పాయసం దొంగని పడదాం..!

ఒక దట్టమైన అడవిలో.. సెలయేరు తీరానికి కొంచెం దూరంలో ఒక పెద్ద మర్రిచెట్టు ఉంది. దాని కిందున్న బొరియలో హరితం అనే కుందేలు నివాసం ఉంటుంది.

Updated : 24 Mar 2024 05:03 IST

క దట్టమైన అడవిలో.. సెలయేరు తీరానికి కొంచెం దూరంలో ఒక పెద్ద మర్రిచెట్టు ఉంది. దాని కిందున్న బొరియలో హరితం అనే కుందేలు నివాసం ఉంటుంది. దానికి ఎలుగుబంటితో మంచి స్నేహం ఉంది. ఎటూ వెళ్లినా రెండూ.. కలిసే వెళ్తాయి. ఒకరోజు హరితానికి పాయసం తినాలనిపించింది. అదే విషయాన్ని ఎలుగుతో చెప్పింది. ఇంతకీ పాయసానికి కావలసినవేంటో నీకు తెలుసా?’ అని అడిగిందది. ‘ఓ.. తెలుసు! పాలు, బెల్లం, బియ్యం’ అని బదులిచ్చింది హరితం. ‘మన అడవికి తూర్పు దిశలో కొంత దూరం నడుచుకుంటూ వెళ్తే.. ఒక పాల వ్యాపారి ఇల్లు ఉంది. అక్కడ నుంచి నేను పాలు తీసుకొస్తాను’ అంది ఎలుగు. ‘అడవికి పశ్చిమ దిశలో బెల్లం కొట్టుంది. నేను అక్కడికి వెళ్లి బెల్లం తీసుకొస్తాను’ అంది హరితం. ‘అయితే నేను బియ్యం తీసుకొస్తాను’ అంది అప్పుడే అక్కడికి వచ్చిన ఒక నక్క. దాంతో హరితం, ఎలుగు ఆశ్చర్యంగా చూశాయి. అప్పుడది.. ‘నేను ఈ అడవికి కొత్త. ఇటుగా వస్తుంటే మీ మాటలు వినిపించాయి. నాకూ పాయసం తినాలనిపించింది. మీతో కలిస్తే నేనూ తినొచ్చు కదా?’ అంది. ‘కానీ నువ్వు అసలే అడవికి కొత్త.. నిన్ను ఎలా నమ్మేది?’ అంది హరితం. ‘ఇందులో నమ్మడానికేముంది? ముగ్గురం మూడు వస్తువులు తీసుకువచ్చి పాయసం చేసుకుని.. మూడు భాగాలుగా విభజించుకొని తినేద్దాం. నచ్చితే ఇక ముందు ముగ్గురం కలిసే ఉండొచ్చు. నచ్చకపోతే మీ దారి మీది, నా దారి నాది’ అందా నక్క. ఆ మాటలతో హరితం, ఎలుగు కూడా అంగీకరించాయి.

ఎలుగు, హరితం అనుకున్న ప్రకారం బెల్లం, పాలు తెచ్చాయి. నక్క అడవి పక్కన ఉన్న మిల్లులో నుంచి బియ్యం తెచ్చింది. మూడు కలిసి పొయ్యిని ఏర్పాటు చేసుకున్నాయి. హరితం.. ఒక కుండలో పాలు, నీళ్లు కలిపి దాని మీద పెట్టింది. నక్క.. పుల్లలు, ఎండుటాకులు తెచ్చి పొయ్యిలో వేసింది. ఎలుగు.. రెండు చెకుముకి రాళ్లు తెచ్చి నిప్పు రాజేసింది. కాసేపట్లోనే కమ్మటి పాయసం సిద్ధమైంది. ‘వంట చేసి అలసిపోయాం కదా! చెరువు దగ్గరకు వెళ్లి స్నానం చేసి.. వచ్చి ప్రశాంతంగా తినేద్దాం’ అంది హరితం. అలాగేనంటూ.. మూడూ చెరువుకు బయలుదేరాయి. ముందుగా స్నానం చేసి.. పాయసం కుండ దగ్గరకు వచ్చింది హరితం. అంతలో ఎలుగు కూడా అక్కడికి వచ్చి.. ‘మనం తినడం ప్రారంభిద్దాం’ అంది. ‘మన కొత్త నేస్తాన్ని కూడా రానివ్వు’ అంది హరితం. ‘అయితే అది వచ్చే లోపు పాయసం కుండను కిందకు దింపుదాం’ అనుకుంటూ కుండ దగ్గరకు వెళ్లాయవి. కానీ దాంట్లో పాయసం లేదు.. ‘ఇదేంటి ఎవరు తినేశారు.. నువ్వా? నువ్వా?’ అంటూ రెండూ ప్రశ్నించుకున్నాయి. ఇంతలోనే అక్కడికి నక్క వచ్చి.. ‘పాయసం తిందామా?’ అంది. అప్పుడు హరితం దానికి ఖాళీ కుండను చూపించింది. ‘నాకు పెట్టకుండా మీరే తినేశారా?’ అంది నక్క. ‘మేము తినలేదు.. కానీ ఎవరు తిన్నారో తెలియడం లేదు’ ఆలోచిస్తూ అంది ఎలుగు. ‘ఆ పాయసం దొంగను నేను పట్టుకుంటాను’ అంది హరితం. ‘ఎలాగా?’ అని అడిగింది నక్క.

‘నాతో రండి’ అంటూ ఖాళీ పాయసం కుండ పట్టుకుని చెరువు దగ్గరకు నడిచింది హరితం. కుండను అందులో బోర్లించి.. ‘మనం వరసగా కుండ మీదకు ఎగిరి.. దాని మీద కూర్చొని నేను పాయసం తినలేదు అనాలి. తినకపోతే ఏమీ జరగదు. అబద్ధం చెప్పిన వారిని కుండ నీటిలో ముంచేస్తుంది. ముందు నేను కూర్చుంటాను’ అంటూ ఎగిరి కుండ మీద కూర్చుందది. కుండ కదలకుండా అలాగే ఉంది. తర్వాత ‘ఇప్పుడు నక్క వంతు’ అంది హరితం. అప్పుడది ‘నాకు చాలా భయంగా ఉంది. నేను కుండ మీదకు ఎగరను’ అంటూ భయపడసాగింది. ‘నువ్వేం భయపడకు.. తప్పు చేసిన వారినే కుండ ముంచేస్తుంది’ అంది హరితం. ఇక చేసేదేం లేక.. ‘నన్ను క్షమించండి నేస్తాలు! మీరు స్నానానికి వెళ్లినప్పుడు పాయసం మొత్తం నేనే తినేశాను. ఇంకెప్పుడూ అలా చేయను’ అని ప్రాధేయపడింది నక్క. ‘నీతో మాకు స్నేహం వద్దు. నువ్వు ఇంకెప్పుడూ మా దగ్గరకు రావద్దు’ అన్నాయి ఎలుగు, హరితం. దాంతో అక్కడి నుంచి వెళ్లిపోయిందా నక్క.

‘హరితం! నిజంగా పాయసం కుండ దొంగను పట్టిస్తుందా?’ అడిగింది ఎలుగు. ‘అదేం లేదు.. నాకు నక్క మూతికి ఉన్న పాయసం మెతుకులు కనిపించాయి. దాని నోటితోనే నిజం చెప్పించాలని ఇలా చేశాను. అంతే కానీ ఎక్కడైనా కుండ నిజం చెప్పిస్తుందా?’ అని బదులిచ్చింది హరితం. ‘మరి నేను దూకితే కుండ పగిలిపోయేది, అప్పుడేం చేసేదానివి?’ అడిగింది ఎలుగు. అందుకేగా ముందు నేను దూకాను. తర్వాత నక్కను దూకమని చెప్పాను. అది ఎలాగూ అంత ధైర్యం చేయదని నాకు ముందే తెలుసు. నిజాయతీకి ఉన్న బలం అబద్ధానికి ఉండదు’ అంది హరితం. దాని తెలివి తేటలకు ఎలుగు ఎంతగానో మురిసిపోయింది.

కె.వి. సుమలత


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని