సహజ రంగుల హోలీ.. సంతోషాల కేళి!

నీలేష్‌.. ‘హోలీ పండుగ వస్తోంది కదా! మనం సరదాగా రంగులతో ఆడుకుందామా?’ అడిగాడు హర్ష. ‘నాకు కూడా ఆడాలనే ఉంది. కానీ.. ఇంట్లో అమ్మానాన్న కోప్పడతారు. రంగులతో ఆడడం అంత మంచిది కాదు. చర్మవ్యాధులు వస్తాయి. జుట్టు పాడైపోతుందంటారు.

Updated : 23 Mar 2024 04:56 IST

నీలేష్‌.. ‘హోలీ పండుగ వస్తోంది కదా! మనం సరదాగా రంగులతో ఆడుకుందామా?’ అడిగాడు హర్ష. ‘నాకు కూడా ఆడాలనే ఉంది. కానీ.. ఇంట్లో అమ్మానాన్న కోప్పడతారు. రంగులతో ఆడడం అంత మంచిది కాదు. చర్మవ్యాధులు వస్తాయి. జుట్టు పాడైపోతుందంటారు.. ఏం చేయను?’ అన్నాడు నీలేష్‌. ఇంతలో హర్ష ఏదో అనేలోపే వర్ణిక, మల్లిక వచ్చి.. ‘ఏం మాట్లాడుకుంటున్నారు? మాకూ చెప్పొచ్చుగా’ అన్నారు. ‘మరేం లేదు.. హోలి పండుగ వస్తోంది కదా.. ఆ రోజు మనమంతా ఆడుకుందాం అంటున్నాడు హర్ష. రంగులాట అంటే మా ఇంట్లో కోప్పడతారు అని చెపుతున్నా. మీ ఇంట్లో ఒప్పుకుంటారా?’ అడిగాడు నీలేష్‌. ‘కొంచెం కష్టమే.. కానీ అలిగితే ఒప్పుకుంటారేమో’ నవ్వుతూ అంది వర్ణిక. ‘అవును! మా ఇంట్లో కూడా అంతే’ అని చెప్పింది మల్లిక. ఇంతలో టీచర్‌ రావడంతో మాటలు ఆపేశారంతా.

ఆ రోజు ఇంటికి వెళ్లాక అందరూ ఇంట్లో హోలీ ఆట గురించి అడిగారు. ‘రంగులు పూసుకోవడం.. కష్టపడి కడుక్కోవడం.. అల్లరి తప్ప ఏం ఉంది చూద్దాంలే’ అన్నారు అమ్మానాన్నలు. దాంతో పిల్లలకు కాస్త నిరాశగా అనిపించింది. అలా మరో రెండు రోజులు గడిచిపోయాయి. ఆ రోజు మమత టీచర్‌ సైన్సు పాఠం చెబుతున్నారు. కానీ కొంతమంది పిల్లలు సరిగ్గా పాఠం వినడంలేదు. దాంతో టీచర్‌.. ‘ఏంటి పిల్లలూ ఏమైంది? పాఠం వినడంలేదు’ అని ప్రశ్నించారు. ‘హోలీ గురించి..!’ అంటూ మధ్యలోనే ఆపేశాడు హర్ష. ‘దానికి ఇంకా రెండు రోజులు ఉంది కదా! సరే అయితే.. హోలీ రంగుల గురించే చెప్పనా, వింటారా?’ అన్నారు టీచర్‌. అప్పుడు పిల్లలంతా.. ‘చెప్పండి టీచర్‌’ అని ఒకేసారి బదులిచ్చారు.

 ‘రంగులంటే అందరికీ ఇష్టమే. అందుకే రంగు రంగుల పూలను చూసినా, పక్షులను చూసినా మనకు ఎంతో సంతోషం కలుగుతుంది. అంతెందుకు వర్షం ఆగిపోయాక.. ఆకాశంలో ఏర్పడే ఇంద్రధనుస్సును చూస్తే ఎంత సంతోషమో కదా. మరి అలాంటి రంగులతో ఆడే హోలీ పండుగ అంటే ఇష్టం ఉండడం సహజమే. అయితే హోలీ ఎవరికి, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడుకోవాలి. బయట రకరకాల రంగులు అమ్ముతారు. వాటిలో హానికరమైన రసాయనాలు కలుపుతారు. అవి శరీరానికి పూసుకుంటే జబ్బులు వచ్చే అవకాశం ఉంది. చర్మమంతా.. పొడిబారిపోతుంది. జుట్టు కూడా పాడవుతుంది. అందువల్ల రసాయనాలు కలిసిన రంగులు వాడకూడదు’ అని చెప్పారు టీచర్‌.

 ‘ఆ రంగులు లేకుండా మరెలా టీచర్‌?’ వెంటనే అడిగాడు నీలేష్‌. ప్రకృతిలో సహజంగా దొరికే వస్తువులతో రంగులు తయారు చేసుకోవాలి. బీట్‌రూట్‌, క్యారట్‌, టొమాటో వంటి కూరగాయల రసాలకు కొద్దిగా నీళ్లు కలిపి సీసాలో పోసుకుని వాడుకోవచ్చు. గులాబీ రేకులను ఎండబెట్టి, పొడి చేసుకుని వేడినీళ్లలో వేసి మరిగిస్తే మంచి రంగునీళ్లు తయారవుతాయి. మోదుగ పూలతో కూడా రంగు నీళ్లు చేసుకోవచ్చు. ఇలా ఎన్నో రకాలుగా సహజ రంగులు తయారుచేసుకోవచ్చు. వీటితో ఆడుకుంటే ఏ హానీ ఉండదు’ అంటూ వివరించారు టీచర్‌.
‘భలేగా ఉంది టీచర్‌.. మీరు చెప్పినట్లుగానే రంగులు తయారు చేసివ్వమని అమ్మకు చెబుతాను’ అన్నాడు నీలేష్‌. ‘నేను కూడా.. నేను కూడా’ అంటూ పిల్లలంతా గట్టిగా అరిచారు. ‘సహజ రంగులే అయినా ఆడేందుకు ఇష్టపడి వచ్చిన వారి మీదనే చల్లాలి. రోడ్డు మీద పనికి వెళ్లే వారి పైన చల్లి.. ఇబ్బంది పెట్టకూడదు. ముఖానికి రంగులు అస్సలు పూయకూడదు. కళ్లలో పడితే ఇంకా ప్రమాదం’ అని జాగ్రత్తలు చెప్పారు టీచర్‌. ఇంతలో ఇంటి గంట మోగడంతో టీచర్‌ లేచారు.. వెంటనే పిల్లలు కూడా బ్యాగులు అందుకుని బయలుదేరారు. నీలేష్‌ ఇంటికి చేరగానే అమ్మతో టీచర్‌ చెప్పిన సహజ రంగుల గురించి చెప్పాడు. అంతలోనే తనకు ఎదురుగా ఉన్న అల్మారాలో.. రంగురంగుల సీసాలేవో కనిపించాయి. గబగబా వెళ్లి.. తెరిచి చూసి, అమ్మ వైపు చూశాడు. దాంతో ఆమె చిన్నగా నవ్వుతూ.. ‘నీ కోసమే నాన్నా! సహజమైన రంగులతోనే తయారుచేశాను’ అంది. దాంతో ‘మా మంచి అమ్మా..!’ అంటూ ఆమెని చుట్టుకున్నాడు నీలేష్‌. ఈ విషయాన్ని మరుసటి రోజు స్కూల్లో స్నేహితులందరికీ చెప్పాడా అబ్బాయి. ఇక హోలీ పండుగ రోజు ఎంచక్కా అంతా కలిసి సంతోషంగా ఆడుకున్నారు.
- జె.శ్యామల


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని