కిలకిల.. నా పేరు వెన్నెల...!

అదొక చిట్టడవి. అందులో ఒక జామ చెట్టు మీద, కాకి, కోకిల, పావురం కలిసి నివసిస్తున్నాయి. ఒక రోజు ఆ చెట్టు మీదకు ఒక చిలుక వచ్చి వాలింది. అవి మూడూ.. కూర్చున్న కొమ్మకు ఎదురుగా ఉన్న కొమ్మ మీద చేరింది.

Updated : 12 Mar 2024 00:05 IST

దొక చిట్టడవి. అందులో ఒక జామ చెట్టు మీద, కాకి, కోకిల, పావురం కలిసి నివసిస్తున్నాయి. ఒక రోజు ఆ చెట్టు మీదకు ఒక చిలుక వచ్చి వాలింది. అవి మూడూ.. కూర్చున్న కొమ్మకు ఎదురుగా ఉన్న కొమ్మ మీద చేరింది. ‘నా వంక వింతగా చూడకండి. నా పేరు వెన్నెల. నే పలుకుతా కిలకిలా! మీ పక్కనే ఉన్న అడవిలో ఉంటాను’ అంది. ‘మరి ఇక్కడికి ఎందుకొచ్చావు?’ అని కాకి, వెన్నెలకేసి సందేహంగా చూస్తూ అడిగింది. ‘ఏముంది.. మీ కలివిడితనం, స్నేహం గురించి అక్కడ విన్నాను. మీతో స్నేహం చేయాలనిపించి ఇలా వచ్చాను. మంచివారితో స్నేహం ఎప్పుడూ మంచిదేనని మా అమ్మ చెప్పేది. మీతో మైత్రి చేయవచ్చా?’ అని వెన్నెల ఆ మూడింటినీ అడిగింది.

‘నీ చిలుక పలుకులు మాకు నచ్చాయి. మా గురించి తెలుసుకుని వచ్చానన్నావు. నీతో స్నేహం మాకిష్టమే’ అని కోకిల నవ్వుతూ సమాధానమిచ్చింది. ‘ఇక నుంచి మనం ముగ్గురం కాదు.. నలుగురం’ అని పావురం హుషారుగా అంది. ‘జాబిల్లి కూడా ఉండి ఉంటే, అయిదుగురం అయ్యేవాళ్లం కదా’ అని కోకిల దీనంగా అంది.

‘అసలు.. ఆ జాబిల్లి గురించి మాట్లాడకు. అది మోసం చేసి వెళ్లిపోయింది. మనల్ని మర్చిపోయింది. మన దృష్టిలో అది లేనట్టే! మనం అయిదుగురం కాదు, నలుగురమే!’ అని కాకి గట్టిగా, కొంచెం కోపంగా అంది. ‘అలాగే మిత్రమా...!’ అని కాకి మాటలకు.. కోకిల, పావురం వంతపాడాయి.

మరుసటి రోజు కాకి, అలవాటులో భాగంగా ఆహారం కోసం వెళుతూ, ‘ఏ పాము కంటా పడకుండా నా పిల్లలను చూడండి’ అని కోకిల, పావురంతో అంటూ వెళ్లడం వెన్నెల గమనించింది.

‘ఎప్పుడూ, కలిసే ఉంటారు కదా. ఆహారం కోసం కూడా కలిసే వెళ్లొచ్చు కదా?!’ అని కోకిల, పావురాన్ని అడిగింది వెన్నెల. ‘మేం ముగ్గురమూ ఒకేసారి ఎగురుకుంటూ వెళ్లిపోతే, పాములు వచ్చి కాకి పిల్లలను తినేస్తాయి. అందుకే రోజుకొకరు వంతున వెళతాం. అలా తెచ్చిన ఆహారాన్ని పంచుకుని తింటాం. ఈ రోజు కాకి వెళ్లాలి’ అని చెప్పాయవి.

‘కానీ సమస్య ఉన్నప్పుడు దాన్ని పరిష్కరించుకోవాలి. లేకపోతే దానికి దూరంగా, సురక్షిత ప్రదేశానికైనా వెళ్లిపోవాలి’ అంది వెన్నెల. దాంతో ‘మాకు పాములు లేని, రాని చోటు ఏమైనా ఉంటే చెబుతావా?’ అని అడిగాయవి. ‘కాకి వచ్చాక చెబుతాను. సరేనా?’ అంది వెన్నెల. ‘అలాగే’ అన్నాయి ఆ రెండు పక్షులూ. అంతలోనే కాకి ఆ చెట్టు మీదకు చేరింది. తాను తెచ్చిన ఆహారాన్ని దాని పిల్లలతో పాటుగా కోకిల, పావురం, చిలుకలకు పంచింది.  

వెన్నెల ఆహారం తింటూ కాకితో.. ‘మిత్రమా! ప్రమాదం ఉన్న చోట ప్రాణాపాయం తప్పదు. మీరు నాతో వస్తే, పాముల బెడద ఉండదు’ అంది. అప్పుడు మిగతా రెండు పక్షులు ‘అవును మిత్రమా.. మనం వెన్నెలతో వెళదాం. పిల్లలను రక్షించుకుందాం’ అన్నాయి. వాటి మాటను కాదనలేక కాకి కూడా సరేనంది.  

కోకిల, పావురం, కాకి మూడూ.. వెన్నెలను అనుసరించి మరో అడవికి బయలుదేరాయి. అక్కడ ఒక జామచెట్టు మీదకు చేరాయి. కాకి గబగబా గూడు కట్టి.. మెల్లగా పిల్లలను దానిలోకి చేర్చింది. ‘చెట్టు విశాలంగా చాలా బాగుంది. ఫలాలు కూడా రుచిగా ఉన్నాయి’ అని వెన్నెలకేసి  చూస్తూ అన్నాయా పక్షులు. అప్పుడే అదే చెట్టు మీదకు జాబిల్లి వచ్చి వాలింది. దాన్ని చూడగానే, మూడు పక్షులకూ విపరీతమైన కోపం వచ్చింది.

‘జాబిల్లి ఉన్న చోట మేము ఉండలేం.. వెన్నెలా! మరో చోటు చూసుకుంటాం. నీకు అది ముందే తెలుసా?’ అని కాకి గట్టిగా అడిగింది. అప్పుడు వెన్నెల... ‘నేస్తాలూ! కోపం వద్దు. నేను చెప్పేది పూర్తిగా వినండి. అప్పుడు మీ నిర్ణయం మీరు చెప్పండి’ అంది వెన్నెల. ‘ఏమిటి? నువ్వు చెప్పేది’ అని కోకిల అడిగింది. జాబిల్లి ఆ మూడు పక్షులకేసి దీనంగా చూడసాగింది.

‘‘రెండు రోజుల క్రితం ఆహారం కోసం బయటకు వెళ్లబోతూ, ఏదో శబ్దం వినిపించడంతో కిందికి చూశాను. జాబిల్లి ‘దాహం.. దాహం..’ అంటూ మూలుగుతోంది. ఎండదెబ్బ తగిలిందని గుర్తించాను. చూసి గబగబా నీళ్లు తెచ్చాను. తాగిన తర్వాత కొంత కోలుకుంది. నీరసంగా కనిపిస్తున్న దానికి కాసేపటికి జామపండు ఇచ్చాను. అప్పుడది పండును తినకుండా.. ‘నా నేస్తాలు.. వస్తే కానీ తినలేనంటూ మీ గురించి చెప్పింది. ఏ ప్రమాదం లేని చోటు చూశాను. కానీ నేస్తాలకు వెళ్లి చెప్పే ఓపిక లేదు’ అంటూ నా దగ్గర ఏడ్చింది. బాధపడవద్దనీ, నేను తప్పకుండా తీసుకొస్తాను’’ అని జాబిల్లికి మాటిచ్చాను.

‘మిత్రులారా! స్వయంగా కళ్లతో చూసినప్పుడే అసలు నిజం తెలుస్తుంది. అందుకే అక్కడ మీరు జాబిల్లిని తిట్టినా.. నేను మాట్లాడలేదు. ప్రాణాపాయ స్థితిలో కూడా.. స్నేహితుల మేలు కోరుకున్న జాబిల్లి చాలా మంచిది. అది మీరు  గుర్తించండి’ అని వెన్నెల చెప్పిన మాటలతో.. దాని వంక చూశాయా పక్షులు.

‘జాబిల్లీ! బాగున్నావా’ అంటూ ఆప్యాయంగా పలకరించాయి. నేస్తాల పలకరింపునకు, అది ఎంతో మురిసిపోయింది. ‘నిన్ను తప్పుగా అనుకున్నందుకు మమ్మల్ని మన్నించు.. నేస్తం’ అన్నాయవి. అప్పుడు జాబిల్లి.. ‘మన మధ్య స్నేహమే కానీ, క్షమాపణల ప్రస్తావనే ఉండదు.. రాదు’ అంది సంతోషంగా.

‘హమ్మయ్య! మిమ్మల్ని ఒక్కటి చేశాను. నా కోరిక నెరవేరింది. నేను ముందే చెప్పానుగా. నా పేరు.. వెన్నెల. నేను పలుకుతా కిలకిలా’ అని ఆ పక్షుల వంక మురిపెంగా చూస్తూ అంది వెన్నెల. ‘ఇక నుంచి మనం నలుగురం.. కాదు. అయిదుగురం. మాతో స్నేహం చేస్తావా?’ అని కాకి, వెన్నెలను అడిగింది. ‘మీరు స్నేహం చేస్తానంటే, నేనొద్దంటానా?’ అంటూ.. వెన్నెల కిల కిలా నవ్వింది. మిగతా పక్షులూ హాయిగా నవ్వాయి.

కె.వి.లక్ష్మణరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని