కొడుకు పాట.. తండ్రి మాట!

ఆనందుడనే యువకుడు సంగీత ప్రియుడు. ఒక్కడే కొడుకు కావడంతో తల్లిదండ్రులు ఎంతో ముద్దు చేస్తూ ఉండేవారు. తనకు తండ్రి సంతలో కొనిపెట్టిన వేణువుతో ఆనందుడు సాధన చేయసాగాడు. ఏకైక సంతానం చదువు మానేసి ఇలా పిల్లనగ్రోవితో కాలం గడపడంతో తల్లిదండ్రులు బాధపడ్డారు. ఒకసారి మాత్రం ఆనందుణ్ని తల్లిదండ్రులు మందలించారు.

Published : 18 Mar 2024 00:17 IST

నందుడనే యువకుడు సంగీత ప్రియుడు. ఒక్కడే కొడుకు కావడంతో తల్లిదండ్రులు ఎంతో ముద్దు చేస్తూ ఉండేవారు. తనకు తండ్రి సంతలో కొనిపెట్టిన వేణువుతో ఆనందుడు సాధన చేయసాగాడు. ఏకైక సంతానం చదువు మానేసి ఇలా పిల్లనగ్రోవితో కాలం గడపడంతో తల్లిదండ్రులు బాధపడ్డారు. ఒకసారి మాత్రం ఆనందుణ్ని తల్లిదండ్రులు మందలించారు. అందుకు ఆనందుడు.. ‘సంగీతాన్ని నేను ప్రేమిస్తున్నాను. మీరు ఏమి చెప్పినా చేస్తాను. సంగీతం గురించి మాత్రం నన్నేమీ అనకండి’ అన్నాడు. ‘అలా అయితే, సంగీతాన్ని ఒక క్రమపద్ధతిలో అభ్యసించాలి. ఏ గురువునైనా ఆశ్రయించి, సంగీతంలో మెలకువలు తెలుసుకో’ అని అనునయంగా చెప్పి చూశారు తల్లిదండ్రులు.

ఆ సూచన ఆనందుడికి నచ్చింది. అయితే, ఆనందుడున్న గ్రామంలో సంగీతం నేర్పే గురువులు లేరు. అదే ఊళ్లో పక్కవీధిలోనే ఉంటోన్న రంగరాజు కొంతకాలం పట్నంలో ఉండి, కాస్త సంగీతం నేర్చుకుని వచ్చాడు. ఆనందుడు, రంగరాజును కలుసుకుని సలహా అడిగాడు. రంగరాజుది కుత్సిత స్వభావం, ఆనందుడి మాటలు వింటూనే సంతోషాన్ని నటించాడు. ‘నాకు తెలిసిన విద్య ఎవరికైనా నేర్పాలని ఉంది. నీకంటే మంచి శిష్యుడు దొరకడు. నా దగ్గర కొంత నేర్చుకున్నాక, పట్నం వెళ్లి పెద్ద పెద్ద గురువులకు శిష్యుడివవుదువుగానీ, ముందుగా నీకు సంగీతంలో ఏ పాటి ప్రవేశం ఉందో తెలుసుకోవాలి, కాబట్టి నీకు వచ్చిన విద్యను నా ముందు ప్రదర్శించు’ అన్నాడు.

ఆనందుడు రంగరాజు ముందు వేణుగానం చేశాడు. రంగరాజు విని తెల్లబోయాడు. ఎన్నో నెలలుగా గురువుల దగ్గర నేర్చుకున్నప్పటికీ, తనకేమాత్రం సంగీత పరిజ్ఞానం అబ్బలేదు. అందుకే ఆనందుడి ప్రావీణ్యానికి లోలోపల అసూయపడి... ‘ఛ ఛా! నీ పాట నిండా అపస్వరాలే. నువ్వు సంగీతం నేర్చుకునేందుకు అర్హుడివి కాదు. ఏవో లల్లాయి పాటలు పాడుకుంటూ కాలక్షేపం చెయ్యి’ అన్నాడు. ఆ మాటలు విన్న ఆనందుడికి ఎంతో నిరుత్సాహం కలిగింది. ఎంతో కాలాన్ని వృథా చేశానని కోపం కూడా వచ్చింది. చిరాగ్గా ఇంటికి వెళ్లి, తన వేణువును తల్లికిచ్చి’ అమ్మా, దీన్ని పొయ్యిలో వేసి మంట పెట్టు. జీవితంలో మళ్లీ సంగీతం జోలికి వెళ్లను’ అన్నాడు.  

తల్లి, ఆనందుణ్ని అడిగి జరిగిందేమిటో తెలుసుకుని ఓదార్చింది. ‘రంగరాజు అలా అన్నాడని నువ్వు సంగీతమే మానేస్తావా? ఇదేం బుద్ధిరా నీకు! అతడికి నీ పాట విని అసూయ పుట్టి నీతో చులకనగా మాట్లాడి ఉంటాడు. ఇన్నాళ్లూ మేము అంటే నీకు కోపం రాలేదు. ఇప్పుడు అతడు ఒక్కమాట అంటే ఏకంగా అభ్యాసం మానేస్తావా?’ అంది. ‘రంగరాజు అసూయ కారణంగా, నేను సంగీతం మానేశానని మన ఊరందరికీ తెలియాలి. అప్పుడు అందరూ అతణ్ని తిడతారు. ఏమైనాసరే. ఇక నేను మాత్రం సంగీతం జోలికి వెళ్లను’ అన్నాడు ఆనందుడు.

ఆ మాటలు కాస్త దూరంగా ఉన్న ఆనందుడి తండ్రి విని, కొడుకు దగ్గరకు వచ్చి... ‘సరే, నాయనా! అంతా నీ ఇష్టం. నీకు సంగీతం మీద ఉన్న ప్రేమకంటే.... రంగరాజుపై ద్వేషం ఎక్కువైనప్పుడు, సంగీతాన్ని వదిలిపెట్టడం న్యాయమే. నీకు తోచినట్టే చెయ్యి’ అన్నాడు. తండ్రి చిన్నమాటే అన్నాడు. కానీ ఆమాటల్లోని మర్మం తన ధర్మాన్ని తెలియజేసింది. ఒకరు ఏదో అన్నారని విద్యను మధ్యలో వదిలేస్తే ఎప్పటికీ ప్రతిభావంతులం కాలేం. రేపు మరో విద్య నేర్చుకుందామనుకున్నా.. అప్పుడు ఇంకొకడు వేళాకోళం చేస్తే పరిస్థితి ఏంటీ. నొసలు చిట్లించిన వాళ్లే వేనోళ్ల పొగిడేలా మన ఉన్నతిని చాటాలి. తండ్రి మాటతో, తన ఆలోచనలోని పొరబాటు ఆనందుడికి తెలిసి వచ్చింది. అందుకే రంగరాజుపై ద్వేషం వదిలి పెట్టి, పట్నం వెళ్లి గురువులనాశ్రయించాడు. ఎన్నో మెలకువలు నేర్చుకుని తిరిగి సొంత ఊరికి వచ్చాడు. పట్టుదలతో వేణుగానంలో తనకుతానే సాటి అనిపించుకున్నాడు.  

తరిగొప్పుల వీఎల్‌ఎన్‌ మూర్తి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని