కలిసి తింటే కలదు సుఖం!

‘హాయ్‌ తాతయ్యా.. ఎప్పుడు వచ్చారు’ అంటూ ఇంటిలోకి అడుగు పెట్టాడు శ్రీయాన్‌. ‘ఇప్పుడే మనవడా..’ అన్నారు తాతయ్య సుందరరామయ్య.

Updated : 11 Mar 2024 05:17 IST

హాయ్‌ తాతయ్యా.. ఎప్పుడు వచ్చారు’ అంటూ ఇంటిలోకి అడుగు పెట్టాడు శ్రీయాన్‌. ‘ఇప్పుడే మనవడా..’ అన్నారు తాతయ్య సుందరరామయ్య. ‘శ్రీయాన్‌, తాతయ్య ఇప్పుడే వచ్చారు. నాకు ముఖ్యమైన పని ఉంది. అన్నం వండేశాను. నువ్వు కూరలు తెచ్చుకో. నేను రావడం ఆలస్యం అయితే కాల్‌ చేస్తా. నువ్వు, తాతయ్య భోజనం చేసేయండి’ అంది లావణ్య. ‘మరి నాన్న?’ అన్నాడు శ్రీయాన్‌. ‘నాన్నకు వేరే పని ఉందట. వస్తే .. వస్తా అన్నారు. అది తరువాత చూద్దాం... వెళ్లొస్తా మామయ్యగారూ. మీరు భోజనం చేసి ఉండండి’ అంటూ బయటకు పరుగు పెట్టింది లావణ్య.

‘ఎప్పుడూ ఇంతేనా శ్రీయాన్‌’ అన్నారు తాతయ్య. ‘ఈ మధ్యన కుక్కర్‌లో రైస్‌ పెడుతున్నారు. లేకుంటే మొత్తం బయట నుంచే’ అన్నాడు శ్రీయాన్‌. కాసేపు చదువుకున్న తరువాత ఆన్‌లైన్‌లో కర్రీస్‌ ఆర్డర్‌ చేశాడు శ్రీయాన్‌. ‘మంచిది ఈ రోజు సెలవు కనుక నువ్వన్నా దొరికావు. లేకుంటే నేనే రైస్‌ పెట్టుకుని, కర్రీస్‌ ఆర్డర్‌ చేసుకోవాల్సి వచ్చేది’ అన్నారు తాతయ్య నవ్వుతూ. తాను కూడా నవ్వాడు శ్రీయాన్‌.

మధ్యాహ్నం మూడింటికి వచ్చారు శ్రీయాన్‌ తల్లిదండ్రులు. అప్పటికే శ్రీయాన్‌, సుందరరామయ్య భోజనాలు చేసేశారు. వీళ్లూ తిన్న తరువాత.. ‘ఏం పనిమీద వచ్చారు నాన్నగారూ’ అన్నాడు కృష్ణ, తన తండ్రి సుందరరామయ్యతో. ‘మన ఊరి అమ్మవారి జాతర ఉంది కృష్ణా. నిన్ను, అమ్మాయిని, నా బుజ్జి మనవడిని పిలుద్దామని వచ్చాను. ఈ ఊరిలో కూడా కొంత పని ఉందిలే. నేను అది చూసుకుని మన ఊరు వెళతాను. మీరు తప్పకుండా రావాలి’ అన్నారు సుందరరామయ్య.

‘అలాగే నాన్నగారు. ఆ రోజుకు వస్తాం’ అన్నాడు కృష్ణ. కానీ ముందు రోజు సెలవు రావడంతో ఒక దినం ముందే బయలు దేరారు కృష్ణ, లావణ్య. ఇక శ్రీయాన్‌ సంగతి సరే సరి! తాతయ్య, నానమ్మ కోసం కొత్త దుస్తులు, మిఠాయిలు ముందుగానే కొనిపించాడు. కారు ఆగడంతో వచ్చి కొడుకు, కోడలును ఆహ్వానించారు సుందరరామయ్య. అది కోనసీమలోని సిరిపల్లె. జాతర సందడి ఊరు మొత్తం కనిపిస్తోంది.

‘ప్రయాణం బాగా జరిగిందా!’ అని అడిగింది కృష్ణ తల్లి.. లావణ్యను. ‘బాగానే జరిగింది అత్తయ్యా!’ అంది లావణ్య. ‘శ్రీయాన్‌ తొందరగా స్నానం చేసి రా. నీ కోసం నానమ్మ గారెలు చేసింది. రోజూ ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ పెట్టుకుని తినడం కాదు. ఈ గారెలు తిని చెప్పు’ అన్నారు సుందరరామయ్య.
‘ఆర్డర్‌ పెట్టడమే తేలిక కదా తాతయ్య’ అన్నాడు శ్రీయాన్‌. ‘అసలు కుటుంబం అంటేనే ఓ ఇల్లు, అమ్మ, నాన్న, పిల్లలు అంతా కలిసి వండుకోవడం, ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం, ప్రేమ, అభిమానం. కలిసుంటేనే ఆనందం. అంతే కానీ కూరలు, అన్నం ఆర్డర్‌ పెట్టుకోవడం. ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా సెల్‌ చూస్తూ గడిపేయడం కాదు. ఇలాగే సాగితే కొన్నాళ్లకు వంటిల్లు అనేది కనుమరుగవుతుంది. పైగా బయటి నుంచి తెచ్చుకున్న ఆహారం ఆరోగ్యానికి మంచిది కాదు తెలుసా!’ అన్నారు తాతయ్య.

కాసేపటి తర్వాత, నానమ్మ తెచ్చిన గారెలు తింటూ.. ‘గారెలు చాలా రుచిగా ఉన్నాయి తాతయ్యా!’ అన్నాడు శ్రీయాన్‌. ‘బయటి ఆహారం తినకూడదు. ఎందుకంటే వాళ్లు నాసిరకం నూనెలు, పదార్థాలు వాడడం వల్ల అనేక జబ్బులకు గురవుతారు. ఇప్పుడు ప్రపంచాన్ని వేధిస్తోన్న ఊబకాయానికి ఇదే ప్రధాన కారణం. నీకు ఒక కథ చెబుతాను. ఇదే ఊళ్లో ఓ కుటుంబం ఉంది. తండ్రి వ్యవసాయం చేస్తే, తల్లి ఇంట్లో పనులు చూసేది. ఆయన రోజూ ఉదయం పొలానికి వెళ్లి, కష్టపడి పని చేసేవాడు. ఆమె, పిల్లవాడికి అన్నం పెట్టి బడికి పంపి, తరువాత భర్తకు అన్నం తీసుకుని పొలానికి వెళ్లేది. అక్కడే ఇద్దరు చెట్టు నీడన భోజనం చేసేవారు. తరువాత కొంతసేపు విశ్రాంతి తీసుకుని. ఇద్దరూ పొలం పని చేసేవారు. వాళ్లు ఈ రోజుకూ ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు తెలుసా’ అన్నారు సుందరరామయ్య.

‘శ్రీయాన్‌.. ఆ కథ ఎవరిదో తెలుసా’ అన్నాడు కృష్ణ. తల అడ్డంగా ఊపి.. ‘తెలియదు నాన్నా!’ అన్నాడు శ్రీయాన్‌. ‘మీ తాతయ్య, నానమ్మదే. అప్పుడు బడికి వెళ్లిన పిల్లాడిని నేనే’ అన్నాడు కృష్ణ నవ్వుతూ. ‘మీరు చెప్పినట్టు ఇంట్లో వంట కుదరడం లేదు నాన్నగారూ’ అన్నాడు కృష్ణ. ‘ఎందుకు కుదరదు? నువ్వు సాయం చేస్తే ఒక అరగంటలో పూర్తవుతుంది. ఆరోగ్యం, డబ్బు ఆదా రెండూ ఉంటాయి. ఇంట్లో వంట చేయక పోతే అది ఇళ్లే కాదు, ఇలాగే బయట తిండి తింటే మీ ఆరోగ్యం పాడవడమే కాకుండా, పిల్లల ఎదుగుదల మీద కూడా ప్రభావం చూపుతుంది. చదువుకున్న మీకు ఇంత కంటే చెప్పలేను..’ అని ఒకింత గట్టిగానే అన్నారు సుందరరామయ్య.

‘లేదు మామయ్య గారూ... ఇకపై ఇంట్లోనే వంట చేస్తాను’ అంది లావణ్య. ‘నేను ఇంటి పనిలో, వంట పనిలో సాయం చేస్తా’ అన్నాడు కృష్ణ. ‘నేను కూడా..’ అన్నాడు శ్రీయాన్‌. ‘అంతేకాదు.. రోజులో ఒక్క పూటైనా అందరూ కలిసే భోజనం చేయాలి’ అన్నారు సుందరరామయ్య. జాతర గరగలు, పగటి వేషగాళ్లు వీధిలోకి రావడంతో.. అంతా నవ్వుతూ బయటకు నడిచారు.  

కూచిమంచి నాగేంద్ర


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు