పాము పిల్లకు తెలిసొచ్చింది..!

ఒక చిట్టడవిలో పాము దాని కూతురితో జీవించేది. అది చాలా పెంకిది. తల్లి మాటలు అస్సలు లెక్కచేసేది కాదు. ప్రతి దానికీ తల్లితో మొండిగా వాదించేది. తల్లి పాము మాత్రం పిల్ల పాముకు ఎన్నో జాగ్రత్తలు చెప్పేది.

Published : 04 Apr 2024 01:05 IST


క చిట్టడవిలో పాము దాని కూతురితో జీవించేది. అది చాలా పెంకిది. తల్లి మాటలు అస్సలు లెక్కచేసేది కాదు. ప్రతి దానికీ తల్లితో మొండిగా వాదించేది. తల్లి పాము మాత్రం పిల్ల పాముకు ఎన్నో జాగ్రత్తలు చెప్పేది. ‘మనం పాములం. అడుగడుగునా అపాయాలు ఉంటాయి. ముఖ్యంగా మనుషుల కంట పడకూడదు. ఒకవేళ వాళ్లకు కనిపిస్తే.. మనల్ని చంపేస్తారు. అలాగే మనకు మరో శత్రువులు ముంగిసలు. అవి కూడా మనల్ని ముక్కలు చేసి చంపుతాయి. ఆకాశంలో ఎగిరే గద్దలు, డేగలు కూడా మన వెంçË పడతాయి. అందుకని అనుక్షణం జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడూ లోతైన పుట్టల్లో.. ఎవరికీ కనిపించని చోటే జీవించాలి’ అని చెబుతుండేది. ‘అన్ని జంతువుల్లా మనం ఎందుకు స్వేచ్ఛగా జీవించకూడదు? ఎవరికో భయపడుతూ ఎందుకు బతకాలి? నాకు గుట్టల్లో, పుట్టల్లో ఎప్పుడూ ఒకేలా.. మన్ను తిన్న పాములా జీవించడం అస్సలు ఇష్టం ఉండదు. చక్కగా మైదానంలో తిరగాలనిపిస్తుంది. నాకు నచ్చినట్లు తిరుగుతాను’ అంటూ మూర్ఖంగా జవాబిచ్చేది పిల్ల పాము. ఇక చేసేదేం లేక ఎప్పుడూ దాన్ని కనిపెట్టుకుంటూ ఉండేది తల్లి పాము.

అదే అడవిలో ఒక ముంగిస ఉండేది. దానికి ఎప్పటి నుంచో ఆ పాము పిల్లను తినాలని కోరికగా ఉండేది. అయితే పెద్ద పాములన్నీ దానికి రక్షణ కవచంగా ఉండటంతో ఆ ముంగిస ఆటలు సాగేవి కాదు. ఒకసారి పెద్ద పాములన్నీ ఆహార అన్వేషణకు వెళ్లాయి. అదే మంచి సమయం అనుకొని ముంగిస.. మెల్లగా పిల్ల పాము దగ్గరకు వచ్చి.. ‘నీ పేరేంటమ్మా?’ అని ప్రేమగా అడిగింది. ముంగిసని ఎప్పుడూ చూడని ఆ పిల్ల పాము, ఆశ్చర్యంగా చూసింది. కాసేపటికి తన పేరు పిల్ల పాము అని చెప్పింది. ‘ఓహో పిల్ల పాము అంటే నువ్వేనా? నీ పేరు చాలాసార్లు విన్నాను కానీ.. ఇప్పుడే చూస్తున్నాను. నువ్వు భలే బాగున్నావు’ అందా ముంగిస. ‘నా సంగతి సరే. మరి నీ పేరేంటి? ఇంతకు ముందెప్పుడూ.. ఈ చుట్టుపక్కల కనిపించలేదు’ అడిగింది పిల్ల పాము.

‘నేనెవరో దీనికి తెలియదు కాబట్టి.. ఎంచక్కా ఇప్పుడు తినేయొచ్చు’ అనుకుంటూ మనసులోనే ఆనందపడిందది. అందుకే అది చాలా తెలివిగా.. ‘నా పేరు ఉడుము’ అని మార్చి చెప్పింది. ‘ఓహో నీ పేరు ఉడుమా? మా అమ్మ మా విరోధ జంతువుల పేర్లు కొన్ని చెప్పింది. అందులో నీ పేరు లేదులే.. కాబట్టి నేను భయపడాల్సిన పని లేదు. నువ్వు చాలా మంచి దానిలా ఉన్నావు. మరి నాతో స్నేహం చేస్తావా?’ అని అమాయకంగా అంది పిల్ల పాము. ‘తప్పకుండా చేస్తాను.. అందుకేగా నేను వచ్చింది. నాకూ నీలాంటి చిన్న పిల్లలతో స్నేహం చేయడమంటే భలే ఇష్టం. ఈ రోజు నుంచి మనం స్నేహితులం సరేనా?’ అంది కపటబుద్ధి కలిగిన ముంగిస.

పిల్ల పాము దాన్ని గుడ్డిగా నమ్మేసింది. మంచి నేస్తం దొరికిందని చాలా సంతోషించసాగింది. ఆ తర్వాత కాసేపటి వరకు ఎంచక్కా రెండూ.. కబుర్లు చెప్పుకున్నాయి. ఇక ఎక్కువ సమయం వృథా చేయకుండా.. ఆ పిల్ల పాముని వెంటనే చంపాలని చూసిన ముంగిసని అన్ని వైపుల నుంచి ఒక్కసారిగా పాములన్నీ చుట్టుముట్టాయి. దాంతో భయపడి తోక ముడుచుకొని అక్కడి నుంచి పారిపోయిందది. అదంతా చూసిన పిల్ల పాము కంగారు పడిపోయింది. అప్పుడు తల్లి పాము.. ‘మేం రావడం కాస్త ఆలస్యమయ్యి ఉంటే.. ఆ ముంగిస నిన్ను ముక్కలు ముక్కలుగా కొరికి చంపేసేది. అందుకే మన క్షేమం కోరి పెద్దలు చెప్పిన మాటలను పాటించాలి. ఎప్పుడూ ఎదురు చెప్పకూడదు. భూమి మీద నివసించే ప్రతి జీవికీ కొన్ని నియమాలు ఉంటాయి. అలాగే.. మన సర్పజాతికి కూడా ఉన్నాయి. మనం వాటికి వ్యతిరేకంగా జీవించాలని చూస్తే, ఇదిగో ఇలాగే ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతాం. ఇప్పటికయినా చెప్పినట్లు విను’ అంది. చేసిన తప్పు తెలుసుకున్న పిల్ల పాము.. అప్పటి నుంచి తల్లి చెప్పిన మార్గంలోనే నడవసాగింది.

నంద త్రినాథరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని