ఇష్టపడితే.. కష్టమవదు..!

‘బన్నీ! ఈ రోజు న్యూస్‌ పేపర్‌ ఇంకా రాలేదు. పేపర్‌ వేసే అబ్బాయి గేటు బయట వేశాడేమో ఒకసారి చూడు’ అన్నాడు ముకుందం. ‘అలాగే.. తాతయ్యా! అయినా ఎందుకు, ఎప్పుడూ పేపర్‌ కోసం ఎదురు చూస్తుంటారు..

Updated : 06 Apr 2024 04:40 IST

‘బన్నీ! ఈ రోజు న్యూస్‌ పేపర్‌ ఇంకా రాలేదు. పేపర్‌ వేసే అబ్బాయి గేటు బయట వేశాడేమో ఒకసారి చూడు’ అన్నాడు ముకుందం. ‘అలాగే.. తాతయ్యా! అయినా ఎందుకు, ఎప్పుడూ పేపర్‌ కోసం ఎదురు చూస్తుంటారు.. అందులో ఏముంటుంది? అన్నాడు బన్నీ. ‘పేపర్‌లో చాలా విషయాలు ఉంటాయి. మన చుట్టూ జరుగుతున్నవి, ఇంతకు ముందు జరిగినవి, జరుగబోతున్నవన్నీ ఉంటాయి’ అని నవ్వుతూ చెప్పాడు ముకుందం. ‘అలా చెప్తే నాకు అర్థం కాలేదు తాతయ్యా. కొంచెం వివరంగా చెప్పండి’ అని ఆసక్తిగా అడిగాడు బన్నీ. మన దేశానికి, రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన వార్తలు, మన చుట్టు పక్కల ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలు, వింతలు విశేషాలూ.. సినిమా, ఆరోగ్యానికి చెందిన విషయాలు.. ఉద్యోగ, ఆస్తి ప్రకటనలు.. పిల్లలకు సంబంధించిన చిన్న చిన్న కథలు ఇలా చాలానే ఉంటాయి బన్నీ’ అని వివరంగా చెప్పాడు తాతయ్య.

‘అమ్మో! ఇన్ని విషయాలు ఉంటాయా?’ ఆశ్చర్యపోయాడు బన్నీ. ‘అవును! ఎన్నో రకాల దినపత్రికలుంటాయి. అన్ని పేపర్లలో నేను చెప్పినవన్నీ ఒకే క్రమంలో ఉండవు.. కానీ అన్ని విషయాలూ ఉంటాయి బన్నీ’ అన్నాడు ముకుందం. ‘అవును తాతయ్యా.. మీరు చాలాసేపు పేపర్‌ చదువుతారు కదా! విసుగ్గా అనిపించదా? కుతూహలంగా అడిగాడు బాబు. ‘ఇష్టం లేని పని చేస్తుంటే విసుగు వస్తుంది. కానీ నచ్చిన పని చేస్తుంటే ఎప్పుడూ అలా అనిపించదు. నాకు చదవడమంటే ఇష్టం కాబట్టి విసుగు రాదు. నువ్వు ఎప్పుడూ ఆ ఫోన్‌ చూసుకుంటూ కాలక్షేపం చేస్తుంటావు. మీ అమ్మానాన్న అరిచి చెప్పినా.. వినవు. ఫోన్‌ ఎక్కువగా చూడటం వల్ల కళ్లకు హాని కలుగుతుంది. మెదడు మీద ప్రభావం పడుతుంది. అదే పేపర్‌, కథల పుస్తకాలు చదివితే ప్రపంచ జ్ఞానం పెరుగుతుంది’ అని అర్థమయ్యేలా చెప్పాడు ముకుందం. ‘స్కూల్లో చదవాలి.. ఇంటికి వచ్చాక, హోంవర్క్‌ చేసి మళ్లీ చదువుకోవాలి. ఇక కథల పుస్తకాలు కూడా చదవాలంటే బోర్‌ తాతయ్యా!’ అన్నాడు బన్నీ. ‘సరే అలా అయితే ఆటస్థలానికి వెళ్లి స్నేహితులతో కలిసి ఆడుకో.. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటావు. మరో విషయం.. ఫోన్‌లో గేమ్స్‌ ఆడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం అలవాటు చేసుకుంటేనే.. తరగతులు పెరిగేకొద్దీ చదవడం సులువవుతుంది’ అన్నాడు ముకుందం. ‘అలాగే తాతయ్యా! ఇక నుంచి మీరు చెప్పినట్లు చేస్తాను. నేను కూడా పేపర్‌ చదవడం అలవాటు చేసుకుంటాను’ అన్నాడు బన్నీ. ‘మొదట్లో రోజుకి ఒక వార్త హెడ్డింగ్‌ చదువు. అలా నెమ్మదిగా నీకే అలవాటు అవుతుంది’ అన్నాడాయన.

ఒకరోజు సాయంత్రం బన్నీ స్కూల్‌ నుంచి రావడమే పరుగెత్తుకుంటూ.. తాతయ్య దగ్గరకు వచ్చాడు. అతని చేతిలో ఒక బహుమతి కూడా ఉంది. ‘బన్నీ! ఏంటి అంత ఆనందంగా కనిపిస్తున్నావు?’ నవ్వుతూ అడిగాడు ముకుందం. ‘తాతయ్యా! ఈ రోజు నాకు ఉపన్యాస పోటీల్లో మొదటి బహుమతి వచ్చింది’ అని చేతిలో ఉన్నది చూపించాడు. ‘చాలా సంతోషం నాన్నా! మా బన్నీ బాగా చదువుతున్నాడన్నమాట. అందుకే.. బహుమతి వచ్చింది’ అని గారాబంగా అన్నాడాయన. అప్పుడు బన్నీ.. ‘ఈ బహుమతి మీ వల్లే వచ్చింది తాతయ్యా’ అన్నాడు. ‘అదెలా?’ ఆశ్చర్యంగా అడిగాడు ముకుందం. ‘స్కూల్లో మా టీచర్‌.. వార్తా పత్రికల గురించి మీకు తెలిసింది చెప్పండి అన్నారు. నాకు మీరు చెప్పిందంతా.. అక్కడ చెప్పాను. అందుకే నేను బహుమతి గెలుచుకున్నాను. ఇక నుంచి నేను ప్రతిరోజు మీతో పాటు పేపర్‌ చదువుతాను తాతయ్య’ అన్నాడు బన్నీ. ‘పేపర్‌ మాత్రమే కాదు.. కథల పుస్తకాలు కూడా చదువు. అప్పుడు కొత్తకొత్త పదాలు తెలుస్తాయి’ అని చెప్పాడు ముకుందం. ‘అయితే నాకు కథల పుస్తకాలు కొనిపెట్టండి తాతయ్యా!’ అడిగాడు బన్నీ. ‘రెండు రోజుల్లో నీ పుట్టినరోజు ఉంది కదా! అప్పుడు నీకు అదే బహుమతి ఇస్తాను బన్నీ’ అని బదులిచ్చాడు తాతయ్య. ‘అయితే ప్రత్యేక బహుమతి అన్నమాట’ అంటూ ఆనందంగా అన్నాడు బన్నీ.

 కె.వి. సుమలత


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని