మంచి చేసిన ముసుగు మనిషి!

కుంతల దేశాన్ని రాజశేఖరుడు పాలించేవాడు. అతని కుమారుడు ప్రభాకరుడు. పార్వతీపురంలోని గురుకుల పాఠశాలను సుధాముడు నడిపిస్తున్నాడు. సకల విద్యలూ అభ్యసించాలని ప్రభాకరుడు, మంత్రి కుమారుడు విజయుడు, సైన్యాధికారి కుమారుడు కేశవుడు ఆ గురుకులంలో చేరారు.

Published : 25 Mar 2024 00:02 IST

కుంతల దేశాన్ని రాజశేఖరుడు పాలించేవాడు. అతని కుమారుడు ప్రభాకరుడు. పార్వతీపురంలోని గురుకుల పాఠశాలను సుధాముడు నడిపిస్తున్నాడు. సకల విద్యలూ అభ్యసించాలని ప్రభాకరుడు, మంత్రి కుమారుడు విజయుడు, సైన్యాధికారి కుమారుడు కేశవుడు ఆ గురుకులంలో చేరారు. సుమారు అయిదు సంవత్సరాలు గడిచాయి. ‘మిత్రులారా!.. మనం నేర్చుకున్న చదువులు, యుద్ధ విద్యలు చాలు.. ముగ్గురం ఒక్కటిగా ఉంటే విజయమే వరిస్తుంది’ అని విజయుణ్ని, కేశవుణ్ని ఒప్పించాడు ప్రభాకరుడు.

‘గురువుగారూ..! మేము నేర్చుకున్నది చాలు... మాకు సెలవు ఇప్పించండి’ అన్నాడు ప్రభాకరుడు. ‘యువరాజా! మీ విద్యలింకా పూర్తి కాలేదు.. పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలి.. అందుకు ఇంకా మూడు సంవత్సరాలు పడుతుంది. మీరు ఈ సమయంలో వెళ్లిపోతే నాకు చెడ్డ పేరు వస్తుంది’ అన్నాడు సుధాముడు. అన్ని విద్యల్లో ముందుండే రామయ్య ఇదంతా గమనించి.. ‘అవును యువరాజా! గురువుగారు చెప్పింది నిజమే మరొక్కమారు ఆలోచించండి’ అని అన్నాడు. ‘రామయ్యా! ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను... గురువుగారు మీకు మాట రాకుండా నేను చూసుకుంటాను.. మా ముగ్గుర్నీ ఆశీర్వదించండి’ అన్నాడు ప్రభాకరుడు. ‘మీ ఇష్టం నాయనా! క్షేమంగా వెళ్లండి’ అన్నాడు సుధాముడు అయిష్టంగానే! గురువు బాధను గమనించాడు రామయ్య.

ముగ్గురూ గుర్రాల మీద బయలుదేరారు. ఒకచోట బడలిక తీర్చుకోవడానికి ఆగి, పండ్లు ఆరగిస్తుండగా ఒక ముసుగు దొంగ వారి ఎదురుగా నిలిచి... ‘మీ దగ్గర ఉన్న విలువైన సొమ్మును ఇవ్వండి. లేకపోతే మీ ప్రాణాలు తీస్తాను’ అన్నాడు. ‘నేనెవరో తెలుసా? ఈ దేశం యువరాజును. నువ్వు ఒక్కడివే, మేం ముగ్గురం’ అని కత్తి దూశాడు ప్రభాకరుడు. కాసేపటికి విజయుడు, కేశవుడు కూడా కత్తులు తీశారు. ముగ్గుర్నీ కత్తి యుద్ధంలో ఓడించి, తన చేతిలో ఉన్న తాడుతో వారిని ఒక చెట్టుకు కట్టివేసి ‘మీకు యుద్ధ విద్య నేర్పిన గురువు ఎవరు? మిమ్ములను మీరు కాపాడుకోలేరు.. ఇక ప్రజలను ఎలా కాపాడగలరు?’ అన్నాడు ముసుగు మనిషి. 

‘మన గురుకులం గురించి చెప్పకపోతే ప్రాణాలు తీసేలా ఉన్నాడు’ అని వివరాలు చెప్పాడు విజయుడు. ‘పదండి మీ గురుకులానికి చేరుస్తాను’ అని తాడును తొలగించి యువరాజును తన గుర్రం మీద ముందర కూర్చోబెట్టుకుని, ‘మీ ఇద్దరూ గుర్రాల మీద ముందు వెళుతూ నాకు దారి చూపించండి’ అన్నాడు ముసుగు మనిషి. గురుకులం చేరుకుని.. ‘మీరేం గురువుగారు...?! ముగ్గురూ కలసి నన్ను ఎదుర్కోలేకపోయారు. ఇది మీకు తలవంపులు కాదా? శిక్షణ పూర్తి చేసుకున్న తరువాతనే బయటకు పంపండి’ అని వెళ్లిపోయాడు ముసుగు మనిషి.

‘గురువుగారూ.. ఎవరైనా సొమ్ము దోచుకుని లేదా గాయపరచి వెళ్లిపోతారు. విచిత్రంగా గురుకులంలో యుద్ధ విద్యలు పూర్తి చేసుకోలేదా? అని ఇక్కడకు భద్రంగా తీసుకువచ్చి వెళ్లిపోయాడు ఆ ముసుగు దొంగ’ అన్నాడు విజయుడు. కాసేపటికి రామయ్య వచ్చి.. ‘మిత్రులారా! ఏంటి తిరిగి వచ్చారు’ అన్నాడు. ‘గురువుగారు క్షమించండి! మమ్ములను మేము కాపాడుకోలేకపోయాం. చదువుతోపాటు అన్ని యుద్ధ విద్యలూ పూర్తి చేసుకుని గానీ ఇక్కడ నుంచి వెళ్లం’ అన్నాడు ప్రభాకరుడు. ‘అలాగే నాయనా!’ అన్నాడు సుధాముడు.

కాసేపటి తర్వాత రామయ్య తన సంచిలో నుంచి నల్లటి దుస్తులు తీసి పెట్టెలో పెడుతుండగా సుధాముడు చూసి... ‘ఇదంతా నువ్వే చేశావని నాకు తెలుసు’ అన్నాడు. ‘మీ బాధ చూడలేక అలా చేశాను... నన్ను క్షమించండి గురువు గారూ..’ అన్నాడు రామయ్య. ‘గురుకులం గౌరవాన్ని కాపాడావు’ అని రామయ్యను మెచ్చుకున్నాడు సుధాముడు.

మూడు సంవత్సరాలు గడిచాయి.. ప్రభాకరుడు, విజయుడు, కేశవుడు సకల విద్యలను పూర్తి చేసుకుని గురువు పెట్టిన అన్ని పరీక్షల్లోనూ ఉత్తీర్ణులయ్యారు. ‘ఆ రోజు ముసుగు దొంగ మమ్మల్ని అడ్డగించక పోయి ఉంటే మేము ఈ రోజు అన్ని విద్యలనూ పూర్తి చేసి ఉండేవారం కాదు’ అన్నాడు ప్రభాకరుడు. సుధాముడు, రామయ్య వైపు చూశాడు. ‘క్షమించండి యువరాజా! ఆ రోజు ముసుగు మనిషి రూపంలో అడ్డగించింది నేనే’ అన్నాడు రామయ్య. ముగ్గురూ నివ్వెరపోయారు. ‘సింహాసనం అధిష్ఠించాక ప్రజల సమస్యలను తెలుసుకుని చక్కని పాలనను అందించడానికే సమయం సరిపోతుంది. అప్పుడు విద్యలు నేర్చుకునే అవకాశం దొరకదు. అందుకే ఏ విద్యనైనా పూర్తిగా అభ్యసించి, గురుకులంలో పెట్టిన పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలి. ఇది నియమం’ అన్నాడు సుధాముడు.

‘రామయ్యా! తెలివిగా మాకు బుద్ధి చెప్పావు. నీలాంటి వ్యక్తి మా కోటలో ఉండాలి. రాజుగారికి చెప్పి కొలువు ఇప్పిస్తాను’ అన్నాడు ప్రభాకరుడు. ‘సంతోషం యువరాజా!’ అన్నాడు రామయ్య. ‘గురువుగారూ.. వెళ్లివస్తాం’ అని పాదాభివందనం చేశారు ప్రభాకరుడు, విజయుడు, కేశవుడు. ‘ఇప్పుడు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను వెళ్లిరండి’ అన్నాడు సుధాముడు.

యు.విజయశేఖర రెడ్డి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని