రాజు మెచ్చిన వైద్యుడు!

విద్యానగర శివారులో రామాపురం అనే చిన్న గ్రామం ఉండేది. అక్కడ మణిశర్మ అనే వైద్యుడు ఉండేవాడు. అతను వైద్యంలో నిష్ణాతుడు. ఎలాంటి రోగాలనైనా ఇట్టే తగ్గించగలడు. తన హస్తవాసి మంచిదని ప్రజలంతా చెప్పుకునేవారు.

Updated : 31 Mar 2024 00:20 IST

విద్యానగర శివారులో రామాపురం అనే చిన్న గ్రామం ఉండేది. అక్కడ మణిశర్మ అనే వైద్యుడు ఉండేవాడు. అతను వైద్యంలో నిష్ణాతుడు. ఎలాంటి రోగాలనైనా ఇట్టే తగ్గించగలడు. తన హస్తవాసి మంచిదని ప్రజలంతా చెప్పుకునేవారు. కానీ మణిశర్మకు డబ్బు మీద అత్యాశ. వైద్యం చేసి.. రోగుల నుంచి అధిక మొత్తంలో డబ్బు వసూలు చేసేవాడు. దాంతో.. పేదవాళ్లు అతని వద్దకు వెళ్లడానికి భయపడే వాళ్లు. వైద్యం చేస్తూ సంపద కూడబెట్టినా.. అతనికి మాత్రం సంతృప్తిగా ఉండేది కాదు. మరింత ధనం ఎలా సంపాదించాలా.. అని ఆలోచించేవాడు.

మణిశర్మకు ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు.. శ్రవణుడు, తన చదువు పూర్తయింది. ఆ అబ్బాయికి కూడా వైద్యం నేర్పిస్తే.. మరింత డబ్బు సంపాదించవచ్చని నిర్ణయించుకున్నాడతను. అలా కొంతకాలం ఇంటి వద్దే ఉండి మెలకువలు నేర్చుకున్న శ్రవణుడికి.. తండ్రి రోగులకు అందిస్తున్న సేవలు బాగానే అనిపించాయి. కానీ.. వాళ్ల నుంచి డబ్బు వసూలు చేయడం మాత్రం నచ్చేది కాదు. అదే విషయం తండ్రికి చాలాసార్లు చెప్పి చూశాడు. అందుకు ఆయన నవ్వుతూ.. ‘చూడు శ్రవణా.. అందరికీ ఉచితంగా వైద్యం చేయాలంటే.. అందుకు కావాల్సిన ద్రవ్యాలు, మూలికలు మనకు ఎవరు ఇస్తారు? అదంతా తర్వాత సంగతి, ముందు నువ్వు వైద్యరంగంలో శిక్షణ పొందాలి. మంచి వైద్యుడు అనే పేరు తెచ్చుకుంటే బాగా డబ్బు సంపాదించవచ్చు’ అన్నాడు.  

తండ్రి మాటలకు ఎదురు చెప్పలేని శ్రవణుడు.. ‘నాన్నా.. నేను ఏదైనా ఆశ్రమానికి వెళ్లి ఆయుర్వేద వైద్యంలో మరిన్ని మెలకువలు నేర్చుకుంటాను. ఏ జబ్బుకైనా తక్కువ సమయంలో ఉపశమనం కలిగేలా ఎలా వైద్యం చేయాలో తెలుసుకుంటాను’ అని చెప్పాడు. అప్పుడు మణిశర్మ.. ‘అలాగే! నీకు నచ్చినట్లే.. వెళ్లి నేర్చుకో. అది మనకు చాలా ఉపయోగపడుతుంది. రేపు ఉదయాన్నే నాకు తెలిసిన ఒక ఆశ్రమంలో చేర్పిస్తాను’ అని బదులిచ్చాడు. కొన్ని నెలల్లోనే శ్రవణుడు వైద్యరంగం మీద పట్టు సాధించి.. తిరిగి గ్రామానికి చేరుకున్నాడు. కొడుకుని గొప్ప వైద్యుడిగా చూసి.. మణిశర్మ చాలా సంతోషించాడు. తండ్రిలాగానే తను కూడా అందరికీ వైద్యం చేయడం ప్రారంభించాడు. కానీ ఎవరి దగ్గరా.. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగానే సేవలు అందించేవాడు. అది మణిశర్మకు అస్సలు నచ్చలేదు.

దాంతో శ్రవణుడు ఊరి చివర ఒక చిన్న గుడిసె ఏర్పాటు చేసుకొని అక్కడ వైద్యసేవలు అందించసాగాడు. త్వరలోనే శ్రవణుడి వద్దకు వచ్చే రోగుల సంఖ్య క్రమంగా పెరిగిపోయింది. అతను మంచి వైద్యుడన్న పేరు మారు మోగింది. శ్రవణుడి ప్రతిభ గురించి నగరమంతా తెలిసి.. అది మహారాజు వరకు వెళ్లింది. అతన్ని సత్కరించి.. రాజ వైద్యుడిగా నియమించుకోవాలని నిర్ణయించుకున్నాడు రాజు. వెంటనే ఇద్దరు భటులను పంపించి శ్రవణుడిని కోటకు తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. చెప్పినట్లుగానే భటులు అతని దగ్గరకు వెళ్లి రమ్మని చెప్పగా.. ‘మహారాజుకి నేను క్షమాపణలు చెప్పానని చెప్పండి. ఈ సత్కారాలు నాకు ఇష్టం ఉండవు’ అన్నాడు. దాంతో కోపం తెచ్చుకున్న రాజు.. శ్రవణుడిని బంధించి తీసుకురమ్మన్నాడు. అక్కడికి వెళ్లాక.. ‘అభిమానంతో పిలిస్తే.. నువ్వు మా ఆహ్వానాన్ని తిరస్కరించి తప్పు చేశావు. వైద్య రంగంలో నువ్వు సాధించిన ప్రతిభకు గుర్తింపు ఇచ్చి.. నిన్ను రాజ వైద్యుడిగా నియమించాలనుకున్నాం. రాజధిక్కారం కింద నీకు శిక్ష పడుతుంది’ అన్నాడు మహారాజు.

అప్పుడు శ్రవణుడు.. ‘మన్నించండి రాజా! రాజ్యంలో చాలామంది పేదవాళ్లు వైద్యం అందక చనిపోతున్నారు. సామాన్యుడికి వైద్యం అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతోనే నేను ఆశ్రమంలో శిక్షణ పొందాను. రాజ దర్బారులో ఉండిపోతే నా ఆశయం నెరవేరదు. అందుకే నేను గ్రామంలోనే ఉండి ప్రజలకు సేవ చేస్తాను’ అన్నాడు. ఆ మాటలు విన్న రాజు శ్రవణుడిని మెచ్చుకున్నాడు. కొడుకుని రాజు దర్బార్‌కి పిలిపించారని తెలియగానే మణిశర్మ భయంతో పరిగెత్తుకుంటూ వచ్చాడు. అక్కడ జరిగింది చూసి చాలా ఆనందపడ్డాడు. తను కూడా అప్పటి నుంచి ఉచితంగా వైద్యం చేయడం ప్రారంభించాడు.

బూర్లె నాగేశ్వరరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని