దత్తాత్రేయుడే.. ఎందుకు?

అవంతి రాజ్యంలోని రామాపురం గ్రామంలో కృష్ణాచారి అనే వైద్యుడు ఉండేవాడు. ఆయనకు వయసు మీద పడటంతో తన ఉద్యోగాన్ని వదిలేసి ఇంటి పట్టునే ఉంటున్నాడు

Published : 15 Mar 2024 23:46 IST

అవంతి రాజ్యంలోని రామాపురం గ్రామంలో కృష్ణాచారి అనే వైద్యుడు ఉండేవాడు. ఆయనకు వయసు మీద పడటంతో తన ఉద్యోగాన్ని వదిలేసి ఇంటి పట్టునే ఉంటున్నాడు. దాంతో వైద్యశాలలో ఆయన స్థానంలో ఖాళీ ఏర్పడింది. మహారాజు అక్కడ.. ఒక అనుభవమున్న మంచి వైద్యుడిని నియమించమని మంత్రిని ఆదేశించాడు. రాజు మాట ప్రకారం.. ఆ స్థానం భర్తీ చేయడం కోసం రాజ్యమంతా ప్రకటన చేయించాడు మంత్రి. అది విని చాలామంది వైద్యులు పోటీకి వచ్చారు. అందులో నుంచి అర్హత కలిగిన వైద్యుడిని ఎంపిక చేయమని కృష్ణాచారికి చెప్పాడు మంత్రి.

వచ్చిన వాళ్లందరికీ కొన్ని పరీక్షలు నిర్వహించి, అందులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఇద్దరిని ఎంపిక చేశాడు కృష్ణాచారి. వారిలో ఒక వైద్యుడి పేరు వైద్యరత్న.. మధ్య వయస్కుడు, మంచి అనుభవజ్ఞుడు. ఆయన చేసే వైద్యం గురించి ప్రజలందరికీ తెలుసు. ఎలాంటి జబ్బునైనా తన వైద్యంతో ఇట్టే తగ్గించేస్తాడు. మరొక వైద్యుడు దత్తాత్రేయుడు.. యువకుడు, ఇప్పుడిప్పుడే వైద్యరంగంలో బాగా రాణిస్తున్నాడు. అయితే ఇద్దరూ మంచి వైద్యులే! కానీ.. వారిలో ఎవరిని తన స్థానంలో నియమించాలో కృష్ణాచారికి ఓ పట్టాన అంతుబట్టలేదు. బాగా ఆలోచించి.. చివరి ఫలితం రెండు రోజుల్లో తెలియజేస్తానని చెప్పాడు. అక్కడి ప్రజలంతా.. ‘వైద్యరత్న లాంటి గొప్ప వైద్యుడు తప్ప, ఆ పదవికి ఎవరూ అర్హులు కాదు’ అని అనుకోసాగారు.  

 ఒకరోజు రాత్రిపూట ఒక వృద్ధ మహిళ వైద్యరత్న ఇంటి తలుపు తట్టింది. ఆయన బద్ధకంగా నిద్ర లేచి ‘ఎవరూ?’ అంటూ తలుపు తీసి.. ‘ఏం కావాలి?’ అని అసహనంగా అడిగాడు. ‘బాబూ.. మా ఇంట్లో పెద్దాయనకి ఒంట్లో బాగోలేదు.. చాలా జ్వరంగా ఉంది. మీరు ఒకసారి వచ్చి.. ఆయనకి మందులిస్తారని వచ్చాను. ఆలస్యం చేయకుండా కాస్త రండి బాబూ’ అంటూ దీనంగా అడిగిందామె. అప్పుడు వైద్యరత్న సమయం చూశాడు. అర్ధరాత్రి దాటుతోంది.. పైగా సన్నని వర్షం కూడా పడుతోంది. ‘ఆయన్ని నా దగ్గరికి తీసుకొని వస్తేనే కదా నేను పరీక్షించి మందులిచ్చేది. చూడకుండా వైద్యం ఎలా చేస్తాను?’ అన్నాడు చిరాగ్గా ముఖం పెట్టి. ‘ఆయనకి ఆ మాత్రం ఒంట్లో బాగుంటే నేనే తీసుకొచ్చేదాన్ని. చాలా నీరసంగా నడవలేని స్థితిలో ఉన్నాడు. మీరు వెంటనే నాతో పాటు రండి బాబూ’ అని ప్రాధేయపడుతూ అడిగిందా వృద్ధ మహిళ. ఆ సమయంలో వెళ్లి వైద్యం చేయడానికి వైద్యరత్నకు ఇష్టంలేదు. దాంతో ఏవో మూలికలు ఇచ్చి అవి తినమని చెప్పి తలుపులు వేసుకున్నాడు.

 ఆ సమయంలో ఏం చేయాలో అర్థంకాని ఆమె.. వెంటనే యువ వైద్యుడు దత్తాత్రేయుడి ఇంటికి వెళ్లింది. భర్త అనారోగ్యం గురించి అతనికి వివరించింది. ఆమెతో పాటు వెళ్లి, తన భర్తకు వైద్యం చేసి.. కాస్త కోలుకునేంత వరకు అక్కడే ఉన్నాడు దత్తాత్రేయుడు. అలా రెండు రోజులు గడిచాయి. ఆ రోజే రాజ్యంలోని వైద్యశాలలో వైద్యుని పదవికి ఫలితం వెలువడేది. వైద్యరత్న తనకే ఆ కొలువు వస్తుందని ధీమాగా ఉన్నాడు. జనం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ మంత్రి విచిత్రంగా యువ వైద్యుడు దత్తాత్రేయుడి పేరును ప్రకటించాడు. అక్కడున్న జనంతో పాటూ.. వైద్యరత్న కూడా నిర్ఘాంతపోయాడు. ‘ఇదెలా సాధ్యం? అతని కంటే.. అన్నింట్లోనూ నేనే ఉత్తముడిని. పైగా ఎక్కువ అనుభవం కలిగిన వాడిని, నన్ను కాకుండా దత్తాత్రేయుడిని ఎలా ఎంచుకుంటారు?’ అని అడిగాడు కృష్ణాచారిని. అప్పుడు ఆయన రెండు రోజుల క్రితం జరిగిన వృద్ధ మహిళ సంఘటన గుర్తుచేశాడు.
‘వైద్యుడు ఎప్పుడూ సమయాన్ని బట్టి పని చేయకూడదు. నిత్యం రోగులకు అందుబాటులో ఉండాలి. కానీ నువ్వు అత్యవసర సమయమైనా కూడా వెళ్లి వైద్యం చేయడానికి నిరాకరించావు. ఆపదలో ఉన్న వారిని రక్షించడమే నిజమైన వైద్యుడి ప్రధాన లక్ష్యం కావాలి. అందుకే నువ్వు ఈ పదవికి అర్హుడివి కాదు..’ అని చెప్పాడు కృష్ణాచారి. దాంతో క్షమాపణలు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడతను. దత్తాత్రేయుడి సమయస్ఫూర్తికి అక్కడున్న వాళ్లంతా చప్పట్లు కొట్టారు. ఆ తర్వాత మహారాజు అతనికి కొలువులో చేరడానికి పత్రాలు అందించి.. అభినందించాడు.

- నంద త్రినాథరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని