చెట్టు గెలిచింది.. మృగరాజు మారింది..!

రామాపురం ఊరి చివర ఒక పెద్ద అడవి ఉంది. ఒకరోజు అందులోకి నలుగురు మనుషులు గొడ్డళ్లు, చెట్లను కోసే యంత్రాలు పట్టుకొని వచ్చారు. నేరుగా అడవికి రాజు అయిన సింహం దగ్గరకు వెళ్లి.. ‘ఇక్కడున్న చెట్లను నరకడం కోసం మీ అనుమతి కావాలి.

Updated : 27 Mar 2024 04:41 IST

రామాపురం ఊరి చివర ఒక పెద్ద అడవి ఉంది. ఒకరోజు అందులోకి నలుగురు మనుషులు గొడ్డళ్లు, చెట్లను కోసే యంత్రాలు పట్టుకొని వచ్చారు. నేరుగా అడవికి రాజు అయిన సింహం దగ్గరకు వెళ్లి.. ‘ఇక్కడున్న చెట్లను నరకడం కోసం మీ అనుమతి కావాలి. దానికి బదులుగా మీకు, మీ సహచర జంతువులకు రోజూ ఓ జంతువు మాంసాన్ని ఇస్తాం’ అన్నారు. ఆ మాటలు విని ఏ మాత్రం ఆలోచించకుండా ‘అలా అయితే.. సరే’ అని చెప్పింది సింహం. ఇక సింహాలు, పులుల భయం లేకపోవడంతో ఆ రోజు నుంచే చెట్లను నరకడం ప్రారంభించారు. అడవంతా గొడ్డళ్లు, యంత్రాల శబ్దాలతో మారు మోగిపోతుంది. నివాసం కోల్పోయిన పక్షులు, జంతువులు ఆక్రందనలు చేయసాగాయి. ఇవేమీ పట్టని సింహం.. దాని సహచర జంతువులు, కష్టపడకుండా నోటి దగ్గరకు వస్తున్న మాంసం తింటూ ఆనందంగా ఉన్నాయి.

మిగిలిన చిన్న జంతువులన్నీ సమూహంగా ఏర్పడి అడవిలో జరుగుతున్న దారుణం గురించి సింహానికి వివరించాయి. మాంసాన్ని ఆస్వాదిస్తున్న సింహం.. ‘వాళ్లు నా అనుమతి తీసుకునే చెట్లను నరుకుతున్నారు. కొన్ని రోజులు గడిస్తే.. కొత్త చెట్లు పెరుగుతాయి కదా! ఇంకెప్పుడూ ఈ విషయం గురించి నన్ను అడగకండి’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చింది. బాధ్యతను విస్మరించిన సింహం సమాధానానికి జంతువులు నివ్వెరపోయాయి. ‘మృగరాజా! చెట్లను ఇలా నరుక్కుంటూ పోతే.. కొన్ని రోజుల తర్వాత ఈ అడవిలో ఒక్క జీవి కూడా ఉండలేదు.. అసలు అడవే ఉండదు. చివరకు మీరూ ఉండరు’ అన్నది ఓ కోతి. దాని మాటలు పట్టించుకోని సింహం.. మాంసం తినడంలో నిమగ్నమైంది. దాంతో జంతువులన్నీ తీవ్ర ఆగ్రహంతో దాని మీద పెద్దగా అరవడం మొదలుపెట్టాయి. అప్పుడు సింహం తినడం ఆపి.. ‘చెట్లను నరుక్కోమని మనుషులకు అనుమతి ఇచ్చాను. ఈ ఒక్కసారికి వాళ్లకు అడవిని అప్పగిద్దాం. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటాలే’ అంది. ‘మరోసారి మనుషులను అడవిలోకి రానివ్వనని చెప్పడం బాగానే ఉంది. కానీ అప్పటి వరకూ అసలు అడవి ఉంటేనే కదా! ఇప్పటికే పావు వంతు వనాన్ని నాశనం చేశారు. మరో నాలుగు రోజుల్లో అడవి మొత్తం కనుమరుగైపోతుంది. అడవిని క్షేమంగా చూడలేని.. మీకు రాజుగా ఉండే అర్హత లేదు. మళ్లీ ఎన్నికలు నిర్వహించి, ఇంకో రాజును ఎన్నుకుంటాం. మీకు పోటీగా చెట్టును నిలబెడతాం’ అంది కోతి.

దాని మాటలను అక్కడున్న జంతువులన్నీ అంగీకరించాయి. తనకు తప్ప వేరే వాటికి గెలిచే అవకాశం లేదన్న ధీమాతో సింహం కూడా సరేనంది. తనకే.. మద్దతు ఇవ్వాలని అడవంతా ప్రచారం చేసింది. గెలిపిస్తే.. పులులకూ అది తినే ఆహారంలో వాటా ఇస్తానని హామీ ఇచ్చింది. ఒకవేళ దానికి ఓటు వేయకపోతే.. చంపేస్తానని బెదిరించింది కూడా.. అయినా ఏ జంతువూ దాని ప్రలోభాలకు లొంగలేదు. అప్పుడు సింహానికి దాని ఓటమి ఖాయమని అర్థమైంది. మరుసటి రోజు ఉదయాన్నే ఎన్నికలు ప్రారంభమయ్యాయి. మృగరాజుకు మద్దతుగా కొన్ని సింహాలు, పులులు, చిరుతలు మాత్రమే చేతులెత్తాయి. మిగతా జంతువులు, పక్షులన్నీ చెట్టుకు మద్దతుగా నిలిచాయి. అనుకున్నట్లుగానే.. భారీ తేడాతో సింహం ఓడిపోయింది, చెట్టు గెలిచింది.

అవమాన భారంతో సింహం అడవి వదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. చెట్లు లేకపోతే జరిగే అనర్థాల గురించి సింహానికి అర్థమయ్యేలా వివరించింది జింక. అడవిని వదిలి వెళ్లాల్సిన అవసరం లేదని జంతువులన్నీ వారించడంతో అక్కడే ఉండిపోయిందది. ‘చెట్లు నా ఆహారం కాదు కదా.. అని తెలివి తక్కువగా ఆలోచన చేశాను. అవి లేకపోతే నాకు కూడా ఆహారం దొరకదని గ్రహించలేకపోయాను. నన్ను క్షమించండి’ అంటూ సింహం పశ్చాత్తాపపడింది. అది చేసిన తప్పును తెలుసుకున్నందుకు చెట్లతో సహా.. మిగతా జీవులన్నీ సంతోషించాయి.

ఇక అప్పుడు సింహం.. వెంటనే అడవిని వదిలిపెట్టి వెళ్లిపోవాలని మనుషులను హెచ్చరించింది. ఇంతలో ఓ గబ్బిలం ఎగురుకుంటూ వచ్చి.. ‘నేను పక్కనే ఉన్న అడవిలో ఉంటాను. మనుషులు చెట్లు నరకడం వల్ల అడవంతా నాశనం అయ్యింది. నివాసం కోసం ఇక్కడికి వచ్చాను’ అంది. ‘మనం ఇప్పుడు నిర్లక్ష్యం చేసి ఉంటే.. ఈ గబ్బిలానికి వచ్చిన పరిస్థితే.. మనకూ వచ్చేది’ అంది కోతి. ‘అవును! ఇక నుంచి మనమంతా జాగ్రత్తగా ఉందాం. ఎవ్వరినీ చెట్లు నరకడానికి మన అడవిలోకి రానివ్వొద్దు’ అన్నాయి మిగతా జీవులన్నీ. ఇక అప్పటి నుంచి అడవిలోని జంతువులు, పక్షులు ఆనందంగా జీవించసాగాయి.  

వడ్డేపల్లి వెంకటేష్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని