రాజు జోక్యం... రామచిలుక జోష్యం!

ముకుందాపురంలో ఉండే విరూపాక్షుడు.. పేరున్న శిల్పి. కొయ్య బొమ్మలు, రాతి శిల్పాలూ చెక్కేవాడు. విరూపాక్షుడు గ్రామానికి దగ్గరలోని గుట్టల నుంచి నల్లరాళ్లు, సమీప అడవి నుంచి కలప తెచ్చి బొమ్మలు, శిల్పాలు తయారు చేస్తుండేవాడు.

Updated : 15 Mar 2024 00:09 IST

ముకుందాపురంలో ఉండే విరూపాక్షుడు.. పేరున్న శిల్పి. కొయ్య బొమ్మలు, రాతి శిల్పాలూ చెక్కేవాడు. విరూపాక్షుడు గ్రామానికి దగ్గరలోని గుట్టల నుంచి నల్లరాళ్లు, సమీప అడవి నుంచి కలప తెచ్చి బొమ్మలు, శిల్పాలు తయారు చేస్తుండేవాడు. ఒకసారి అడవి నుంచి కలప కోసం నల్లమద్ది చెట్టును నరికి దుంగలుగా చేసి ఇంటికి తీసుకువచ్చాడు. నల్లమద్ది చెట్టు చివరికొమ్మ మీద రామచిలుక జంట నివాసముంటోంది. వాటికి ఒక చిలుకపిల్ల ఉంది. ఆ రామచిలుకల జంట గూడును వదిలి తిండికి బయలు దేరిన తర్వాత విరూపాక్షుడు నల్లమద్ది చెట్టును నరికి ఇంటికి తీసుకు వచ్చాడు.

అడవిలో తిండి కోసం వెళ్లిన రామచిలుకల జంట తిరిగి వచ్చే సరికి తాము నివాసముంటున్న నల్లమద్ది చెట్టు జాడ లేదు. ఎవరో కలప కోసం దాన్ని నరికి తీసుకుపోయినట్టు అనుమానించాయి. తమ చిన్ని చిలుక ఏమైందోనని ఆందోళన చెందాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా దాని జాడ తెలియలేదు. అవి చిట్టి చిలుక కోసం అంతటా వెదుకుతూనే ఉన్నాయి.

అక్కడ విరూపాక్షుడు నల్లమద్ది దుంగలను ఇంటికి చేర్చి ఆరడానికి వాకిట్లో ఉంచుతుండగా ఓ తొర్రలోంచి చిన్నగా అరుపు వినబడింది. పరిశీలించి చూస్తే అందులో ఒక రామచిలుక పిల్ల కనిపించింది. అయ్యో..! తన వల్ల పెద్ద తప్పిదమే జరిగిందని.. విచారించాడు. వెంటనే దాన్ని పైకితీసి ఇంట్లోకి తెచ్చాడు. చిలుకపిల్ల ఎర్రనిముక్కు, ఆకుపచ్చని రంగుతో ముచ్చటగా కనిపిస్తోంది. జామ పండును చిన్న చిన్న ముక్కలుగా కోసి దాని నోటి దగ్గర పెడితే ఆప్యాయంగా తినసాగింది. చిన్నగా ఉన్నందున ఎగరలేకపోతోంది. బయట ఉంచితే పక్షులు, జంతువులు చిలుకపిల్లను బతకనీయవని తలచి, విరూపాక్షుడు దాన్ని ఒక పంజరంలో పెట్టి రోజూ రకరకాల పళ్లు, తగినన్ని నీళ్లు అందిస్తూ పెంచుతున్నాడు. పంజరానికి తలుపు లేనందున ఇష్టం ఉన్నంతసేపు బయట ఉండి, పళ్లు తిని రాత్రివేళ పంజరంలోకి పోతుండేది. వాకిట్లో విరూపాక్షుడు తన పనులు చేసుకుంటూ కూనిరాగాలు తీస్తుండేవాడు. చిట్టిచిలుక వాటిని విని అనుకరించేది. దాని గ్రహణశక్తిని తెలుసుకున్న విరూపాక్షుడు దానికి మరింత శిక్షణ ఇచ్చాడు. అప్పటి నుంచి చిట్టి చిలుక మనిషిలా స్పష్టంగా మాట్లాడేది.

అక్కడ అడవిలో తమ పిల్ల జాడ కానరాక రామచిలుక జంట చుట్టుపక్కల గ్రామాల్లో వెతకడం మానలేదు. కొన్ని రోజులకు ముకుందాపురంలో విరూపాక్షుడి ఇంటి ప్రాంగణంలో వాటికి తమ బిడ్డ ఆడుతూ, పాడుతూ కనబడింది. చక్కగా పెరిగి, అందంగా కనిపించిన తమ బిడ్డను చూసి  మురిసిపోయాయి. దగ్గరకెళ్లి పక్షి భాషలో పలికితే జవాబివ్వలేదు. తమని మరచిపోయిందని తలిచి కాస్త బాధపడ్డాయి. సర్లే.. ఎక్కడైనా తమ బిడ్డ ప్రాణాలతో సుఖంగా ఉంటే చాలని సంతోషించి తిరిగి అడవికి ఎగిరిపోయాయి.
ఏకశిలా నగరాన్ని రాజధానిగా చేసుకుని పాలిస్తున్న శరభూపాలుడికి, విరూపాక్షుడి కళా నైపుణ్యం తెలిసి రాజధానికి రమ్మని రాజభటులతో సమాచారం పంపించారు. శిల్పి విరూపాక్షుడి ఇంటి ప్రాంగణంలో మాట్లాడే రామచిలుకను చూసి ఆ విషయం మహారాజుకు తెలిపారు భటులు. ముచ్చట పడిన శరభూపాలుడు ఆ మాట్లాడే రామచిలుకను తనకు కానుకగా ఇవ్వమని విరూపాక్షుడికి వర్తమానం పంపారు. మాట్లాడే రామచిలుక అంటే తనకు ప్రాణమని, దాన్ని కానుకగా ఇవ్వలేనని ముక్కుసూటిగా చెప్పేశాడు శిల్పి.

తన కోరికను కాదన్నందుకు కోపగించి విరూపాక్షుడిని కారాగారంలో పెట్టించారు మహారాజు. పంజరంతో సహా రామచిలుకను రాజమహలుకు తెప్పించారు ఆయన. అకారణంగా యజమాని కారాగారం పాలైనందుకు రామచిలుక తిండి మానేసింది. విషయం తెలిసిన శరభూపాలుడు రామచిలుకను ఉంచిన పంజరం దగ్గరకు వచ్చారు. రాజును చూసిన రామచిలుక ఉక్రోషంతో ‘మహారాజా! మీరు నా యజమానిని కారాగారంలో బంధించి పెద్ద తప్పు చేశారు. దానికి ఫలితం తప్పక అనుభవిస్తారు. తొందర్లోనే మీ పొరుగున ఉన్న శత్రుసైన్యం కోట మీద దాడి చేస్తుంది’ అని పలికింది. రామచిలుక వాక్చాతుర్యానికి రాజు ఆశ్చర్యపోయాడు.

ఇంతలో వేగులు వచ్చి, శత్రుసైనికులు యుద్ధ సన్నాహాలు చేస్తున్న వార్త చెప్పారు. చిలుక జోష్యం నిజమైందని నమ్మిన శరభూపాలుడు వెంటనే సైన్యాన్ని అప్రమత్తం చేసి కోట చుట్టూ ఉన్న కందకంలో నీటిని నింపి మొసళ్లను వదిలారు. ఈ విధంగా మాటలు నేర్చిన రామచిలుక జోష్యంతో రాజ్యానికి పెద్ద ఆపద తప్పిందనుకున్నాడు. తన తప్పు తెలుసుకుని శిల్పి విరూపాక్షుడిని కారాగారం నుంచి రప్పించి, ఆస్థాన శిల్పిగా నియమించాడు మహారాజు. యజమానికి రాజమందిరంలో పెద్ద కొలువు దొరికినందుకు రామచిలుక సంతోషించింది. తన ముద్దు ముద్దు మాటలతో రాజమహల్లో అందరినీ అలరించింది.

కందర్ప మూర్తి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని