అన్న సాయం.. తమ్ముడిలో మార్పు!

కవిటి గ్రామంలో నివసించే రైతు రమణయ్యకు ఇద్దరు కుమారులు. పెద్దవాడు వీర్రాజు, చిన్నవాడు సోమరాజు. ఇద్దరికీ వివాహం చేసి.. తనకున్న నాలుగు ఎకరాల పొలాన్ని సమానంగా పంచాడు. కొన్ని సంవత్సరాల వరకు ఇద్దరూ కలిసి చక్కగా వ్యవసాయం చేసుకున్నారు. చిన్నవాడైనా సోమరాజు వ్యవసాయం లాభసాటిగా లేదని తన వాటాను అమ్మేసి.. పట్నం వెళ్లి వ్యాపారం చేసుకోసాగాడు. వీర్రాజు మాత్రం తన రెండెకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం గడిపేవాడు.

Updated : 29 Mar 2024 05:04 IST

విటి గ్రామంలో నివసించే రైతు రమణయ్యకు ఇద్దరు కుమారులు. పెద్దవాడు వీర్రాజు, చిన్నవాడు సోమరాజు. ఇద్దరికీ వివాహం చేసి.. తనకున్న నాలుగు ఎకరాల పొలాన్ని సమానంగా పంచాడు. కొన్ని సంవత్సరాల వరకు ఇద్దరూ కలిసి చక్కగా వ్యవసాయం చేసుకున్నారు. చిన్నవాడైనా సోమరాజు వ్యవసాయం లాభసాటిగా లేదని తన వాటాను అమ్మేసి.. పట్నం వెళ్లి వ్యాపారం చేసుకోసాగాడు. వీర్రాజు మాత్రం తన రెండెకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం గడిపేవాడు. తండ్రి రమణయ్య కూడా తనతోనే ఉండేవాడు. ఆయన ఉన్నంత వరకు సోమరాజు అప్పుడప్పుడు ఊరికి వచ్చి వెళ్లేవాడు. తండ్రి మరణించిన తర్వాత ఇక రావడం మానేశాడు. ఎప్పుడో ఎక్కువ అవసరం ఉంటే తప్ప గ్రామానికి వచ్చేవాడు కాదు.

సోమరాజుకు ఒకే ఒక కుమారుడు అఖిలేష్‌. కార్పొరేట్‌ స్కూల్లో చదువుతున్నాడు. తల్లిదండ్రుల అతిగారాబం వల్ల ఆ అబ్బాయి ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగేది. చదువుపై అంత శ్రద్ధ వహించేవాడు కాదు. వీర్రాజుకు ఒక కుమారుడు ఒక కుమార్తె. కుమారుడు సిద్ధేశ్‌ గ్రామంలోనే ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ చదువుతున్నాడు. కుమార్తె రమ్య పదో తరగతి చదువుతోంది. వీళ్లిద్దరూ క్రమశిక్షణగా పెరిగారు. తండ్రి కష్టం తెలిసిన వారు కాబట్టి చక్కగా చదువుకునేవారు. అఖిలేష్‌ మాత్రం ఇష్టం వచ్చినట్లు డబ్బు ఖర్చు చేసేవాడు. సిద్ధేశ్‌ ఇంటర్మీడియట్‌లో చక్కని మార్కులు తెచ్చుకోవడమే కాకుండా.. వైద్య విద్య అభ్యసించడానికి మంచి వైద్య కళాశాలలో ప్రవేశం కూడా సంపాదించాడు. కానీ అతని చదువుకు ఇంకాస్త డబ్బు అవసరమైంది. పట్టణంలో ఉన్న తమ్ముడిని సాయం అడుగుదామని సోమరాజు ఇంటికి బయలుదేరాడు వీర్రాజు. అక్కడికి వెళ్లాక.. ‘సిద్ధేశ్‌కు వైద్య విద్య చదవడానికి ప్రవేశం లభించింది. కానీ కొంత ఫీజు చెల్లించాల్సి ఉంది. ఈ ఏడాది పంటలు సరిగ్గా పండకపోవడంతో ఆ సొమ్ము సర్దుబాటు చేయలేకపోతున్నాను. నువ్వు ఇప్పుడు కాస్త సర్దుబాటు చేస్తే, ఒక ఏడాదిలో మళ్లీ తిరిగి ఇచ్చేస్తాను’ అని తమ్ముని కోరాడు. సోమరాజు కాసేపు ఆలోచించి.. ‘అన్నయ్యా! ఇప్పుడు నా వ్యాపారం కూడా సరిగ్గా సాగటం లేదు. నాకు చాలా అప్పులున్నాయి. ఇప్పుడైతే నా దగ్గర ఎటువంటి సొమ్ము లేదు. నీకు ఇప్పుడు సాయం చేయలేను’ అని ఖరాకండిగా చెప్పేశాడు. వీర్రాజు తమ్ముడి మాటలు విని, చేసేదేమీ లేక బాధపడుతూ గ్రామానికి చేరుకున్నాడు.

కొడుకు చదువుకు ఇబ్బంది రాకూడదని ఒక ఎకరం పొలాన్ని తనఖా పెట్టి వైద్య విద్యకు కావలసిన డబ్బు అప్పు తీసుకున్నాడు వీర్రాజు. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు తమ్ముడి నుంచి ఫోన్‌ వచ్చింది.. ‘అన్నయ్యా! నా కొడుకు అఖిలేష్‌ అనుకోకుండా బండి మీద నుంచి పడిపోయాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో.. కోమాలో ఉన్నాడు. నాకు చాలా భయంగా ఉంది. నువ్వు ఒకసారి రా!’ అన్నాడు సోమరాజు. వెంటనే బయలుదేరి వెళ్లాడు వీర్రాజు. వారం రోజులపాటు తమ్ముడికి తోడుగా ఉన్నాడు. రోజుకు లక్ష రూపాయల కట్టాల్సి రావడంతో.. సోమరాజు అప్పు కోసం చాలా చోట్ల ప్రయత్నించాడు. కానీ.. లాభం లేకుండా పోయింది. తమ్ముడి పరిస్థితి గమనించిన వీర్రాజు.. తన పిల్లల చదువు నిమిత్తం ఉంచిన సొమ్ము సోమరాజుకు ఇచ్చి వైద్యం చేయించాడు. అలా ఒక నెల రోజుల తర్వాత మెల్లగా అఖిలేష్‌ కోలుకున్నాడు.

కొన్ని రోజులకు సోమరాజు తన కుటుంబంతో కలిసి.. వీర్రాజు ఇంటికి వెళ్లాడు. ‘అన్నయ్యా! నేను గ్రామంలో పొలం అమ్ముకొని వ్యాపారం మీద దృష్టి పెట్టి, సంపాదనే ముఖ్యమనుకున్నాను. ఆస్తిని సంపాదించాను కానీ.. కొడుకుని గారాబం చేసి, వాడి ఆరోగ్యం అలా అవ్వడానికి కారణమయ్యాను. నీ కుమారుడి చదువు కోసం వచ్చి అడిగినా నేను సహాయం చేయలేదు. కానీ నువ్వు నేను అడగకపోయినా నా పరిస్థితి గమనించి ఆదుకున్నావు. నేను నమ్మిన వాళ్లెవరూ.. ఆ సమయంలో నన్ను పట్టించుకోనే లేదు.. నన్ను క్షమించు! మానవ సంబంధాలను, ఆర్థికంగా ముడిపెట్టకూడదని నాకు తెలియజేశావు. అలాగే నా కొడుకుని కూడా సక్రమమైన మార్గంలో నడిచేలా చూడు అన్నయ్యా.. వాడిని నీ దగ్గరే ఉంచి వెళ్తాను’ అన్నాడు సోమరాజు. అప్పుడు వీర్రాజు.. ‘నువ్వేమీ బాధపడకు.. నీ కుమారుడిలో నేను మార్పు తీసుకొస్తాను’ అని చెప్పి తమ్ముడిని అక్కున చేర్చుకున్నాడు.

మొర్రి గోపి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు