బలపం.. తిలకం.. మారాయోచ్‌!

కృష్ణా నదీ తీరంలో ఉన్న కొండవీడు అడవిలో ఓ పెద్ద కోతి నివసించేది. దానికి బలపం, తిలకం అనే రెండు పిల్లలుండేవి. ఆ అడవిలో కోతులు చాలా తక్కువ.

Published : 07 Apr 2024 00:00 IST

కృష్ణా నదీ తీరంలో ఉన్న కొండవీడు అడవిలో ఓ పెద్ద కోతి నివసించేది. దానికి బలపం, తిలకం అనే రెండు పిల్లలుండేవి. ఆ అడవిలో కోతులు చాలా తక్కువ. అందుకే మిగిలిన జంతువులు వీటిని బాగా చూసుకునేవి. తల్లి కోతి గారాబంతో బలపం, తిలకం రెండూ అల్లరిగా తయారయ్యాయి. అస్సలు మాట వినేవి కాదు. ఒకరోజు బలపం.. పనసచెట్టు ఎక్కి కాయలు తెంపబోతుంటే.. ఒక కాయ చేజారి, అటుగా వెళ్తున్న పులి తల మీద పడింది. దాంతో అది కళ్లు తిరిగి పడిపోయింది. కాసేపాగి లేచిన తర్వాత.. చాలా కోపగించుకుని.. అవి ఇలాగే చేస్తే.. అడవిలో ఉండటం కష్టం అని హెచ్చరించింది.

అది అక్కడి నుంచి వెళ్లాక మిగతా జంతువులన్నీ కలిసి.. ‘వాటి అల్లరి మాన్పించే ప్రయత్నం చేయి. లేకపోతే అవి ఏమైపోతాయో అనిపిస్తుంది’ అని తల్లి కోతికి చెప్పాయి. ‘నేను ఎంత చెప్పినా నా మాట అస్సలు వినడం లేదు’ అని బాధగా బదులిచ్చిందది. ‘అయితే వాటిని చదువుకోవడానికైనా పంపాలి.. లేకపోతే ఎక్కడైనా పనిలో పెట్టాలి. మన అడవిలో చదువు నేర్పే జీవులు లేవు కాబట్టి.. ఎలుగుబంటి దగ్గరకు పంపించు. చక్కగా పనులు నేర్పుతుంది. అప్పుడు భయం, భక్తి రెండూ తెలిసొస్తాయి’ అని సలహా ఇచ్చింది కాకి. ‘అవును నిజమే!’ అంటూ దానికి వంత పాడాయి మిగతా పక్షులు.

మరుసటి రోజు ఉదయాన్నే.. రెండు కోతి పిల్లల్నీ తీసుకొని ఎలుగు దగ్గరకు బయలుదేరింది తల్లి కోతి. వాటి గురించి అంతా వివరంగా చెప్పి.. ఎలాగైనా దారిలో పెట్టాలని కోరింది. ‘నువ్వు ఇక వీటి సంగతి మర్చిపో.. తక్కువ రోజుల్లోనే అన్ని పనులు నేర్పించి, బాధ్యతలు తెలిసేలా చేస్తాను’ అని భరోసా ఇచ్చింది ఎలుగు. బలపం, తిలకాన్ని అక్కడే వదిలిపెట్టి.. తిరుగు ప్రయాణమైంది తల్లి కోతి. కాసేపటికి వాటిని పిలిచి.. ‘పిల్లలూ.. ఆ ఆనప బుర్ర తీసుకురండి.. ఇప్పుడు మనం మంచి తేనె తీసుకొద్దాం’ అంది ఎలుగు. మూడూ కలిసి తేనెపట్టు ఉన్న చోటుకు బయలుదేరాయి. ‘ఇప్పుడు నేను ఆ తేనెపట్టు ఎలా తీస్తున్నానో చూడండి.. ఇంకోసారి మీరే తీయాలి’ అంది ఎలుగు. ‘పర్లేదు.. మేమూ తియ్యగలం..’ అంటూ ఎలుగు సగం చెట్టు ఎక్కగానే.. బలపం చక చకా ఎక్కేసి.. ఒక కర్రను తేనెపట్టు మీదకు విసిరింది. దాంతో తేనెటీగలు మొత్తం.. కదిలిపోయాయి. బలపం, తిలకం అక్కడి నుంచి పారిపోయాయి.. కానీ ఎలుగు మాత్రం వాటికి బలైపోయింది. ఆఖరుకు పరిగెత్తుకుంటూ వెళ్లి.. దగ్గరే ఉన్న చెరువులో దూకేసిందది.

ఆ చోటు నుంచి తప్పించుకొని ఇంటికి చేరుకున్నాయి బలపం, తిలకం. వాటిని చూసి ఆశ్చర్యపోయి.. ‘ఇందాకే కదా మిమ్మల్ని ఎలుగు దగ్గర వదిలిపెట్టింది. అంతలోనే వచ్చేశారేంటి?’ అని ప్రశ్నించింది తల్లి కోతి. అప్పుడు అవి.. ‘అమ్మా! ఎలుగు మామకు అసలు ఏమీ రాదు. ఇక మాకేం పనులు నేర్పుతుంది. తేనెటీగలతో కుట్టించుకుంది’ నవ్వుతూ చెప్పాయి పిల్ల కోతులు. ‘ఇప్పుడెలా వీటి అల్లరి తగ్గేది..’ అని తల పట్టుకొని కూర్చుంది తల్లి కోతి. అప్పుడు పక్కనే ఉన్న కుందేలు వచ్చి.. ‘నేను చెప్పినట్లు చేస్తే వాటికి చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి కానీ.. కచ్చితంగా మార్పు వస్తుంది’ అంది.

ఇక తల్లి కోతి వాటిని పిలిచి.. ‘మన కుందేలు మామకు ఏదో కావాలట. వెళ్లి.. కాస్త ఆ పని చేసి పెట్టండి’ అంది. ‘సరేనమ్మా!’ అంటూ ఆ కుందేలు దగ్గరకు చేరుకుని.. ‘మామా! ఏదో సాయం అడిగావట. అది మేం చేయగలమా అసలు’ అని అడిగాయవి. ‘మీరు చేయగలరు.. అది చాలా చిన్న పని’ అంటూ వాటిని మామిడి చెట్టు దగ్గరకు తీసుకెళ్లిందది. ‘అదిగో ఆ చిటారు కొమ్మన ఉన్న మామిడిపండ్లు కావాలి’ అంది కుందేలు. అంతేనా.. అంటూ బలపం, తిలకం వెంటనే చెట్టు చిటారు కొమ్మకు ఎక్కేశాయి. వాటి బరువుకు ఆ కొమ్మ విరగడంతో రెండూ.. చెట్టు కిందున్న నూతిలో పడిపోయాయి. ఏం జరుగుతుందో తెలియని అవి.. భయంతో అరవడం మొదలుపెట్టాయి. ‘ముందూ.. వెనకా చూడకుండా చెట్టు ఎక్కేశాం. కాస్త ఆగి ఆలోచించి ఉంటే.. బాగుండేది. హడావుడిగా పనులు చేస్తే వాటి ఫలితం ఏంటో ఇప్పుడు తెలిసొచ్చింది. ఇంకెప్పుడూ మనం ఇలా చేయకూడదు’ అంటూ బలపం, తిలకం నూతిలోనే మాట్లాడుకోసాగాయి. ఇంతలోనే కుందేలు.. ఒక పెద్ద తాడు తీసుకొచ్చి.. ఆ నూతిలోకి వదిలింది. దాని సాయంతో పైకి ఎక్కి.. తల్లిని చేరుకున్నాయి రెండు పిల్ల కోతులూ. ‘ఇంకెప్పుడూ నిన్ను ఇబ్బంది పెట్టం. బుద్ధిగా ఉంటాం అమ్మా!’ అని చెప్పడంతో సంతోషించిందా తల్లి కోతి. అప్పటి నుంచి చక్కగా ఉంటూ పెద్ద జీవులు చెప్పినట్లే.. నడుచుకోసాగాయి బలపం, తిలకం.

 కూచిమంచి నాగేంద్ర


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని