ఇంతకీ కుందేలు ఎందుకు రాలేదు..?

రామాపురం ఊరి చివర ఒక పెద్ద అడవి ఉండేది. అందులో క్రూరమైన జంతువులేవీ లేకపోవడంతో.. చిన్నచిన్న జీవులన్నీ ఆనందంగా ఉండేవి. ఆ అడవి పక్కనే చక్కని మంచినీటి కొలను, దాని ఒడ్డునే మర్రి చెట్టు కూడా ఉండేది.

Updated : 09 Mar 2024 04:30 IST

రామాపురం ఊరి చివర ఒక పెద్ద అడవి ఉండేది. అందులో క్రూరమైన జంతువులేవీ లేకపోవడంతో.. చిన్నచిన్న జీవులన్నీ ఆనందంగా ఉండేవి. ఆ అడవి పక్కనే చక్కని మంచినీటి కొలను, దాని ఒడ్డునే మర్రి చెట్టు కూడా ఉండేది. ఆ ప్రాంతమంతా చాలా విశాలవంతంగా ఉండటంతో.. అక్కడికి ఆడుకోవడానికి ప్రతిరోజు కుందేలు పిల్ల, జింక పిల్ల, కోతి పిల్ల వచ్చేవి. ఎంచక్కా ఆడుకొని కాసేపు కబుర్లు చెప్పుకొని వెళ్లిపోయేవి. అదే చెట్టు మీద ఒక చిన్న ఉడుత నివసించేది. అది కూడా వీటితో కలిసి ఆడుకునేది. అలా అవి స్నేహంగా ఉంటూ.. ఆనందంగా గడిపేవి.

ఎప్పటిలాగే అన్ని జీవులు ఆడుకోవడానికి వచ్చాయి. కానీ.. కుందేలు పిల్ల మాత్రం రాలేదు. దాంతో అన్నీ కంగారుపడ్డాయి. అప్పుడు ఉడుత మిగతా వాటితో.. ‘ఈ రోజు కుందేలుకు ఏమై ఉంటుంది. ఎందుకు ఆడుకోవడానికి రాలేకపోయింది. అసలు ఏం జరిగిందో ఏమో?’ అని కాస్త దిగులుగా అంది. ‘ఎప్పుడూ మన కంటే ముందుగానే.. ఇక్కడికి చేరుకునేది. ఈ రోజు రాలేదంటే కచ్చితంగా ఏదో ముఖ్యమైన పనే ఉండి ఉంటుంది. కాసేపు వేచిచూద్దాం’ అని నిదానంగా అంది జింక పిల్ల. అన్నీ జీవులు కుందేలు ఎప్పుడెప్పుడు వస్తుందా అని దారి వైపే చూస్తూ.. ఉన్నాయి. కానీ ఎంత సమయం గడిచినా అది మాత్రం రాలేదు.

ఇంతలో ఆ దారిగుండా తోడేలు వస్తుంటే దాన్ని పిలిచి.. ‘మా కుందేలు పిల్ల నీకు దారిలో ఎక్కడైనా కనిపించిందా?’ అని అడిగింది కోతి. అప్పుడది.. ‘నాకేం పని లేదనుకుంటున్నారా! ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు అని చూడటానికి’ అని చిరాగ్గా సమాధానం చెప్పి వెళ్లిపోయింది. ఆ వెనకాలే గున్న ఏనుగు వస్తుంటే.. దాన్ని కూడా అదే ప్రశ్న అడిగిందది. నాకు ఎవరూ కనిపించలేదు.. అయినా ఎవరి సంగతి నేను పట్టించుకోను. నా పని నాది! నన్నెందుకు విసిగిస్తున్నారు?’ అని కసురుతూ కొలనులో నీళ్లు తాగడానికి వెళ్లింది గున్న ఏనుగు. ఇలా ఆ దారిన వస్తున్న జీవులన్నింటినీ అడుగుతూనే ఉన్నాయవి. చాలాసేపు దాని కోసం ఎదురుచూసినా.. అది రాకపోవడంతో కోతి, జింకకు ఏం చేయాలో అర్థంకాలేదు. అప్పుడు ఇక జింక.. ‘మనం వెంటనే బయలుదేరి మన కుందేలు ఇంటికి వెళ్దాం. అసలు ఏం జరిగిందో కొంచమైనా తెలుస్తుంది’ అంది. ‘అవును నిజమే!’ అంటూ బయలుదేరాయవి. అక్కడికి వెళ్లి చూస్తే.. కుందేలు తల్లి తీవ్రమైన అనారోగ్యంతో బాధ పడుతుంది. పిల్ల కుందేలేమో.. ఏడ్చుకుంటూ పక్కనే కూర్చుంది. గబగబా దగ్గరకు వెళ్లి.. ‘మిత్రమా! అమ్మకు ఏమైంది?’ అని ప్రశ్నించాయవి. ‘నిన్న రాత్రి నా కోసం ఆహారం తీసుకొస్తానని వెళ్లిన అమ్మ.. వర్షంలో బాగా తడిసిపోయింది. పరిగెత్తుకుంటూ వస్తుంటే.. పెద్ద బండరాయి మీద నుంచి కిందపడిపోయింది. దాంతో బాగా గాయాలయ్యాయి. కాస్త జర్వం కూడా వచ్చింది. ఏమీ తినకుండా అలాగే పడుకొని ఉంది. ఇప్పుడ ఏం చేయాలో నాకు అస్సలు తోచడంలేదు’ అని ఏడుస్తూ జవాబిచ్చింది పిల్ల కుందేలు.

‘అయ్యో! అవునా.. మరి వైద్యం కోసం మన ఎలుగుబంటి దగ్గరకు తీసుకెళ్లావా?’ అని అడిగింది జింక పిల్ల. ‘బయలుదేరి కాస్త దూరం వరకు వెళ్లాము. కానీ నీరసంగా ఉండటంతో.. అమ్మ నడవలేకపోయింది. మా ఇంటి చుట్టుపక్కల ఉన్న జంతువులను కాస్త తోడుగా రమ్మని అడిగితే.. మేము ఆహారం వెతుక్కోవడానికి వెళ్లాలి అంటూ వెళ్లిపోయాయి’ అని చెప్పిందది. ఇంతలోనే అక్కడికి ఉడుత పిల్ల కూడా చేరింది. ఆ మాటలు విని.. ‘ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. ఇప్పుడు మనం వచ్చాం కదా! వెంటనే అమ్మని వైద్యుని దగ్గరికి తీసుకెళ్దాం పదండి’ అంటూ అందరినీ గాబరా చేసిందది.

కోతి, కుందేలు తల్లిని జాగ్రత్తగా పట్టుకొంది. ఎలుగుబంటి దగ్గరకు వెళ్లగానే.. అది పరిశీలించి ఓ పసరు మందు నోట్లో వేసింది. ఆ తర్వాత కాసేపటికి తల్లి కుందేలు తేరుకుంది. దాని దగ్గర ఉన్న క్యారెట్‌, దుంపలు ఇచ్చి తినమని చెప్పి.. ‘సరైన సమయంలో కుందేలును వైద్యం కోసం తీసుకువచ్చారు. లేకపోతే చాలా ప్రమాదం జరిగి ఉండేది’ అంది. కొన్ని మొక్కలు ఇచ్చి.. మూడు పూటలా వాటిని పసరు చేసుకొని తాగమని చెప్పింది ఎలుగు.

ఇక అన్నీ కలిసి కుందేలు తల్లిని జాగ్రత్తగా ఇంటికి చేర్చాయి. పిలవకుండానే వచ్చి.. దాని ప్రాణాలు రక్షించినందుకు బిడ్డ స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపింది తల్లి కుందేలు. ఆ రోజు నుంచి దాని ఆరోగ్యం కుదుటపడేంత వరకు కోతి, జింక.. ప్రతిరోజు తల్లి బిడ్డకు ఆహారం తెచ్చివ్వసాగాయి. ఉడుత.. కుందేలుకు తోడుగా దాని దగ్గరే ఉంటూ.. సాయం చేసింది.
ఒక రెండు వారాల తర్వాత.. ఆ తల్లి కుందేలు అనారోగ్యం నుంచి కోలుకుంది. మళ్లీ ఎప్పటిలా అడవంతా తిరగడం ప్రారంభించింది. ఇన్ని రోజులు దానికి సాయం చేసిన పిల్ల కుందేలు మిత్రులను చూసి.. ఆ చుట్టుపక్కల నివసిస్తున్న జంతువులన్నీ కూడా.. మనం పక్కనే ఉండి ఎలాంటి సాయం చేయలేకపోయామే అనుకున్నాయి. తర్వాత కొన్ని రోజులకు ఆ తల్లి కుందేలు.. జింక, కోతి, ఉడుత పిల్లలను ఇంటికి పిలిచి వాటికి ఇష్టమైన ఆహారాన్ని చేసి పెట్టింది.

‘ప్రతిరోజు నా బిడ్డ మీ దగ్గరికి ఆడుకోవడానికి వస్తుంటే.. అంత దూరం వెళ్లడం ఎందుకని కోపగించేదాన్ని. కానీ మీరు లేకపోయి ఉంటే నా ఆరోగ్యం కుదుటపడేది కాదు. మా కోసం చాలా శ్రమించారు. ఆనందంలోనే కాదు.. ఆపదలో కూడా స్నేహితులు ఉంటారని నిరూపించారు. అందరికీ మీలాంటి మిత్రులే ఉండాలని కోరుకుంటున్నాను’ అని మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంది.

మొర్రి గోపి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని