ఇది కుచేలపురం కథ..!

కుచేలపురం గ్రామంలోని ప్రజలు తమ అవసరాలకు పొరుగు గ్రామాలపై ఆధారపడేవారు. ఆ గ్రామంలో కొంతమంది మాత్రమే ధనికులు ఉండేవారు. అందువల్ల పేదవాళ్లు అప్పు కోసం ఇతర గ్రామాలకు వెళ్లేవారు

Published : 21 Mar 2024 00:05 IST

కుచేలపురం గ్రామంలోని ప్రజలు తమ అవసరాలకు పొరుగు గ్రామాలపై ఆధారపడేవారు. ఆ గ్రామంలో కొంతమంది మాత్రమే ధనికులు ఉండేవారు. అందువల్ల పేదవాళ్లు అప్పు కోసం ఇతర గ్రామాలకు వెళ్లేవారు. ఇది ఆ గ్రామపెద్ద గమనించాడు. ఒకరోజు అతడు ఆ గ్రామంలో ఉండే ధనికులను పిలిచి.. సమావేశం ఏర్పాటు చేశాడు. ‘మన గ్రామంలో చాలా మంది ప్రజలు రుణాల కోసం పొరుగు గ్రామాలకు వెళ్తున్నారు. వాళ్లు అలా వెళ్లకుండా ఉండాలంటే మనమే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. మన గ్రామం బాగుండటానికి ఏం చేస్తే బాగుంటుందో మీరే ఆలోచించి చెప్పండి’ అన్నాడాయన.

ఆయన మాటలు విన్నాక కొంత మంది.. రైతులకు వ్యవసాయం విషయంలో ధన సాయం చేయడానికి ముందుకు వచ్చారు. మరికొందరు వడ్డీ లేకుండా అప్పు ఇవ్వడానికి అంగీకరించారు. చెప్పినట్లుగానే మరుసటి రోజు నుంచే అవసరమైన వారికి సాయం చేయడం ప్రారంభించారు. ఆ సంవత్సరం సకాలంలో వర్షాలు పడటంతో.. పంటలు పండి రైతులకు మంచి లాభాలు వచ్చాయి. తీసుకున్న అప్పును కూడా గడువులోగా చెల్లించారు. ఇదిలా కొనసాగుతూనే ఉంది. ఆ గ్రామ ప్రజలు ఇక పక్క గ్రామాలకు అప్పు కోసం వెళ్లడం మానేశారు. కొన్ని సంవత్సరాల్లోనే అక్కడి రైతులు కూడా ఇతరులకు సాయం చేసే స్థాయికి వచ్చారు.

 ఇదిలా ఉండగా ఆ గ్రామంలో భూషయ్య ఒక్కడు మాత్రం ఎవ్వరికీ ఒక్క రూపాయి కూడా సాయపడలేదు. అతని దగ్గరకు వెళ్లి అడిగినా ప్రయోజనం లేకుండాపోయింది. పైగా ఆయనే ఆ ఊరిలో అందరి కంటే ధనవంతుడు కూడా. ఒకసారి వేసవికాలంలో ఆయన ఏదో పని మీద కాలినడకన పక్క గ్రామానికి బయలుదేరాడు. దారిలో అతనికి చాలా దాహం వేసింది. కానీ చుట్టు పక్కల ఎక్కడా కూడా నీటి జాడ కనిపించలేదు. గబగబా నడుచుకుంటూ గ్రామంలోకి వెళ్లి నీళ్లు తాగి.. తన దాహాన్ని తీర్చుకున్నాడు. ‘ఒక్కరోజు నడుచుకుంటూ వెళ్లినందుకే.. తాగడానికి నీళ్లు దొరక్క ఇబ్బందిపడ్డాను. పాపం రోజూ నడిచే వాళ్ల పరిస్థితి ఏంటో’ అని మనసులోనే అనుకోసాగాడు. ఇంతలోనే ఆ గ్రామ ప్రజలు వచ్చి.. ‘అయ్యా! అందరికీ అవసరమని భావించి.. మేమే కొంత డబ్బు జమ చేసుకొని, మంచి నీటి బావులు తవ్విస్తున్నాం. అయినా ఇంకా కొంత డబ్బు తక్కువ పడింది. మీరు కాస్త ఆర్థిక సాయం చేస్తే ఈ పని పూర్తవుతుంది. అప్పుడు పుష్కలంగా మంచినీరు లభిస్తుంది’ అన్నారు. అప్పుడు భూషయ్య వెంటనే స్పందించి.. ‘తప్పకుండా నేను సాయం చేస్తాను’ అని చెప్పి మొత్తం తన సొంత ఖర్చుతోనే బావులు తవ్వించాడు. తన గ్రామానికి తిరిగి వెళ్లాక.. గ్రామ పెద్దకు చెప్పి అక్కడ కూడా మంచి నీటి బావులు తవ్వించాడు. తనలో వచ్చిన మార్పునకు అక్కడి ప్రజలంతా ఎంతో సంతోషించారు.

మరొకసారి కుచేలపురానికి చెందిన కనకయ్య అదే దారిలో నడుస్తూ పొరుగు గ్రామానికి వెళ్లాడు. అక్కడికి చేరుకునేసరికి మధ్యాహ్నం కావడంతో అతనికి చాలా ఆకలి వేసింది. కానీ ఆ చుట్టు పక్కల అన్నసత్రాలేవి కనిపించలేదు. అతడు ఎవరికి ఎలాంటి సాయం చేయకపోయినా కూడా.. అక్కడి ప్రజలు తనకు ఆహారం పెట్టి ఆకలి తీర్చారు. అప్పుడే అతను.. రెండు గ్రామాల ప్రజలకు ఉపయోగపడేలా ఒక అన్నసత్రాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్లుగానే కొన్ని రోజుల్లోనే రెండు గ్రామాల మధ్యలో ఒక పెద్ద సత్రాన్ని కట్టించి.. ప్రతిరోజు అందులో అన్నదానం ఏర్పాటు చేశాడు. ఇక ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఎటు చూసినా.. కుచేలపురం గ్రామ ప్రజల గురించే మాట్లాడుకోసాగారు. ‘వేరే ప్రాంతానికి  చెందిన వారైనా.. అందరికీ ఉపయోగపడేలా నీటి బావులు, అన్నసత్రం ఏర్పాటు చేశారు. ఎలాంటి తేడాలు లేకుండా ఒకరికి.. ఒకరు ఎలా సహాయపడాలో తెలిసేలా చేశారు’ అని అందరూ మెచ్చుకోసాగారు. అలా కుచేలపురం గ్రామ ప్రజలు చుట్టుపక్కల గ్రామాల వారికి ఆదర్శంగా నిలిచారు.
- సంగనభట్ల చిన్న రామకిష్టయ్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు