజాన్ని గ్రహించింది. ‘అమ్మా! ఇక ముందు ఎప్పుడు నువ్వు ఏది చెప్పినా వింటాను. నా వస్తువులు అందరితో పంచుకుంటాను’ అంటూ ధాత్రి.. తన రిమోట్‌ కంట్రోల్‌ కారు విశాల్‌ చేతికి ఇచ్చింది. తన కూతురిలో వచ్చిన మార్పును గుర్తించిన సుధ హాయిగా ఊపిరి తీసుకుంది.
- కె.వి.సుమలత


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని