ఇంతకీ చందనుడు ఎలా మారాడు?

గంగాపురంలో ముకుందుడు, చందనుడు అనే ఇద్దరు జమీందార్లు ఉండేవారు. వారు అన్నదమ్ముల బిడ్డలు. వారికి తరతరాలుగా వస్తున్న భూమి ఉంది.

Updated : 08 Apr 2024 03:12 IST

గంగాపురంలో ముకుందుడు, చందనుడు అనే ఇద్దరు జమీందార్లు ఉండేవారు. వారు అన్నదమ్ముల బిడ్డలు. వారికి తరతరాలుగా వస్తున్న భూమి ఉంది. అందులో పంట వేసి.. దాన్ని జాగ్రత్తగా ఇంటికి చేర్చే పనులన్నీ ప్రధాన అధికారులే చూసుకునేవారు. ఆ గ్రామంలో ఉండే చాలామంది కూలీలు, వీరి ఆధ్వర్యంలోనే పొలం పనులు చేసేవారు. కూలీలకు ఇవ్వాల్సిన జీతభత్యాల లెక్కలు, ఇతర ఖర్చులు, రాబడి అన్నీ చూసుకోవడానికి దివాను అనే ఉద్యోగి ఉండేవాడు. కాబట్టి జమీందార్లు కూలీలతో నేరుగా మాట్లాడే అవసరం వచ్చేది కాదు. అయినప్పటికీ ముకుందుడు మాత్రం పని వాళ్ల దగ్గరకు వెళ్లి.. వారి మంచి, చెడులు కనుక్కునేవాడు. పనులు ఎలా జరుగుతున్నాయో అడిగి తెలుసుకునేవాడు. అతనికి డబ్బు పిచ్చి ఉండేది కాదు. అందరినీ సమానంగా చూసేవాడు. పండిన పంటలో కొంత భాగాన్ని కూలీలకు పంచేవాడు. కానీ చందనుడు అసలు ఎవరినీ పట్టించుకునేవాడు కాదు. కూలీల దగ్గరికే వెళ్లేవాడు కాదు. తనకు ఎక్కువ డబ్బు ఉందనే గర్వం చూపించేవాడు. ప్రజల్ని అసలు లెక్క చేసేవాడు కాదు. ఎంత పంట వచ్చింది, దానికి తగ్గ డబ్బు వచ్చిందా లేదా అని మాత్రమే చూసుకునేవాడు. దాంతో అందరూ.. చందనుడు గర్విష్టి అని, ముకుందుడు పేదల మంచి కోరేవాడని అనుకునేవారు. ప్రజలు ముకుందుడికి ఇచ్చిన మర్యాద, గౌరవం.. చందనుడికి ఇచ్చేవారు కాదు.

ఒకరోజు పొరపాటున నిప్పు పడి ఊరికి దూరంగా ఉన్న కూలీల గుడిసెలన్నీ అంటుకున్నాయి. నీళ్లు చల్లి మంటలు ఆర్పినా.. ప్రయోజనం లేకుండాపోయింది. అప్పటికే సగం కంటే ఎక్కువ ఇళ్లు బూడిదయ్యాయి. విషయం తెలిసిన ముకుందుడు వెంటనే.. తన అధికారిని తీసుకొని ఘటనా స్థలానికి వెళ్లాడు. అక్కడంతా పరిశీలించి.. ప్రజలంతా కుదుటపడేంత వరకు వాళ్లకు తోడుగా ఉన్నాడు. ఉండటానికి వాళ్లకు తాత్కాలిక నివాసాలను ఏర్పాటు చేయించి.. ఆహారాన్ని కూడా అందించాడు. వారి అత్యవసరాలు తీర్చాడు. కాసేపటికి అక్కడికి వచ్చిన చందనుడు.. ప్రజలను పలకరించి ‘ఇలా జరిగినందుకు చాలా బాధగా ఉంది’ అని చెప్పి వెళ్లిపోయాడు.

ముకుందుడు మరుసటి రోజు సమావేశం ఏర్పాటు చేసి.. కూలీలకు వీలైనంత తొందరలో ఉచితంగా ఇళ్లు కట్టించి ఇస్తానని మాటిచ్చాడు. దానికి సంబంధించిన పనులు చూసుకోమని.. దివానును ఆజ్ఞాపించాడు. చెప్పినట్లుగా కొన్ని నెలల్లోనే అందరికీ ఇళ్లు నిర్మించి ఇచ్చాడు ముకుందుడు. సంతోషంగా కూలీలు ఇళ్లలోకి చేరిపోయారు. అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో.. వర్షాలు కురవకపోవడంతో.. మళ్లీ కరవు ఏర్పడింది. చేయడానికి పనులు లేక, తినడానికి తిండి దొరక్క గ్రామ ప్రజలంతా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. చందనుడు చేసిందేమీ లేదు.. ప్రశాంతంగా తన కోటలోనే ఉండిపోయాడు. ముకుందుడు మాత్రం.. అన్న సత్రాలు ఏర్పాటు చేయించాడు. అందరికీ రెండు పూటలా ఆహారం పెట్టించాడు. ఒకరోజు దివాను వచ్చి.. ‘అయ్యా! మీరు చేస్తున్న దానాలకు మన ధాన్యం, ఖజానాలోని ధనం చాలా ఖర్చవుతోంది. ఇలాగే చేసుకుంటూపోతే.. ఇంకేమీ మిగలదు’ అన్నాడు. ముకుందుడు చిన్నగా నవ్వి.. ‘ఇప్పుడు ఈ ప్రజలే లేకపోతే.. మన పొలాల్లో అసలు సరిగ్గా పంటలు పండేవే కాదు. ఎండలో ఎండుతూ, వర్షానికి తడుస్తూ పంటలు పండిస్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర ఇంత ఖజానా ఉందంటే.. దానికి కారణం వాళ్లే. అవసరం వచ్చినప్పుడు నేను వాళ్లకు ఉపయోగపడకపోవడం ధర్మం కాదు’ అని జవాబిచ్చాడు.

ఇంతలోనే అక్కడికి వచ్చిన చందనుడు ఈ మాటలన్నీ విన్నాడు. అప్పుడు అతనికి గ్రామంలోని ప్రజలు ఎందుకు ముకుందుడిని చూసినంత గౌరవంగా తనని చూడటం లేదో అర్థమైంది. తన తప్పుని తెలుసుకొని.. అప్పటి నుంచి కూలీలతో మాట్లాడుతూ వాళ్ల యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడం ప్రారంభించాడు. అతనిలో వచ్చిన మార్పుని చూసి ముకుందునితో సహా ప్రజలంతా సంతోషించారు.

 డి.కె.చదువులబాబు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని