ఉడుత సాయం.. గద్ద ఉపాయం!

ధృతి వనంలో ఖగజం అనే ఉడుత, అక్కడున్న ఉడుతలన్నింటికీ రాజు. అందమైన ఆ వనంలో అన్నీ సాధు, చిన్న జంతువులే. చెట్లపై తిరుగుతూ, కిచకిచమని అరుస్తూ ఎంతో ఆనందంగా ఉండేవి. రంగు రంగుల పక్షుల కిలకిలా రావాలతో వనం సందడిగా ఉండేది. క్రూరమృగాలు లేక పోవడం వల్ల వేటగాళ్లు తరచూ అక్కడికి వచ్చి ఉడుతలు, పిట్టలని పట్టి తీసుకుపోయేవారు. ఖగజం మాత్రం ఎప్పుడూ అడవిలో అప్రమత్తంగా తిరుగుతూ ఉండేది.

Updated : 13 Mar 2024 05:15 IST

ధృతి వనంలో ఖగజం అనే ఉడుత, అక్కడున్న ఉడుతలన్నింటికీ రాజు. అందమైన ఆ వనంలో అన్నీ సాధు, చిన్న జంతువులే. చెట్లపై తిరుగుతూ, కిచకిచమని అరుస్తూ ఎంతో ఆనందంగా ఉండేవి. రంగు రంగుల పక్షుల కిలకిలా రావాలతో వనం సందడిగా ఉండేది. క్రూరమృగాలు లేక పోవడం వల్ల వేటగాళ్లు తరచూ అక్కడికి వచ్చి ఉడుతలు, పిట్టలని పట్టి తీసుకుపోయేవారు. ఖగజం మాత్రం ఎప్పుడూ అడవిలో అప్రమత్తంగా తిరుగుతూ ఉండేది. వేటగాళ్ల సమాచారం ముందే తెలుసుకుని ఉడుతలు, పక్షులను హెచ్చరించేది. అయినా కొన్ని ఆకతాయి ఉడుతలు రాజు మాట వినక బయట తిరిగి వేటగాళ్లకు దొరికిపోయేవి. వారు పక్షులను బాణాలతో కొట్టి చంపేవారు.

ఉడుతలను పట్టి వాటిని చంపి, చర్మంలో పొట్టు, గడ్డి పెట్టి ఆ బొమ్మలను నగరంలో అమ్ముతున్నారని చెప్పింది అదే వనంలో నివసించే కాకి. అది విన్న ఖగజం మరింత కలవర పడింది. ఎలాగైనా సరే వేటగాళ్ల బారినుంచి వనంలో పక్షులు, చిరుప్రాణులను కాపాడాలని నిర్ణయించుకుంది. ఎంత ఆలోచించినా ఈ వనంలో వేటగాళ్లను అదుపు చేయగలిగేది ఎవరో దానికి తట్టలేదు. తన నేస్తం అయిన గద్దను కలిసి సహాయం చెయ్యమంది. ‘ఇక్కడున్న అందరిలో... నీవొక్కదానివే బలమున్నదానివి. నువ్వే ఎలాగైనా మమ్మల్ని ఆ వేటగాళ్ల బారి నుంచి కాపాడగలవు’ అని అర్థించింది.

‘నువ్వు చెప్పింది నిజమే.. మీ అందరి కన్నా నేను బలం గల దానినే, ఎక్కడికైనా వెళ్లి, ఏది తెమ్మన్నా తేగలను. సముద్రమూ దాటగలను... కానీ ఆ వేటగాళ్ల ముందు మాత్రం చాలా చిన్న దాన్ని. పైగా వాళ్ల దగ్గర మారణాయుధాలు ఉన్నాయి. కనుక నేను వాళ్లకు ఎదురుపడి పోరాడలేను’ అంది గద్ద. ‘మరెలా.. మేమంతా ఈ వనం విడిచి పోవల్సిందేనా, ఇక మాకు దిక్కెవరు? ఎన్నాళ్ల నుంచో ఇక్కడ నివాసం ఉంటున్నాం. కొత్త చోటికి వెళ్లి బతకగలమా?’ అంది బాధగా ఖగజం.

గద్ద చాలాసేపు ఆలోచించింది... ‘నేనొక ఉపాయం చెబుతాను. కానీ అది ఎంతవరకు విజయవంతం అవుతుందో చెప్పలేను’ అంది. ‘ఆలస్యం ఎందుకు? ముందు అదేమిటో చెప్పు... మేం కూడా ఆలోచిస్తాం’ అంది ఖగజం. ‘అయితే విను నువ్వున్న మర్రిచెట్టు పక్కన పుట్టలో నాగేంద్రం అనే పాము ఉంది. దానికి ఆవేశం ఎక్కువ. కాటు వేస్తే ఎవ్వరైనా మరణించాల్సిందే. అదికూడా నాతో కలిస్తే వేటగాళ్ల పీడ వదిలి పోతుంది’ అంది గద్ద.

‘అదెలా సాధ్యపడుతుంది. మీ ఇద్దరికీ జాతి వైరం కదా. అసలు పామును, గద్దను కలపగలమా. అది కుదరని పని. అసలా సర్పం ఒప్పుకోదు’ అంది ఖగజం. ‘ముందైతే అడిగి చూడు. చిన్న జంతువుల రక్షణ, వనం భవిష్యత్తు కోసం అని చెప్పు. లేకుంటే మనమంతా అడవి వదిలి పోవాల్సిందే అని వివరంగా చెప్పు. అప్పుడు అది తప్పక సమ్మతిస్తుంది. దానికి కోపం కాస్త ఎక్కువైనా ఉపకారం చేసే గుణం ఉంది’ అంది గద్ద.

ఖగజం పాముని కలిసి గద్ద మాటలన్నీ చెప్పింది. ముందు ఒప్పుకోక పోయినా చిన్న ప్రాణుల కోసం అని ప్రాధేయ పడడంతో ‘సరే’ అంది పాము. రెండు రోజుల తరువాత ఇద్దరు వేటగాళ్లు అడవిలోకి ప్రవేశించారు. వారు చేతిలో ఎక్కుపెట్టిన విల్లులతో అటూఇటూ చూసుకుంటూ నడుస్తున్నారు. ముందు అనుకున్న ప్రకారమే పాముని నోట పట్టుకుని గాల్లోకి లేచింది గద్ద. సరిగ్గా వేటగాడి నెత్తిమీదకు ఎగిరి పామును జారవిడిచింది. ఏం జరిగిందో తెలిసే లోపే వాడి మెడ మీద బలంగా కాటు వేసి... కింద పడి జరజరమని పాక్కుంటూ పొదల్లోకి పోయింది. పాము కాటుకు అక్కడిక్కడే చచ్చాడు ఒక వేటగాడు. రెండోవాడేమో ప్రాణభయంతో వనం వదిలి పారిపోయాడు. తమ ప్రాణాలకు తెగించి వనంలో ప్రాణుల కోసం వైరం వదిలి సహాయం చేసిన పాము, గద్దకు కృతజ్ఞతలు చెప్పాయి పక్షులు, ఉడుతలు. ఇక ఎప్పుడూ, వేటగాళ్లెవరూ ఇటు వైపు కన్నెత్తి చూడరు. ఒకవేళ ధైర్యం చేసి వచ్చినా ఇదే పథకం అంది గద్ద నవ్వుతూ.

కూచిమంచి నాగేంద్ర


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని