మంచి మనసును మించిన అందం లేదు!

ఒక అడవిలో ఓ చెట్టు, నేలకు ఆనుకుని ఉన్న తొర్రలో తిలకం అనే బుజ్జి కుందేలు ఉండేది. ఆ వృక్షం మీదే ఒక కోతి నివసించేది. ఒకరోజు దానికి పక్కనే ఉన్న పల్లెకు వెళ్లినప్పుడు అద్దం దొరికింది.

Published : 19 Mar 2024 00:10 IST

క అడవిలో ఓ చెట్టు, నేలకు ఆనుకుని ఉన్న తొర్రలో తిలకం అనే బుజ్జి కుందేలు ఉండేది. ఆ వృక్షం మీదే ఒక కోతి నివసించేది. ఒకరోజు దానికి పక్కనే ఉన్న పల్లెకు వెళ్లినప్పుడు అద్దం దొరికింది. అందులో దాని ప్రతిబింబం చూసుకుని మురిసిపోయింది. అది అక్కడే వదిలేయకుండా అడవికి తెచ్చి, కుందేలుకు చూపించింది. తెల్లగా, ముద్దుగా, అందంగా ఉన్న దాని రూపాన్ని అద్దంలో చూసుకుని కుందేలు సంబరపడిపోయింది. ‘కోతి మామా.. కోతి మామా... దీన్ని కాసేపు నా దగ్గర ఉంచుకుంటాను’ అందది. అందుకు కోతి కూడా సరేనంది.

ఎన్ని రోజులు గడిచినా అది ఆ అద్దాన్ని వానరానికి తిరిగి ఇవ్వలేదు. ఇవ్వమని అడిగితే.. ‘నువ్వు అందంగా ఉండవు కదా! ఈ అద్దాన్ని నువ్వేం చేసుకుంటావు. నేను ఎంచక్కా అందమైన నా ముఖాన్ని రోజూ అద్దంలో చూసుకుని ఆనందిస్తాను’ అంటూ తొర్రలోకి వెళ్లిపోయింది. ఆ రోజు నుంచి అడవిలోని జంతువులన్నింటి కంటే అదే అందంగా ఉంటుందనే గర్వం దానికి పెరిగిపోయింది. అది కోతికి అద్దాన్ని తిరిగి ఇవ్వకపోగా... అడిగిన ప్రతిసారీ ఎగతాళి చేసేది.

ఆ కుందేలు.. ‘తొండంతో, దంతాలతో ఉన్న నీ రూపాన్ని నీళ్లలో చూసుకో. నీ అందమేంటో తెలుస్తుంది’ అని ఏనుగును అవహేళన చేసేది. నల్లగా, ఒళ్లంతా వెంట్రుకలతో ఉన్నావంటూ ఎలుగుబంటినీ ఆటపట్టించేది. అలా అడవిలో ఉన్న జంతువులు, పక్షులు, కీటకాలనూ ఏడిపించేది. ‘నన్ను చూడండి. ఎంత అందంగా ఉన్నానో!’ అంటూ గర్వంతో విర్రవీగేది.

మెడచుట్టూ వెంట్రుకలు, అందవికారమైన ముఖంతో ఉన్నావంటూ ఒక రోజు ఏకంగా సింహాన్నే ఎగతాళి చేసింది. ఆగ్రహంతో ఊగిపోయిన ఆ సింహం కుందేలును పట్టి చంపాలనుకుంటే.. అదృష్టం బాగుండి త్రుటిలో తప్పించుకుంది. కనీసం ఈ సంఘటనతో అయినా కుందేలు బుద్ధి తెచ్చుకుందా.. అంటే అదీలేదు. తర్వాత మరికొన్ని రోజులకే పులినీ దుర్భాషలాడి.. దాని బారి నుంచీ అనూహ్యంగా తప్పించుకుంది.

ఒకరోజు తొర్రలో నిద్రిస్తున్న కుందేలును కందిరీగ కుట్టింది. అప్పుడది బాధతో విలవిల్లాడిపోయింది. దాని ముఖం బాగా వాచిపోయింది. అందవికారంగా తయారైంది. అద్దంలో దాన్ని అది చూసుకుని బాధ పడింది. జంతువులకు దాని ముఖాన్ని ఎలా చూపించాలని దిగులుపడిపోయింది. ఆ ముఖంతో బయటకు రాలేక తొర్రలోనే ఉండిపోయింది. ఆకలి, గాయం బాధతో లోపలే అలమటించసాగింది.

రెండు రోజులుగా కుందేలు బయటకు రావడం లేదనే విషయం కోతి గమనించింది. కారణమేంటో అనుకుంటూ.. ఆహారం తీసుకుని తొర్ర దగ్గరకు వచ్చి.. ‘భోజనం తెచ్చాను. బయటకురా’ అని పిలిచింది కోతి. కుందేలు తల కిందకు వేసుకొని బయటకొచ్చింది. కోతి తెచ్చిన ఆహారంతో ఆకలి తీర్చుకుంది. దాని ముఖం వాచిపోయి ఉండడం గమనించి కారణమడిగి తెలుసుకుంది కోతి. విషయం తెలిశాక వెంటనే వెళ్లి వైద్యం చేసే ఎలుగుబంటిని పిలుచుకొచ్చింది. ఎలుగుతో గతంలో దాని ప్రవర్తన గుర్తుకు వచ్చి సిగ్గుతో తలదించుకుందా కుందేలు.

గాయపడిన దాని ముఖానికి ఆకు పసరు రాసింది ఎలుగు. అలా నాలుగు రోజులు చేసి కుందేలుకు మునుపటి రూపం వచ్చేలా చేసింది. ‘నేను నా అందాన్ని చూసుకుని మిడిసిపాటుతో మిమ్మల్ని ఎగతాళి చేశాను. నా మాటలను మనసులో పెట్టుకోకుండా కోతి మామ నా ఆకలి తీర్చింది. ఎలుగన్న వైద్యం చేసింది. అందం కన్నా మంచి మనసు మిన్న అని చాటారు. ఏమిచ్చినా మీ రుణం తీరదు. శారీరక అందం శాశ్వతం కాదు. మంచి మనసుకు మించిన సౌందర్యం లేదని గ్రహించాను. క్షమించండి’ అంది కుందేలు.

‘ఇప్పటికైనా నువ్వు మారినందుకు సంతోషంగా ఉంది’ అంది కోతి. ఇంతలో కందిరీగ అక్కడికొచ్చింది. ‘నేనే నిన్ను కుట్టింది. ఎందుకో తెలుసా? అడవిలో పెద్ద జీవులైన సింహం, పులిని కూడా నువ్వు హేళన చేశావు. అందుకు నువ్వు చావు దాకా వెళ్లి తప్పించుకోవడం చూశాను. మాటలతో చెబితే నువ్వు వినే స్థితిలో లేవు. అందం పోవడానికి చిన్న గాయం చాలు. సౌందర్యం శాశ్వతం కాదనే విషయాన్ని నీకు అనుభవపూర్వకంగా తెలియజేయడానికే ఇలా చేశాను. అన్ని జంతువులూ మంచిగా, సహనంగా ఉండవు. ఆ విషయం తెలియక నీ ప్రవర్తనతో ప్రాణాలు పోగొట్టుకుంటావని జాలిపడి, నీ కళ్లు తెరిపించడానికే ఇలా చేయాల్సి వచ్చింది’ అంది కందిరీగ. మంచి మనసును మించిన అందం లేదంటూ కోతి, కందిరీగ, ఎలుగుబంటికి తలవంచి నమస్కరించింది కుందేలు. తర్వాత తొర్రలోని అద్దాన్ని కోతికిచ్చింది. అన్ని సమస్యలకూ ఇదే మూలం అని దాన్ని ఏట్లో విసిరేసిందది.

డి.కె.చదువులబాబు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని