పులికి సింహం పాఠాలు..!

సుందరవనంలో కేసరి అనే సింహం ఉండేది. అది ఒకసారి తీవ్రమైన అస్వస్థతకు గురైంది. దాంతో కొన్ని రోజుల వరకు, దాని బాధ్యతలు ఇంకో జీవికి అప్పగించాలని నిర్ణయించుకుంది.

Published : 03 Apr 2024 00:33 IST

సుందరవనంలో కేసరి అనే సింహం ఉండేది. అది ఒకసారి తీవ్రమైన అస్వస్థతకు గురైంది. దాంతో కొన్ని రోజుల వరకు, దాని బాధ్యతలు ఇంకో జీవికి అప్పగించాలని నిర్ణయించుకుంది. అందుకోసం.. అర్హత కలిగిన జీవిని ఎంచుకోవాలని జంతువులను పిలిచి సమావేశం ఏర్పాటు చేసింది. అక్కడికి వచ్చిన జీవులన్నీ.. ‘మృగరాజా! ఇన్ని రోజులు మాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకున్నారు. ఎప్పటికీ మీరే రాజుగా ఉండాలనేది మా అందరి కోరిక’ అన్నాయి. ‘వృద్ధాప్యం వల్ల నా ఆరోగ్యం సరిగ్గా ఉండటం లేదు. కొన్ని రోజులు మరో జీవిని మన అడవికి మృగరాజుగా ఉంచడం మంచిది. అయినా.. నా తర్వాత అడవిని పాలించడానికి కచ్చితంగా ఇంకో రాజు కావాలి కదా!’ అంది సింహం. అప్పుడు జంతువులు.. ‘ఎవరికి అర్హత ఉందని మీకు అనిపిస్తుందో.. దాన్నే రాజుగా ప్రకటించండి. మీ మాటకు మేమంతా కట్టుబడి ఉంటాం’ అన్నాయి. కాసేపు ఆలోచించిన సింహం.. పెద్దపులి తన వంతు బాధ్యత తీసుకోవాలని చెప్పింది. మంత్రిగా దానికి నచ్చిన జీవిని పెట్టుకోవచ్చని కూడా అంది. పులితో పాటు జంతువులన్నీ కూడా ఆ నిర్ణయాన్ని అంగీకరించాయి. మంత్రిగా నక్కను పెట్టుకుంటానని చెప్పింది పులి. దానికి సింహం కూడా సరేనంది.

మరుసటి రోజు నుంచి పులి ఆ అడవికి రాజుగా ఉండసాగింది. రోజులు గడుస్తున్నా కొద్దీ.. ప్రతిదానికి నక్క మీదనే ఆధారపడి అది చెప్పినట్లే చేయడం ప్రారంభించింది మృగరాజు. అదేమో రోజుకో జంతువుతో గొడవ పెట్టుకొని.. చెప్పిన మాట వినని జంతువును పులితో చంపిస్తూ ఉండేది. కొన్ని రోజులకు అడవిలోని జీవులన్నీ వెళ్లి.. నక్క చేస్తున్న పనులు పులికి చెప్పాయి. ‘నక్క మంత్రిగా ఉండాలని నేనంటే.. సింహం కూడా ఒప్పుకుంది. మీరంతా కూడా.. సరేనన్నారు. అది మంత్రిగా ఉండటం ఇష్టం లేక, మీరే అబద్ధం చెబుతున్నారేమో?’ అని బదులిచ్చింది పులి. ఇక నిరాశతో తిరిగొస్తున్న వాటికి.. కుందేలు ఎదురయింది. జరిగిందంతా దానికి వివరించాయి.

అది ధైర్యం చెప్పి.. పులి వద్దకు ఒంటరిగా వెళ్లింది. ‘పులిరాజా! ఈ నక్క ఇంతకు ముందులా లేదు. అది చెప్పినట్లు వినని జంతువులను మీతో చంపిస్తుంది. నా గురించి కూడా అది మీకు చాడీలు చెప్పే ఉంటుంది. దాని చెప్పుడు మాటలు మీరు నమ్మొద్దు. నిజమేదో, అబద్ధమేదో ప్రత్యక్షంగా తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు సరిగ్గా ఉండకపోతే.. భవిష్యత్తులో జంతువులు మిమ్మల్ని రాజుగా అంగీకరించవు. సింహం బతికినంత కాలం మీకు ఫర్వాలేదు.. కానీ తర్వాత చాలా కష్టం. ఒక్క జంతువు మీకు అబద్ధం చెప్పొచ్చు కానీ.. ఇన్ని జంతువులు ఒక్కసారిగా వచ్చి ఆ నక్క గురించి చెడుగా చెప్పాయంటే ఇందులో ఏదో మర్మం ఉందనే కదా అర్థం. ఒకసారి ఆలోచించండి’ అంది.

పులి అలా ఆలోచిస్తూ ఉండగానే.. అక్కడికి నక్క వచ్చింది. కోపంగా ఉన్న మృగరాజును చూసి, విషయం అర్థం చేసుకున్న నక్క.. అక్కడి నుంచి పారిపోయింది. అప్పుడు దాని వల్ల అడవికి జరిగిన నష్టం తెలుసుకున్న పులి.. జంతువులన్నింటినీ పిలిపించి.. ‘నక్క వల్లే ఇదంతా జరిగిందని నాకు అర్థమైంది. దాని మాటలు విని.. ఇన్ని రోజులు కొన్ని జంతువులను చంపాను. ఇక ముందు అలా జరగదని హామీ ఇస్తున్నాను. ఇప్పటి నుంచి నా పరిపాలనలో మీకు ఏ లోటూ రానివ్వను. బుద్ధిశాలి అయిన కుందేలు రేపటి నుంచి నా మంత్రిగా ఉంటుంది’ అంది.

అప్పుడే అక్కడికి వచ్చిన సింహం.. ‘మనం ఏ పని చేస్తున్నా కూడా.. సొంత ఆలోచన అనేది చాలా ముఖ్యం. ఒకవేళ ఎదుటి వారి సలహాలు పాటించినా.. అది కొంత వరకు మాత్రమే. ఇప్పుడు నువ్వు నక్క మీద ఆధారపడినట్లు ఉంటే.. మన ఉనికికే ప్రమాదం. ఎంత తెలివైన వాళ్లు నీకు మంత్రిగా ఉన్నా.. సొంత ఆలోచన, ఆచరణ నీ అధికారాన్ని నిర్ణయిస్తుంది. ఇప్పుడు ఇది నీకు ఒక అనుభవం అలాంటిది. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకో!’ అని చెప్పింది. సింహం ఆరోగ్యంగా తిరిగి రావడంతో.. జంతువులన్నీ సంతోషించాయి. అప్పటి నుంచి పులి.. సింహం దగ్గర చేరి, మృగరాజుగా ఎలా నడుచుకోవాలో నేర్చుకోసాగింది.

 సంగనభట్ల చిన్న రామకిష్టయ్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని