మంచి మనసున్న మారాజు రామాచారి!

రామాపురం కృష్ణాపురం ఇరుగు పొరుగు గ్రామాలు. రామాపురంలో రామాచారి, కృష్ణాపురంలో కృష్ణాచారి ఆయుర్వేద వైద్యంలో ప్రసిద్ధులు. ఇద్దరూ వైద్య రంగంలో నిష్ణాతులే!

Published : 28 Mar 2024 00:18 IST

రామాపురం కృష్ణాపురం ఇరుగు పొరుగు గ్రామాలు. రామాపురంలో రామాచారి, కృష్ణాపురంలో కృష్ణాచారి ఆయుర్వేద వైద్యంలో ప్రసిద్ధులు. ఇద్దరూ వైద్య రంగంలో నిష్ణాతులే! రామాచారి వైద్యం ప్రజలకు పూర్తి ఉచితం! ఎవరి దగ్గరా ఒక్క నయా పైసా కూడా ఆయన ఆశించేవాడు కాదు. అడవి నుంచి మూలికలు తేవడానికి, గుళికల తయారీకి తన సొంత ధనం ఖర్చవుతూ ఉండేది. అయినా అతడు బాధపడేవాడు కాదు. రోగుల్ని ఒక్క రూపాయి కూడా అడిగేవాడు కాదు. వైద్యం దైవంతో సమానమని, వైద్యుడు దేవుడిలాంటి వాడని ఆయన చాలా గట్టిగా నమ్మేవాడు. ఇంకా ధనం కోసం చేసేది వైద్యం కాదని.. శత్రువుకు అయినా సరే ప్రాణం మీదకు వస్తే వైద్యం చెయ్యాలని.. అదే గొప్ప ధర్మమని తన తండ్రి చెప్పిన మాటలు తు.చ. తప్పకుండా పాటించేవాడు.

ప్రజలే రామాచారి మంచితనం, గొప్ప గుణం చూసి వైద్యం చేయించుకున్న తర్వాత.. ఒక్క రూపాయి కానుకగా ఆయన ముందుంచేవారు. అవి కూడా ఆయన నిరాకరించేవాడు. ప్రజలంతా ఆ కానుకను తీసుకొని తీరాల్సిందే అని గట్టిగా పట్టుపట్టేసరికి అయిష్టంగా స్వీకరించేవాడు. చాలా మంది రోగులు చిన్న చిన్న అనారోగ్యాలకు కూడా ఆయన ఇంటి ముందు బారులు తీరేవారు. అలా చాలా ధనం సమకూరేది. దాన్ని కూడా ఆయన మెరుగైన వైద్య సేవలకే ఉపయోగించేవాడు.. కానీ తన స్వార్థానికి దాచుకునేవాడు కాదు.

 రామాచారికి పూర్తి విరుద్ధం కృష్ణాచారి. ఆయన వైద్యం చేయడానికి ముందే తన ముందు పైకం పెట్టకపోతే అసలు వైద్యమే మొదలుపెట్టేవాడు కాదు. కొద్దిమంది ధనవంతులు మాత్రమే ఆయన దగ్గర వైద్యం చేయించుకునేవారు. కృష్ణాపురం నుంచి కూడా పేదలు రామాచారి వద్దకే వైద్యానికి వెళ్లేవారు. ‘మంచి మనసున్న మారాజు రామాచారి’ అని రెండు గ్రామాల్లో రామాచారి పేరు మారుమోగేది. ఇలా ఉండగా ఒకసారి కృష్ణాచారి అనారోగ్యం పాలయ్యాడు. తన మందులే తిని మళ్లీ ఆరోగ్యవంతుడయ్యాడు. ఆయన అస్వస్థత విషయం తెలిసి కూడా గ్రామంలో ఏ ఒక్కరూ పరామర్శించలేదు. కనీసం.. ‘మీరెలా ఉన్నారు? మీ ఆరోగ్యం ఎలా ఉంది?’ అని కూడా అడగలేదు. అందుకు ఆయన చాలా బాధపడ్డాడు. ఒకరోజు ఎవరికో వైద్యం చేస్తుండగా అకస్మాత్తుగా రామాచారి స్పృహ కోల్పోయి, కిందపడిపోయాడు. దేవుడిలా భావించే.. తనకు అలా జరగడం చూసి తట్టుకోలేకపోయారు గ్రామస్థులు. వెంటనే గుర్రపు బండి కట్టించుకొని ఆగమేఘాల మీద ఆయన్ని కృష్ణాపురం తీసుకుపోయారు.

 ఆ బండి వెనకే పరుగులు పెడుతూ ఊరు ఊరంతా తరలివెళ్లింది. వరదలా తన ఇంటి ముందుకు కదిలి వచ్చిన జనాన్ని చూసి కృష్ణాచారి అవాక్కయ్యాడు. అతను డబ్బు మనిషి అని తెలిసిన ప్రజలు తమ వంతు ఒక్కొక్క రూపాయి చొప్పున ఆయన ముందు ఉంచారు. అవే పెద్ద గుట్టయ్యాయి. ‘అయ్యా.. ఈ ధనమంతా తీసుకొని మీరు మా దేవుణ్ని కాపాడండి. మీకు ఈ ధనం చాలకపోతే ఇంకా తెచ్చిస్తాం. కానీ మా పేదల పాలిటి పెన్నిధి, మా ఊరి వైద్యుణ్ని మీరు రక్షించండి’ అని ముక్తకంఠంతో వేడుకున్నారు ప్రజలు. రామాచారిపైన ఆ ఊరి వారికున్న అనంతమైన అభిమానానికి కృష్ణాచారి కళ్లు చెమర్చాయి. ఇక ఆ డబ్బు తీసుకోకుండానే వైద్యం చేశాడు. రామాచారికి ప్రాణాపాయం తప్పింది.

అప్పుడు కృష్ణాచారి ప్రజలతో.. ‘‘ఇన్నాళ్లూ నేను ‘ధనమూలం ఇదం జగత్‌’ అంటే.. ఈ లోకంలో ధనమే ముఖ్యమని, డబ్బును మించింది ఏదీ లేదని గుడ్డిగా నమ్మాను. కానీ రామాచారి మీద మీరు చూపిన అభిమానాన్ని చూశాక.. మనిషికి ధనం కన్నా మించింది, ముఖ్యమైంది.. మరొకటుందని అదే అభిమానం అని అర్థమైంది. మీ ఊరి వైద్యుణ్ని కాపాడుకోవడానికి మీ గ్రామస్థులే కాకుండా, మా ఊరి వారు కూడా తమ వంతు సాయపడడం నా కళ్లు తెరిపించింది. నిజానికి వైద్యం జరిగింది మీ రామాచారికి కాదు. ధనం మత్తులో ఉన్న నాకు. ఇక నుంచి నేను కూడా మీ రామాచారిలాగే నా వైద్యాన్నీ ఉచితంగా ప్రజలందరికీ అందిస్తాను’’ అన్నాడు వర్షించిన కళ్లతో. ఆ మాటలు విని ప్రజలంతా రామాచారితో పాటూ కృష్ణాచారిని కూడా అభినందనలతో ముంచెత్తారు.  
-నంద త్రినాథరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని