చిన్న ఉద్యోగి చేసిన పెద్ద మేలు!

పూర్వం శోణగిరి అనే చిన్న రాజ్యాన్ని విష్ణువర్ధనుడనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఆయనకు ఇరుగు పొరుగు రాజ్యాల మీద దండెత్తి తన రాజ్యాన్ని విస్తరించుకోవాలని కోరిక ఉండేది కాదు.

Updated : 26 Mar 2024 05:21 IST

పూర్వం శోణగిరి అనే చిన్న రాజ్యాన్ని విష్ణువర్ధనుడనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఆయనకు ఇరుగు పొరుగు రాజ్యాల మీద దండెత్తి తన రాజ్యాన్ని విస్తరించుకోవాలని కోరిక ఉండేది కాదు. అలానే తన రాజ్యం మీదకు ఎవరో దండెత్తి వస్తారనే భయమూ ఉండేది లేదు. ఉన్నంతలో తృప్తిపడుతూ రాజ్యాన్ని చక్కగా పరిపాలించుకునేవాడు. అయితే ఆయన మంచి హాస్య ప్రియుడు. తన పనుల్లో ఎంత తీరిక లేకుండా ఉన్నప్పటికీ ఆస్థాన విదూషకుడితో కాసేపయినా హాస్య సంభాషణలు కొనసాగించేవాడు.

ఇలా కాలం గడుస్తుండగా పొరుగు రాజు నాగసేనుడు హఠాత్తుగా శోణగిరి మీద దాడి చేశాడు. ఇది విష్ణువర్ధనునికి ఊహించని సంఘటన. అప్రమత్తంగా లేకపోవడంతో పరాజయం తప్పలేదు. తన కుటుంబసభ్యులతో విష్ణువర్ధనుడు అరణ్యంలోకి వెళ్లి రహస్య స్థావరంలో కాలం గడపసాగాడు. విదూషకుడు ఆలస్యం చేయకుండా నాగసేనుని కలుసుకుని.. ‘ప్రభూ! మీ గొప్పతనం ఇంతకాలం వింటూ వచ్చాను. ఇప్పుడు మీ కొలువులో పని చేయాలని అనుకుంటున్నాను’ అన్నాడు. విదూషకుడి వాక్చాతుర్యం గురించి అంతకు ముందే విని ఉండడం వల్ల నాగసేనుడు సరేనన్నాడు. సభికులందరూ విదూషకుణ్ని పచ్చి అవకాశవాదని అనుకున్నారు.

నాగసేనుడికి పదేళ్ల కొడుకున్నాడు. ఆ పిల్లాడు ఎప్పుడూ ఒంటరిగా ఉంటాడు. ఎవ్వరితోనూ మాట్లాడడానికి ఇష్టపడడు. ఏదో పోగొట్టుకున్నవాడిలా దిగులుగా కనిపిస్తూ ఉంటాడు. చిన్నప్పటి నుంచి అదే తంతు. ఆస్థాన వైద్యులిచ్చిన మందులు వాడినా.. లాభం లేకపోయింది. ఒకరోజు నాగసేనుడు విదూషకుడితో తన బాధను పంచుకున్నాడు. అప్పుడతను.. ‘మీరు మందులు వాడడం కొనసాగించండి. నా పద్ధతిలో నేను మార్పు కోసం ప్రయత్నిస్తాను. మూడు నెలల్లో యువరాజు మామూలు మనిషయ్యేటట్టు చేస్తాను’ అని రాజుకు ధైర్యం చెప్పాడు. అప్పటి నుంచి పిల్లాడిని తనతోనే తిప్పుతూ, తమాషాగా మాట్లాడుతూ నవ్వు తెప్పించే కథలు చెబుతూ ఆకట్టుకున్నాడు. మొదట్లో ముభావంగా ఉన్నా పిల్లాడు క్రమంగా విదూషకుని మాటలకు నవ్వడం, సరదాగా మాట్లాడడం ప్రారంభించాడు. మూడు నెలలు గడిచేసరికి మామూలు మనిషయిపోయి, అంతఃపురంలో అందరితో కలివిడిగా ఉండడం ప్రారంభించాడు. ఇక నాగసేనుడి ఆనందం అంతా ఇంతా కాదు. ‘విదూషకుడంటే మాటలతో ఆనందం కలిగించేవాడనే విన్నాను. కానీ నువ్వు వైద్యం చేసి.. నా కొడుకుకి ఆరోగ్యాన్ని ఇచ్చావు. నీకేం కావాలో కోరుకో, ఇస్తాను’ అన్నాడు రాజు. ‘వద్దు ప్రభూ! నా కోరిక మీరు తీర్చలేరు’ అన్నాడు విదూషకుడు. ‘సందేహం వద్దు.. నీ కోరిక ఎంత పెద్దదయినా తీరుస్తాను. మాట తప్పడం నాకు తెలియదు’ అన్నాడు నాగసేనుడు. ‘ప్రభూ! చీమకు కూడా అపకారం తలపెట్టనివాడు విష్ణువర్థనులవారు. ఆయన రాజ్యాన్ని తిరిగి ఇచ్చేయండి. ఇదే నా కోరిక’ అన్నాడు విదూషకుడు. క్షణం ఆలోచించిన నాగసేనుడు.. ‘సరే అలాగే ఇచ్చేస్తాను. నీ స్వామిభక్తి నాకు నచ్చింది. నీలాంటివాడి అభిమానం పొందిన విష్ణువర్ధనుడు ఎంతో అదృష్టవంతుడు’ అన్నాడు.
తర్వాత అడవికి వెళ్లి విష్ణువర్ధనుడి రహస్య స్థావరం కనుక్కొని సాదరంగా తీసుకువచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి, విదూషకునితో.. ‘మీలాంటి స్వామిభక్తి కలిగినవారు అరుదు. అప్పుడప్పుడు మీరు మా రాజ్యానికి కూడా వచ్చి మమ్మల్ని ఆనందింపజేస్తూ ఉండాలి’ అన్నాడు నాగసేనుడు. దానికి విదూషకుడు సంతోషంగా తలూపాడు. నాగసేనునికి, విష్ణువర్ధనుడు కృతజ్ఞతలు తెలియజేశాడు. అనంతరం మంత్రి సుబుద్ధి విదూషకునితో.. ‘నువ్వు పచ్చి అవకాశవాదివని అందరం అపార్థం చేసుకున్నాం. మమ్మల్ని క్షమించు’ అన్నాడు.
‘మనకు నీడనిస్తున్న చెట్టు ఎండిపోబోతున్నపుడు మనకెందుకులే అనుకోకూడదు. వీలున్నంతలో దాని సంరక్షణకు నడుం బిగించాలి. ఇంతకాలం నన్ను ఆదరించిన విష్ణువర్ధనుని రుణం తీర్చుకోవాలనుకున్నాను. అందుకే నాగసేనుడి కొలువులో చేరి ఏదో ఒక విధంగా ఆయన మెప్పు పొంది తిరిగి మన రాజుకు రాజ్యం వచ్చేటట్లు చేయాలనుకున్నాను. చిన్న ఉద్యోగినయినా పెద్ద పనే పెట్టుకున్నాను. అదృష్టవశాత్తూ అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకున్నాను. యువరాజు అన్న గొప్పభావనతో అంతఃపురంలో ఎవరూ చనువుగా ఉండకపోవడంతో అతను ఒంటరితనంతో బాధపడుతున్నాడని గ్రహించాను. అతనితో చనువుగా ఉంటూ సరదాగా మాట్లాడుతూ మార్పు వచ్చేటట్లు చేశాను. ఇది నాకు అనుకోని అవకాశం. దీనివల్ల నేను అనుకున్న పని త్వరగా పూర్తయ్యింది’ అన్నాడు. విష్ణువర్ధనుడు విదూషకుని ఆలింగనం చేసుకుని తన ఆంతరంగికుడుగా చేసుకున్నాడు.

డా.గంగిశెట్టి శివకుమార్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని