చారి చెప్పిన కత్తి పాఠం..!

విజయపురి రాజ్యం చివర కొంగర గ్రామం ఉండేది. అక్కడ కమలాచారి అనే ఓ వ్యక్తి కొలిమి పెట్టాడు. ఇనుమును కాలుస్తూ రకరకాల పనిముట్లు, వస్తువులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తను బాగా చదువుకున్నాడు కూడా.

Updated : 10 Mar 2024 07:08 IST

విజయపురి రాజ్యం చివర కొంగర గ్రామం ఉండేది. అక్కడ కమలాచారి అనే ఓ వ్యక్తి కొలిమి పెట్టాడు. ఇనుమును కాలుస్తూ రకరకాల పనిముట్లు, వస్తువులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తను బాగా చదువుకున్నాడు కూడా. భార్య కోమల కూడా చారికి పనిలో సహకరించేది. ఆ రాజ్యాన్ని పాలించే వినయవర్మకు వేట అంటే ప్రాణం. పక్షం రోజులకు ఒకసారి కొంగర గ్రామం మీదుగానే వేటకు వెళ్లేవాడు. తిరిగి వచ్చేటప్పుడు పులి తలనో, సింహం తలనో తెచ్చేవాడు.

త్వరలో వచ్చేది వర్షాకాలం కావటంతో.. వ్యవసాయ పనిముట్లు నాగలి, గునపం, పార, కొడవలి వంటివి చేయడంలో తీరిక లేకుండా ఉన్నాడు కమలాచారి. ఇంతలోనే అక్కడికి ఒక గుర్రం వేగంగా వచ్చి ఆగింది. ఒక్కసారిగా పైకి చూడగానే ఏనుగు తలతో దానిపైన కూర్చున్న మహారాజు వినయవర్మ కనిపించాడు చారీకి. ఆశ్చర్యపోయి చూస్తున్న తనతో.. ‘వేటాడుతుంటే కత్తి విరిగిపోయింది. ఇలాంటిదే మరొకటి తయారుచేసి పెట్టు. రేపు ఉదయాన్నే మా వాళ్లు వచ్చి తీసుకుంటారు’ అంటూ మహారాజు ఒక మూటలో ధనం ఇచ్చాడు. చెప్పినట్లుగానే.. మరుసటి రోజు రాజు సేవకుడు కమలాచారి వద్దకు వచ్చి కత్తి గురించి అడిగాడు. ‘ఇంకా కత్తి తయారుచేయడం పూర్తవలేదు. రేపు రండి.. తప్పకుండా ఇస్తాను’ అని చెప్పి పంపించాడతను.

ఆ తర్వాత రోజు ఉదయాన్నే సేవకుడు మళ్లీ వచ్చాడు. ‘పిడి బింగించడానికి వడ్రంగికి ఇచ్చాను. అతను రేపు ఇస్తానన్నాడు. మీరు కూడా రేపే రండి’ అని చెప్పాడు చారి. అలాగేనంటూ వెళ్లిపోయిన ఆ సేవకుడు.. మూడో రోజు మళ్లీ వచ్చాడు. అతన్ని చూసిన చారి.. ‘అయ్యో! అప్పుడే వచ్చారా.. ఇంకా కత్తికి పదును పెట్టలేదు. ఏమి అనుకోకుండా.. రేపు వచ్చి తీసుకెళ్లండి’ అన్నాడు. ఈ విషయం తెలుసుకున్న వినయవర్మకు ఎక్కడాలేని కోపం వచ్చింది. అతను ఎందుకలా చేస్తున్నాడో తెలుసుకోవడానికి మారు వేషంలో కొంగర గ్రామానికి చేరుకున్నాడు మహారాజు. చారి ఇంటి ముందుకు వెళ్లగానే ఆయనకి.. కొలిమి ముందు లోహపు పనిముట్లు చేస్తున్న కోమల కనిపించింది. ఒక మహిళ కొలిమి ముందు కూర్చొని పని చేయడం చూసి.. ఆశ్చర్యపోయాడు. వెంటనే ఆమె దగ్గరకు వెళ్లి.. ‘మీరెందుకు ఈ పని చేస్తున్నారు’ అని ప్రశ్నించాడు మహారాజు. ‘మా పూర్వీకులు ఇదే పని చేసేవారు. మాకు కూడా ఇది తప్ప వేరే పని రాదు. ఎక్కువ పని ఉన్నప్పుడు నా భర్తకు సహకరిస్తాను. మీ పనేంటో  చెప్పండి.. నేను చేసి పెడతాను’ అని బదులిచ్చింది కోమల.

అక్కడే పనిముట్లు చేయించుకోవడానికి వచ్చిన రైతుల మాటలతో.. నగరంలో వ్యవసాయ పనిముట్లు ఎక్కువ ధరకు అమ్ముతున్నారని.. ఒక్కోసారి అక్కడ దొరక్కపోవడంతో.. వాళ్లు చారి దగ్గరే చేయించుకుంటున్నట్లు తెలుసుకున్నాడు. కాసేపటికి.. ‘మరి మీరు వ్యవసాయ పనిముట్ల కొరతతో ఇబ్బంది పడుతున్నట్లు మీ రాజుకు తెలియజేశారా?’ అని అడిగాడు మారువేషంలో ఉన్న మహారాజు. ‘ఆయన తన వినోదం కోసం అడవికి వెళ్లి జంతువులను వేటాడుతూ.. రైతుల కష్టాలు పట్టించుకోవడమే మానేశాడు. మేము వెళ్లి చెబితే మాత్రం వింటారా?’ అన్నాడు ఒక రైతు. ‘తన వేట కత్తిని చేయించుకోవటంలో ఉన్న ఆసక్తి.. రైతులు పనిముట్ల కోసం పడుతున్న ఇబ్బంది మీద చూపిస్తే ఇప్పుడు మాకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు’ అన్నాడు మరో రైతు. అప్పుడే ఆవు, దూడలకు గడ్డి వేసి వచ్చిన కమలాచారి.. ‘మన మహారాజు.. కత్తి తయారు చేయమని చెప్పారు. నాలుగు రోజుల క్రితమే సిద్ధం చేశాను. కానీ జంతువులను చంపటానికి నా చేత్తో కత్తి ఇవ్వటం ఇష్టం లేక ఏదో ఒక సాకు చెప్పి ఇవ్వకుండా.. సేవకుడిని తిప్పి పంపుతున్నాను’ అన్నాడు.

అసలు విషయం గ్రహించిన రాజు కమలాచారిని మనసులోనే క్షమించాడు. ‘మనకు ఆహారం అందించే రైతు దేశానికి వెన్నెముక. అలాంటి అన్నదాతలకు పనిముట్ల కొరత ఉండకూడదు. నేను నేటి నుంచే.. వేట మానేస్తాను’ అని నిర్ణయం తీసుకున్నాడు వినయవర్మ. అప్పటి నుంచి మళ్లీ ఎప్పుడూ.. సేవకుడిని కత్తి కోసం పంపించలేదు. వ్యవసాయ పనిముట్లు చేయడానికి కావాల్సిన నగదును భటుల ద్వారా చారికి అందించాడు మహారాజు.

పైడిమర్రి రామకృష్ణ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని